అనగనగా ఓ యజ్ఞం

7 Nov, 2014 23:51 IST|Sakshi
అనగనగా ఓ యజ్ఞం

90 ఏళ్ల కారా
 
కాళీపట్నం రామారావు 50 ఏళ్ల కింద- 1966లో ‘యజ్ఞం’ కథ రాశారు. అప్పట్నించి ఇప్పటి వరకూ చదివినవాళ్లూ చదవనివాళ్లూ దాని గురించి మాటలాడుకుంటూనే ఉన్నారు. కాగితాలు కాగితాలు రాసేస్తూనే ఉన్నారు. ఇది ఊరు కథ కాదు దేశం కథ అన్న వాళ్లున్నారు. కాలం కథ అన్నవాళ్లున్నారు. ఓ గ్రామం మౌఢ్యం గురించి గురజాడ రాస్తే దాని రాక్షసం గురించి రాసిన కథ అన్నవాళ్లున్నారు. చదరం ఎండ అని రాశాడంటే ఈ లెక్కల మాస్టరు కొలవకుండా రాయడన్న వాళ్లున్నారు. అంతా బానే ఉంది కాని కొడుకుని చంపడం ఏంటి... టట్.. అన్నవాళ్లున్నారు. ఈ మాస్టరికి రైతు సెంటిమెంటు తెలియదన్నవాళ్లున్నారు. అసలీయన కథ ప్రభుత్వం గుర్తించిందంటే ఇందులో ఏదో మర్మం ఉందని శోధించిన వాళ్లున్నారు. అసలు హరిజనులకి భూములుంటాయా ఓవేళ ఎవడో ఒకరికో ఇద్దరికో ఉంటే మాత్రం అది సమాజమంతటికీ వర్తింపజెయ్యొచ్చా అనీ ఓ ఉద్యమం నడుపుతామని ఎగేసుకుని వెళ్లినవాళ్లున్నారు. ఈ కథని మొయ్యొచ్చా ఇలాంటి తప్పుడు అవగాహన వల్లే మార్క్సు అన్న అసలు విషయాలు మర్చిపోయారు అని అన్నవాళ్లున్నారు. ఇలా ఈ కథ 50 ఏళ్లుగా రకరకాలుగా పొగిడించుకుంటూ తెగిడించుకుంటూ తెగ బతికేస్తోంది. ఇంకో వందేళ్లయినా చూసేట్టుంది.

ఈ రామారావుగారు 50 ఏళ్లు నిండకుండానే కొన్ని కథలు రాసేడు. అన్నీ కలిపి ఓ యేబై వేసుకోవ చ్చు. అందులో మంచివి ఓ పాతిక ఉండొచ్చు. గొప్పవి ఓ డజనుండొచ్చు. పాతిక గుర్తుండే కథల్రాసి నలభై ఏళ్లకి పైగా దాని మీద బతికేస్తున్నాడని విసుక్కున్న వాళ్లున్నారు. ఓ కథ రాయటానికి గింజుకుగింజుకు తీసుకుంటాడు ఈయన రచయితా అని ముద్దుముద్దుగా తిట్టుకున్న వాళ్లున్నారు. నిజంగా ఆ కీర్తి మీదే ఆయన బతికేశాడా?  చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాడా? తన కథలు లేదా సృజన పేరు చెప్పి మెరిగేస్తున్నాడా?
 రాసిన పుటలు కన్న చించిన కథలు ఎక్కువ అంటాడాయన. ఏమో మనం చూడొచ్చామా? నమ్మొద్దు.  అసలు ఆయన కథలు రాయనేలేదనీ ఇంకెవరో రాసేరనీ కూడా మనం తీరీలు పీకొచ్చు. గురజాడ కన్యాశుల్కమే రాయనేదనేసినట్టు... ఉదాహరణకు ఇంత మెత్తటోడు అంతలా దొరికిన తాటిమట్టతో కనిపించని నక్కల మీదకు పరుగెత్తే పిల్లని చూడగలడా.. లోకం నాకు అవుద్ది అనే వెంపటాపు సత్యాన్ని భయం వెనక సత్యంగా మలచగలడా? అసలు భారతీయుడు, తెలుగోడు, ఆ మాటకొస్తే ఇంగ్లిషోడంత ఆలోచించగలడా? ఆవిడెవరో ఆఫ్రికా ఆవిడ తన నవలలో- కొడుకు బానిస కాకూడదని నరికేసే తండ్రిని రాసింది కదా- దానికి నోబెల్ ఇచ్చారు కదా- అజ్జదివీసి నేదంటే ఆ నోటా ఈ నోటా ఇనేసి ఈ మాస్టరు రాసేసి ఇంత కీర్తి కొట్టేసాడా? మాస్టరి పంచెకట్టూ, సెకండ్రీగ్రేడు టీచరు వృత్తీ, మాటాడ్డానికి అన్నిన్ని జాగ్రత్తలు పడటం చూసి అనుమానించి.. మన దృష్టిలో ఉండే ఊహకి  భిన్నంగా వాస్తవ రూపం ఉంది కనుక డౌటైతే పడొచ్చు.
 కాని కారాగారు  లక్ష కథల నోము పట్టారనే సంగతిని మాత్రం డౌటు పడటానికి వీల్లేదు. అంటే తన జీవిత కాలంలో కనీసం లక్ష కథలు చదవాలనే నోము.  40 ఏళ్లుగా చూస్తున్నాను. పత్రికో, పుస్తకమో లేకుండా ఆయన్ని చూట్టం గగనం. తన గురించి గప్పాలు కొట్టకుండా ఇంకోళ్ల కథల గురించి డబ్బా కొట్టటం ఇన్నిసార్లు చూసాన్నేను. ఇలా కథలు చదూకుంటూ నవ్వొచ్చినపుడు నవ్వూ... ఏడుపొచ్చినపుడు ఏడుపూ... ఆలోచన వచ్చినపుడు ఆలోచనా... కోపం వచ్చినపుడు కోపం... ఏం కథ ఇది అనిపించినపుడు విరక్తీ... బతికెయ్యొచ్చుగదా...
 అలాగని చదివీసి ఊరుకోలేదు. రాసినవాళ్లని వెతుక్కుంటూ వెళ్లాడు. ఉత్తరాలప్పుడు ఉత్తరాలు.. ఫోన్లప్పుడు ఫోన్లు.. నీ కథ బావుంది గురూ.. ఇలా రాసి చూడు.. అలా ఆలోచించి చూడు. ఫోను చేసినపుడు పెద్దంత్రం చిన్నంత్రం ఉండాలి గదా అదీలేదు. కథ కదిలించేస్తే ఆ కదలికంతా గొంతులో.. వాళ్లందరూ ఇప్పుడాయన సైన్యం అని నా అనుమానం. ఎందుకంటే రాతగాళ్లకన్నా ఎర్రోళ్లుండరు. ఎవడో చదివానంటే చాలు ఆ వేళ పెళ్లాం పిల్లల్ని సినిమాకు తీసుకుపోయే బాపతు. స్నేహితులకి మందుపోసి మరీ సంబరం పంచుకునే అల్ప సంతోషులు. ఇది తెలిసే ఈయన ఈ స్ట్రాటజీ ఫాలో అయాడా?

పోనీ అలా కూడా బతికెయ్యలేదు. త నకి తెలిసిందేంటో వాళ్లు తెలుసుకోవాలని క థాకథనం పేరిట వ్యాసాలు రాసాడు. గింజుకు గింజుకు రాసే ఈ మనిషి కథలెలా రాయాలో ఇంకొకళ్లకి చెప్పేపాటా అని పుసు శర్మ వాపోయాట్ట. కాని అవి కూడా చదవీసి తెలుగు జనాలు ఆహా ఓహో అనీసారు.  పోనీ రాసేడు. ఏదో అయింది. ఆ లక్ష కథల నోముల కథ ఏమయింది?  రోజుకి అధమపక్షం రెండు కథలు తీసుకున్నా 90 ఏళ్లు అంటే 32,850 రోజులకి 60 లేదా 65 వేలైనా నమిలేసి ఉండాలిగదా.. లేదు.

అసలు అన్ని కథలున్నాయా అనీసి డౌటొచ్చిందో ఏంటో 72వ ఏట ఉన్న కథలన్నీ ఓ దగ్గర పడేస్తే పోలా అనుకుని నడుం బిగించాడు. తనకొచ్చిన సాహిత్యం డబ్బులు పెట్టి స్థలం కొన్నాడు. ఇల్లు కట్టాడు. ఉన్న పుస్తకాలు అందులో పెట్టాడు. దాన్ని కథానిలయం అన్నాడు. వచ్చిన ప్రతి కథనీ రచయితలు పుస్తకంగా వేసేస్తారని లెక్కేసి అవి సంపాదించేస్తే చాలని భ్రమపడ్డాడు. నాలాంటోళ్లు వచ్చి అబ్బే పుస్తకాల్లో వచ్చినవి నూటికి ఒకటో రెండో శాతం ఉంటాయంతే అనీసరికి అప్పటికే వచ్చిన చప్పట్లతో బతికెయ్యొచ్చుగదా... లేదు. పత్రికల మీద పడ్డాడు. తిరిగాడండీ..  చిత్తు కాగితాలు పోగేసుకునేవాడిలా తిరిగాడు. అలా పోగేసినవన్నీ పుస్తకాలలో రాసి  దాసరి రామచంద్రరావు లాంటి వెర్రాళ్లు దొరికితే రాయించి అది సరింగా లేదనిపించితే అయ్యవార్లంగారేం చేస్తున్నారయ్యా అంటే అన్నట్టు మళ్లీ మళ్లీ కొత్తపుస్తకాల్లో రాసి.. ఏం చెప్పమంటారు.. పదేహేనేళ్లు.. దాంతో  ఏం పంజేస్తున్నాడయ్యా ఈ ముసిలాయన అని మెచ్చుకున్నోళ్లు.. పొగట్టానికి తెలుగులో పదాలు దొరక్క నోళ్లు వెళ్లబెట్టినోళ్లు.... పోనీ లక్షకథల నోము మర్చిపోయాడా అంటే అదీలేదు. వెనకబెట్టాడు కాని వదిలిపెట్టలేదు. ఈ బాకీ సంగతి తెలిసే కాబోలు అక్కడెక్కడో ఉన్నాడని చాలామంది నమ్మేవాడు ఆనోము పూర్తయే వరకూ నువ్వక్కడే ఉండనీసీడు.

రాసినా చప్పట్లే.. చదివినా చప్పట్లే.. చదివిన వాటి గురించి రాసినా చప్పట్లే.. చప్పట్లు శాశ్వతం కాదని కీర్తికాముడు కథ రాసి తేల్చుకున్న కారాకి  చప్పట్లే.. చప్పట్లు... వద్దంటే డబ్బులా. ఆ బరువుని పడిపోకుండా కాసుకుంటా నాబోటాళ్లు దోవ తప్పాడని నొచ్చుకుంటే ఓ దణ్ణంపెట్టి తన మానాన తాను 90 పూర్తి చేసుకుని సాగుతున్నాడు కారా మాస్ట్రు.

అందరూ కలిసి ఈ కథానిలయానికి 90 ఏళ్లు నిండుతున్నాయని సంబరాలు ఆరంభించారు. సాధారణ ంగా ఇంద్రుడనీ, చంద్రుడనీ మనిషిని దేవుణ్ణి చేసేసే రాసేయటమే కనిపిస్తుంది ఇలాంటి సంబరాలలో. మరి నా తిక్కలు నావి కదా.. అందుకని సాఫల్యాలతో బాటు వైఫల్యాలూ, నిలబడ్డంతో బాటు పడిపోటాలూ, చెప్పినవాటితోబాటు చెప్పలేకపోటాలూ, తెలియటంతో బాటు తెలియకపోటాలూ.. అన్నీ కలిస్తేనే గదా.. మొత్తం గుదిగుచ్చితేనే కదా.. మనిషి బొమ్మ అవుతుంది. లేకపోతే నాలుగు తలల బ్రహ్మో, పది తలల రావణాసురుడో, మూడుకళ్ల శివుడో అవుతాడుగాని మనిషి అవడనీసి.. నేను అనుకున్నాను.

ఇవన్నీ కలిపి చదూకున్న వారికి ఓ వ్యక్తి ఒక సమాజంలోనే పుడతాడనీ, తన కాలానికి అడుగు ముందుకో వెనక్కో తప్ప అతీతంగా ఉండలేడనీ అనిపించాలని నా ఊహ. 90 ఏళ్ల కారా మాస్టారు.. నా తండ్రి తర్వాత నా ఆలోచనలకు కేటలిస్టు, కాళీపట్నం రామారావు గారి లక్ష కథల నోము పూర్తయే వరకూ వదిలేస్తానని భీష్మించుకు కూర్చున్న అదేదో ఉందో లేదో తెలీనిది ఉండుంటే.. దానికి అంత శక్తి ఉండుంటే.. వదిలేస్తే.. అందాకా నేనుంటే.. వందేళ్ల సంబరాలలో కలుసుకుందాం మరి.. సెలవు.

 - వివిన మూర్తి, 9603234566
 
 
 
 

మరిన్ని వార్తలు