ఓ లింగా... ఆ“..  భక్తా!

24 Feb, 2019 01:37 IST|Sakshi

‘పిలిస్తే పలుకుతడు.. కోరిక తీర్చమని మొక్కుకుంటే రెండేళ్లలోపే ఆ కోరిక తీరుతది.. ప్రతిఫలంగా మొక్కులు చెల్లించు కొనుడు.. లింగమ్మ, లింగయ్య, లింగేశ్వర్‌ అని పేర్లు పెట్టుకొనుడు..’ ఇదీ పెద్దగట్టు లింగమంతుల స్వామి మహత్యమని యాదవుల నమ్మకం. యాదవుల ఆరాధ్యదైవం లింగమంతుల స్వామి. అందుకే రెండురాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆయన పేర్లు వేలాదిమందికి ఉంటాయి. రెండేళ్లకోమారు సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో పెద్దగట్టు (గొల్లగట్టు)పై వెలసిన లింగమంతుల స్వామి జాతర జరుగుతుంది. సమ్మక్క, సారలమ్మల జాతర తర్వాత అతి పెద్దది లింగమంతుల స్వామి జాతర. యాదవులు, ఇతర కులస్తులతో సూర్యాపేట నుంచి కోదాడ మీదుగా వెళ్లే జాతీయ రహదారి, ఖమ్మం, నల్లగొండ, చౌటుప్పల్‌ వరకు రహదారుల్లో వేలాది వాహనాలతో జాతర నిండిపోతుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగే లింగమంతల స్వామి జాతరకు పెద్దగట్టు ముస్తాబయింది.

ఇలా వెలిశాడని..
క్రీ.పూ 500 ఎళ్ల క్రితం చోళ చాళుక్యులు (యాదవరాజులు), కాకతీయులు ఉండ్రుగొండ రాజధానిగా చేసుకుని పాలించేవారు. ఆ కాలంలో ఉండ్రుగొండ గుట్ట మీద శివాలయం, లక్ష్మీనరసింహస్వామి, లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, ఆంజనేయ దేవాలయాలు కట్టించారని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఏటా మాఘమాసంలో లింగమంతులు, చౌడమ్మతల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేవారట. జాతర సమయంలో ఓ నిండు గర్భిణి లింగమంతులస్వామి మొక్కు చెల్లించుకునేందుకు బోనం కుండ, పూజసామాగ్రితో గంపను ఎత్తుకుని పెద్దగట్టు ఎక్కుతుండగా కాలు జారి కిందపడి మృతి చెందిందని.. దీనికి చలించిన లింగమంతులస్వామి భక్తుల సౌకర్యార్థం పార్ల శేరయ్య(గొల్లగట్టు) పై వెలిశాడని అదే గొల్లగట్టు జాతరగా జరుపుతున్నామని యాదవులు పేర్కొంటున్నారు. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. కేసారం గ్రామానికి చెందిన యాదవులు, రెడ్లు గొర్రెలు, ఆవులను మేపుకుంటూ పెద్దగట్టు వద్దకు వెళ్తారు. కరువు కాటకాలతో ఉన్న ఈ ప్రాంతంలో నీరు లేక వారు ఇబ్బందులు పడతారు. గొర్రెల కాపరికి చద్దిమూట తెచ్చిన భార్యను ఆవేశించి లింగమంతుల స్వామి జీవాలు, గొర్రెల దాహం తీర్చాలంటే తాను చూపించిన చోట బావి తవ్వాలని చెప్పడంతో ఆమె మాట ప్రకారం బావి తవ్వారట. అందులో లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, శివలింగాలు  బయట పడ్డాయని.. వీటినే గొల్లగట్టుపై ప్రతిష్టించి పూజలు చేస్తూ.. కాలక్రమేణా ఇది జాతరగా మారిందని యాదవుల నమ్మకం. ఇలా పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. 

రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, బస్సులు, లారీల్లో భక్తులు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్‌ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి భారీగా తరలి వస్తారు. తొలి మూడు రోజులు జాతీయ రహదారి భక్తులతో కిటకిటలాడుతుంది.

భక్తి పారవశ్యంతో ఓ లింగనాదం..
ఓ లింగ.. ఓ లింగ నినాదాలు.. భేరీ చప్పుళ్లు.. కటార్లతో సాము.. తాళాలు, గజ్జల లాగులు, చండ్రకోళలు.. ఎటుచూసినా భక్తజన సంద్రంతో పెద్దగట్టు కనిపిస్తుంటుంది. ఈనెల 10న దేవుడికి దిష్టిపూజతో జాతర పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాన జాతర ఈనెల 24 నుంచి 28 వరకు ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జాతర వస్తుందంటేనే యాదవుల ఇళ్లల్లో పండుగ వాతావరణమే. జాతరకు వెళ్లే యాదవులు ఇంటిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. భేరీకి మరమ్మతులు చేయిస్తారు. కటార్లు, తాళాలు, భేరీలను ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజలు చేస్తారు. మొక్కులు చెల్లించుకునే భక్తులు జాతరకు ఇళ్లనుంచే ఓ లింగా .. ఓ లింగా అనుకుంటూ బయలుదేరుతారు. పెద్దగట్టు వద్దకు చేరుకున్న తర్వాత లింగమంతుల స్వామికి నైవేద్యబోనం వండుకొని దేవాలయం చుట్టూ మూడుసార్లు  తిరుగుతారు. ఇలా ఓ లింగ నినాదాలతో పెద్దగట్టు మార్మోగుతుంది. యాదవులే కాకుండా ఇతర కులస్తులు కూడా జాతరకు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఐదు రోజుల పాటు జరగనున్న జాతరలో భాగంగా మొదటి రోజు గంపల ప్రదక్షిణ, రెండోరోజు చౌడమ్మకు బోనాలసమర్పణ, మూడవ రోజు చంద్రపట్నం, నాలుగవ రోజు నెలవారం, ఐదవరోజు ముగింపు కార్యక్రమం చేపడతారు.
– బొల్లం శ్రీనివాస్, సాక్షి, సూర్యాపేట
 ఫొటోలు: అనమాల యాకయ్య, సాక్షి 

మరిన్ని వార్తలు