యానల్‌ ఫిషర్‌ సమస్య తగ్గుతుందా?

25 Apr, 2019 00:55 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 36 ఏళ్లు. నేను గత కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్‌ ఫిషర్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియో మందులతో నాకు పూర్తిగా నయం అవుతుందా? 

దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్‌ ఫిషర్స్‌ బారిన పడే అవకాశం ఎక్కువ. ముందుగా ఫిషర్‌ అంటే ఏమిటో తెలుసుకుందాం. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్‌ ఫిషర్‌ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది. 

కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్‌ కలిగించే వ్యాధులు (ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజెస్‌), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్‌కు) రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్‌ ఏర్పడే అవకాశం ఉంది. 

చికిత్స: జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషనల్‌ విధానం ద్వారా ఫిషర్స్‌ సమస్యను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్‌ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా  చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ లక్షణాలను వివరించి తగిన చికిత్స తీసుకోండి. 

డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ తగ్గుతుందా? 

నా వయసు 34 ఏళ్లు. ఇటీవల కడుపులో మంట, వికారంతో డాక్టర్‌ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్‌ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? 

మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్‌) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్‌ అల్సర్స్‌ అంటారు. హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణశయంలో ఆల్సర్లు పెరుగుతాయి. 

కారణాలు:
►బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌
►హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా
►మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం
►మద్యపానం, పొగతాగడం
►వేళకు ఆహారం తీసుకోకపోవడం
►కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. 

లక్షణాలు:
►కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం
►ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం
►తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు
►కొంచెం తిన్నా కడుపు నిండినట్లు
►ఉండటం, ఆకలి తగ్గడం
►నోటిలో నీళ్లు ఊరడం. 

నివారణ జాగ్రత్తలు:
►పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి
►మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి
►కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి  కంటినిండా నిద్రపోవాలి
►మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి
►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. 

చికిత్స: గ్యాస్ట్రిక్‌ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్‌ ఆల్బ్, యాసిడ్‌ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్‌ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి.

డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

పొలుసుల్లా రాలుతున్నాయి..!

నా వయసు 39 ఏళ్లు. ఆరు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతోమంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా? 

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సోరియాసిస్‌ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసు వారికైనా రావచ్చు. 

లక్షణాలు:
►చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది.
►కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి.
►తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టూ రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగా లేకపోవడంతో  మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. 

ఇటీవలి వ్యాధి ట్రెండ్‌: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. 

చికిత్స: ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్‌ కన్‌స్టిట్యూషన్‌ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్‌ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో  ప్రక్రియలో సాధ్యమే.

డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు