ప్రియనేస్తమా! 

24 May, 2018 01:21 IST|Sakshi

నాకు 76 సంవత్సరాలు!

జీవితంలో అన్నీ అనుభవించాను, మనసు సకల సౌఖ్యాలూ అనుభవించి, పరిపూర్ణమైన విందు భోజనం తిని సంతృప్తిగా, వెనక్కు వాలి, కూర్చున్నట్టుగా ఉంది.

 ఈ రకమైన జీవితం ఇక చాలు అనుకున్నాను, అన్నీ వదిలి, అందరికీ సెలవు చెప్పి నాకిష్టమైన వానప్రస్థాశ్రమానికి వచ్చేసాను. అక్కడ నా అందమైన కథల పూలతోట నా కోసం ఎదురు చూస్తోంది. ఒక్క క్షణం కళ్ళు తడితో బరువెక్కినాయి. ఇన్నాళ్ళూ నాకు తోడుగా ఉన్న నా ప్రియమైన కథల ప్రపంచం నా కంటే ముందు అక్కడికి వచ్చినట్టుంది. 

వయోభారంతో తడబడుతున్న అడుగులతో ఆ తోటలోకి వచ్చాను. ఎన్నెన్నో రకరకాల, రంగురంగుల కథల పువ్వులు నా కళ్ళకి కని పించాయి. వాటిని చూడగానే చెప్పలేని ఆనందం! నా మనసుకి పారవశ్యం! ఘుమ ఘుమ సువాసనలు వెదజల్లుతున్న పున్నాగపూల చెట్టు క్రింద ఉన్న ఒక రాయి మీద కూర్చోబోయి, తూలిపడిపోబోయాను. ఇంతలో, ఎవరో నా బుజాలు పట్టి, నేను పడకుండా ఆపి, నన్ను జాగ్రత్తగా రాయి మీద కూర్చోబెట్టారు. నా చేతిని పట్టుకున్న అతని చేతిని చూసాను. ‘‘వృద్ధాప్యానికి యౌవనం ఆసరా ఇచ్చినట్టుగా ఉంది.’’

‘‘తల్లిదండ్రులు – పిల్లలు’’ఇదేగా అనుబంధం..! 
తలెత్తి చూసాను, నా ఎదురుగా, దార్ఢ్యవంతుడు, స్ఫురద్రూపి, అయిన ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. ‘‘అతని కళ్ళలో అపారమైన అనుభవం కనిపిస్తోంది.’’ అతను నిత్యయౌవనుడిలా ఉన్నాడు. 
‘‘ఎవరు నువ్వు?’’ – అడిగాను.
‘‘మీ ప్రియమిత్రుడిని!’’– అన్నాడు.
‘‘నేను నిన్ను ఎప్పుడూ చూడలేదే?’’– అన్నాను.
‘‘మీరు నాకు బాగా తెలుసు’’ – అన్నాడు.
నేను అతన్ని పరీక్షగా చూస్తూ, ‘‘నేను అన్నీ అనుభవించి, అన్నీ వదులుకుని వానప్రస్థాశ్రమానికి వచ్చాను. ఇక్కడ, నీకేం పని?’’ అని సూటిగా అడిగాను.

అతను పక్కనున్న రంగురంగుల పువ్వులబుట్ట తీసుకుని, నా ముందు పట్టుకున్నాడు. పువ్వులు కళకళలాడిపోతున్నాయి, నా కోసమే ఎదురు చూస్తున్నట్టుగా, చిరునవ్వుతో, నన్ను పలకరిస్తున్నట్టుగా ఉన్నాయి. అతను నాతో అన్నాడు, ‘‘మీరు ఇక్కడికి వచ్చేసారు! కథల పూలదండలు గుచ్చి ఆ దేవుడికి అర్పించటమే మీ వృత్తి. వయోభారంతో, మీరు సూదిలో దారం సరిగ్గా ఎక్కించలేరు కదా! సహాయం చేయడానికి భగవంతుడు నన్ను పంపించాడు.’’

నేను అతన్నే చూస్తున్నాను! నా కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లినాయి. అతన్ని అడిగాను, ‘‘నీకు ఇల్లు–వాకిలి, పిల్ల–పాప, ఉద్యోగం–సద్యోగం ఏమీ లేవా?’’ అతను దారం ఎక్కించిన సూది నా చేతికి ఇచ్చాడు. 
నేనది అందుకోబోయి చేయి తడబడి సూది చురుక్కున వేలికి గుచ్చుకుని, రక్తం వచ్చింది.

 అతను ప్రేమతో ఆ రక్తాన్ని తుడుస్తూ సూది అందిస్తూ, చిరునవ్వుతో ‘‘అన్నీ ఉన్నాయి, పెద్ద కుటుంబం నాది’’ అన్నాడు.. 
‘‘అలాగా బాబూ! చాలా సంతోషం. ఈ రోజుల్లో పెద్ద కుటుంబం బాధ్యతని తీసుకునే యువకులే తక్కువ! నువ్వు వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి.’’ అన్నాను.. 
‘‘మీ ఆశీస్సులు నాకు ఆనందం’’అని బుట్టలో ఉన్న రెండు రంగురంగుల కథల పూలు అందించాడు. 
నేను తలవంచి గుచ్చుతూ, ‘‘నీ పేరేమిటి నాయనా?’’ అని అడిగాను.. ‘‘కాలం’’ అని జవాబు వచ్చింది.

 నేను ఆశ్చర్యంగా తలెత్తి చూసాను! అతను అక్కడ లేడు. ఒక్క క్షణం ఆలోచించాను, చిన్నగా తలపంకించాను, అవును! అతనికి ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో బాధ్యతలు! ఎంతమందినో చూడాలి! పెద్ద కర్తవ్యమే! 
నాకు చాలా ఆనందంగా ఉంది, నేను ఒంటరిని కాను, అతను తప్పక నా దగ్గరికి మళ్ళీ వస్తాడు... 

ప్రియనేస్తమా!! 
నీ రాక కోసం వేచి చూస్తూ, ఈ కథల దండలు గుచ్చుతూ, నా శేష జీవితం గడుపుతాను, నేను ఇప్పుడు ఒంటరిదాన్ని కాదు! నాకు నువ్వు ఉన్నావని తెలిసిన తర్వాత, నేను చాలా.. చాలా.. చాలా ఆనందంగా ఉన్నాను! నిశ్చింతగా ఉన్నాను.. నాకు ఆఖరిక్షణం వచ్చి కళ్ళు మూతలు పడుతున్నప్పుడు.. నువ్వు వచ్చి చేతులు చాచి నన్ను అక్కున చేర్చుకుని, సుఖమరణానికి నన్ను జాగ్రత్తగా అప్పగిస్తావు! నీ మీద నాకు నమ్మకముంది..
 

గులాబి – జీవితం

సూర్యోదయంలా ఒక మొగ్గ పువ్వుగా వికసించింది, దాని రెక్కలు సుతి మెత్తగా ఉన్నాయి. దాని వర్ణం గులాబి రంగు. తనకి తానే గులాబి అని పేరు పెట్టుకుంది. చుట్టూవున్న ఈ ప్రపంచాన్ని చూసి అబ్బురపడిపోయింది. ఇదంతా తన ఆనందం కోసమే దేవుడు సృష్టించి ఇచ్చాడని సంబరపడింది. చిరుగాలికి ఊగుతూ ఆత్మానందంతో నాట్యం చేస్తోంది.  ఇంతలో ఒక తుమ్మెద వచ్చి దాని మీద వాలింది. పువ్వుని కదలనీయకుండా గుచ్చి పట్టుకుంది. చక్కలిగింతలు పెట్టి నవ్వించింది. 

తుమ్మెద ఎగిరిపోయింది, పువ్వు నీరసించింది, అయినా ఆ తేనెటీగ తనకి కావాలని ఆశించింది. చుట్టూ వెతికింది. తేనెటీగ ఇంకో పువ్వు మీద వాలి ఆ పువ్వుని నవ్విస్తోంది. గులాబి డీలా పడింది. 
సాయంత్రం అయింది. గులాబి పూర్తిగా వడిలి పోయింది. అస్తమిస్తున్న సూర్యుడికి చేతులెత్తి మొక్కి ప్రార్థన చేసింది. ‘‘దేవుడా! రేపటికి నువ్వు వచ్చే సమయానికి నేను మళ్ళీ కళకళలాడుతూ ఉండేట్టు చేయి.’’
మర్నాడు మళ్ళీ సూర్యుడు ఉదయించాడు. 
గులాబి వడిలి పోయింది. రెక్కలు నేలరాలి పోయాయి. 
తోటమాలి వచ్చి వాటిని ఊడ్చి తీసుకెళ్ళి చెత్తలో పడేసాడు. 
జీవితంలో ఎంతో కావాలని ఉంటుంది, అంతా మనకు దొరకదు. 
ఈ గులాబి కథ సమాప్తి అయింది. 

కథలో నీతి :
ఇందులో గులాబి మనిషి! 
తేనెటీగ మృత్యువు! 
కాలం తోటమాలి!
ఇన్నాళ్ళూ నాకు తోడుగా ఉన్న నా ప్రియమైన కథల ప్రపంచం నా కంటే ముందు అక్కడికి వచ్చినట్టుంది. వయోభారంతో తడబడుతున్న అడుగులతో ఆ తోటలోకి వచ్చాను. ఎన్నెన్నో రకరకాల, రంగురంగుల కథల పువ్వులు నా కళ్ళకి కనిపించాయి. వాటిని చూడగానే చెప్పలేని ఆనందం! నా మనసుకి పారవశ్యం! ఘుమ ఘుమ సువాసనలు వెదజల్లుతున్న పున్నాగపూల చెట్టు క్రింద ఉన్న ఒక రాయి మీద కూర్చోబోయి, తూలిపడిపోబోయాను.

దాని వర్ణం గులాబి రంగు. తనకి తానే గులాబి అని పేరు పెట్టుకుంది. చుట్టూవున్న ఈ ప్రపంచాన్ని చూసి అబ్బురపడిపోయింది. ఇదంతా తన ఆనందం కోసమే దేవుడు సృష్టించి ఇచ్చాడని సంబరపడింది. చిరుగాలికి ఊగుతూ ఆత్మానందంతో నాట్యం చేస్తోంది. ఇంతలో ఒక తుమ్మెద వచ్చి దాని మీద వాలింది. పువ్వుని కదలనీయకుండా గుచ్చి పట్టుకుంది. చక్కలి గింతలు పెట్టి నవ్వించింది. తుమ్మెద ఎగిరిపోయింది, పువ్వు నీరసించింది, అయినా ఆ తేనెటీగ తనకి కావాలని ఆశించింది. చుట్టూ వెతికింది. తేనెటీగ ఇంకో పువ్వు మీద వాలి ఆ పువ్వుని నవ్విస్తోంది. గులాబి డీలా పడింది.

రేపటి సంచికలో... ప్రేమ... మా ఊరి గురించి కొన్ని వాక్యాలు 

మరిన్ని వార్తలు