భక్తిశ్రద్ధలతో జగన్నాథుని వనజాగరణ యాత్ర

16 Apr, 2015 23:30 IST|Sakshi
భక్తిశ్రద్ధలతో జగన్నాథుని వనజాగరణ యాత్ర

జగన్నాథుడు అందరి వాడు. ఆయన ప్రతి సేవ, పూజ, నైవేద్యం, సంప్రదాయం అంతా అద్వితీయం. అపురూపం. మనిషే దైవం, దైవమే మనిషి అనే మహత్తర అనుబంధం స్వామి ఆచార వ్యవహారాల్లో ఉట్టిపడుతుంది. శ్రీజగన్నాథుని సంస్కృతిలో ‘నవ కళేబరం’ మహత్తర ఘట్టం. పాత శరీరం వీడి కొత్త శరీరంలోకి బ్రహ్మని ప్రతిష్టింపజేసుకోవడం నవ కళేబరం సరళమైన భావనగా భక్తులు విశ్వసిస్తారు. శ్రీమందిరం దేవస్థానంలో రత్న వేదికపై చతుర్థామూర్తులు (సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీజగన్నాథుడు) భక్తులు,
 యాత్రికులకు నిత్యం దర్శనమిస్తారు. ఈ మూర్తులన్నీ దారు విగ్రహాలే. ఆలయ పంచాంగం లెక్కల ప్రకారం పుణ్యతిథుల్లో రత్న వేదికపై కొలువు దీరిన దారు మూల విరాట్లని మార్చే ప్రక్రియ నవ కళేబర ఉత్సవం.
 
బాడొగ్రాహిల నేతృత్వంలో నవ కళేబరం రూపు దిద్దుకుంటుంది. చతుర్థామూర్తుల తరపున ప్రత్యక్ష ప్రాతినిధ్యం వహించే వర్గాన్ని బాడొగ్రాహిగా పరిగణిస్తారు. నవ కళేబర ఉత్సవంలో వన జాగరణ యాత్ర ఆది ఘట్టం. నవ కళేబరానికి అవసరమైన పవిత్ర దారు అన్వేషణని వన జాగరణ యాత్రగా పేర్కొంటారు. ఈసారి దళపతిగా హల్దర్ దాస్‌మహాపాత్రొ వన జాగరణ దళానికి సారథ్యం వహించారు. ఈ దళంలో నలుగురు ఉప దళపతులు ఉంటారు. ఇలా దళంలో సుమారు 150 మంది సభ్యులు ఉంటారు. రత్న వేదిక నుంచి చతుర్థా మూర్తుల ఆజ్ఞా మాలలు అందడంతో వన జాగరణ యాత్ర వాస్తవంగా ప్రారంభమవుతుంది. తదుపరి శ్రీజగన్నాథుని ప్రథమ సేవకునిగా పరిగణించబడే గజపతి మహారాజా దివ్య సింగ్‌దేవ్ రాజ మందిరంలో రాజ గురువుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజాదుల్లో పవిత్ర వక్కని వన జాగరణ దళపతికి అందజేస్తారు. అక్కడ నుంచి దళం నిరవధిక పాదయాత్ర ఊపందుకుంటుంది. ఈ యాత్రలో తొలి మజిలీ పూరీ పట్టణంలో శ్రీజగన్నాథ వల్లభ మఠం. తొలి రోజు రాత్రి అక్కడ బస చేసి మర్నాడు ప్రాతఃకాలంలో బయల్దేరి మలి మజిలీ కోణార్కు/రామచండీ మందిరంలో బస చేసి విశ్రమిస్తారు. అక్కడ నుంచి చివరి మజిలీ దెవుళి మఠానికి దళం చేరుతుంది. మఠానికి చేరువలో మా మంగళా దేవీ పీఠం ఉంది.

మా మంగళా దేవీ కటాక్షం అత్యద్భుతం

జగతి నాథుని నవ కళేబర ఉత్సవం శక్తి, శ్రీమన్నారాయణుల ఉమ్మడి ఉపానతో ముడి పడి ఉంది. కాకత్‌పూర్ మంగళా దేవి కటాక్షంతో శ్రీజగన్నాథుని నవ కళేబరానికి అవసరమైన దారు సంకేతాలు లభిస్తాయి. దేవీ కటాక్షం మేరకు వన జాగరణ దళం అన్వేషణ యాత్ర ప్రారంభిస్తుంది. శ్రీమందిరం నుంచి బయల్దేరిన వన జాగరణ దళం అంచెలంచెలుగా దెవుళి మఠానికి చేరుతుంది. అది మొదలుకొని మంగళా దేవీ కటాక్షం కోసం జపతపాలు ప్రారంభిస్తారు. దేవీ పీఠంలో స్వప్న ఆదేశం కోసం స్వప్నేశ్వరి మంత్ర జపాన్ని నిరవధికంగా నిర్వహిస్తారు. పవిత్ర దారు ఆచూకీ స్వప్నంలోనే ప్రాప్తిస్తుంది. దేవీ అనుగ్రహంలో దళంలో సభ్యులకు స్వప్న ఆదేశం అందేటంత వరకు స్వప్నేశ్వరి మంత్ర జపం నిరవధికంగా సాగాల్సిందే. స్వప్న ఆదేశంతో తక్షణమే అన్వేషణకు యాత్ర బలం పుంజుకుంటుంది. దళంలో సభ్యులు 6 జట్లుగా విడిపోయి అన్వేషిస్తారు. ప్రాతఃకాలం నుంచి అపరాహ్ణం వరకు 4 జట్లు, అపరాహ్ణం నుంచి సంధ్య వేళ వరకు 2 జట్లు దారు కోసం అన్వేషిస్తాయి. ఈ జట్లుకు తారసపడిన దారు వివరాల్ని నిత్యం సంధ్య వేళలో దళపతి, ఉప దళపతి, దైతపతులంతా కలిసి దెవుళి మఠంలో సమీక్షిస్తారు. ఇలా 100 పైబడి వేప చెట్ల వివరాల్ని సేకరించిన మేరకు చివరగా 4 వృక్షాల్ని ఖరారు చేస్తారు. ఈ వృక్షాల దారుని చతుర్థా మూర్తుల తయారీకి వినియోగిస్తారు. 

నవ కళేబరం దారు వెలసిన ప్రాంతం, అర్హత కలిగిన దారు చిహ్నాల్ని స్వప్న ఆదేశంలోనే పొందుతారని దైతపతుల సమాచారం. నవ కళేబరం దారుకు సంబంధించి శాస్త్రీయంగా కూడ ప్రత్యేక మార్గదర్శకాలు ఆచరణలో ఉన్నాయి. నదీ తీరాన స్మశాన వాటికకు చేరువలో ఆఘాతం లేకుండా ఎదిగిన వేప వృక్షం నవ కళేబరానికి అర్హత కలిగిన కల్పంగా పరిగణిస్తారు. ఈ కల్పం  పాద ప్రాంతంలో పుట్ట, నాగ సర్ప సంచారంతో చక్కటి ఆధ్యాత్మిక, ధార్మిక పరిసరాల మధ్య పశు పక్ష్యాదులు తాకకుండా శంఖం, గద, చక్రాదులు వంటి చిహ్నాలు కలిగిన నింబ వృక్షం దారుని పవిత్ర నవ కళేబరం కోసం వినియోగిస్తారు. వీటితో మరికొన్ని గోప్యమైన సంకేతాల్ని కూడ పరిగణనలోకి తీసుకున్న మేరకు కొత్త మూల విరాట్ల తయారీకి అర్హమైన దారు వివరాల్ని వన జాగరణ దళం ప్రకటిస్తుంది. వన జాగరణ దళం సూచన మేరకు శ్రీమందిరం దేవస్థానం తొలుత సుదర్శనుని దారుకు సంబంధించి వివరాల్ని అధికారికంగా బహిరంగపరుస్తుంది. తర్వాత అంచెలంచెలుగా బలభద్రుడు, దేవీ సుభద్ర, చివరగా శ్రీజగన్నాథుని దారు వివరాల్ని ప్రకటిస్తారు.

శ్రీచక్ర నారాయణుని తోడుగా ....

నవ కళేబరం దారు అన్వేషణలో వన జాగరణ దళానికి శ్రీ చక్ర నారాయణుడు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండడంతో చీకటి, వెలుగులు,  ఎండ, తాపం వంటి అలసత్వం లేకుండా యాత్ర నిర్భయంగా, నిరవధికంగా సాగుతుందని దళంలో సభ్యులు వివరించారు. బస చేసిన ప్రతి చోట నిరంతరాయంగా శ్రీ చక్ర నారాయణుని సేవించడంలో వన జాగరణ దళం తల మునకలై ఉంటుంది. దారు అన్వేషణలో  దైతపతులు శ్రీ చక్ర నారాయణుని చేత పట్టుకుని ముందుకు సాగుతారు. ఆయన శక్తితో పాదయాత్ర అవలీలగా సాగిపోతుంది. దారు అన్వేషణని విజయవంతం చేస్తుంది. వన జాగరణ యాత్ర దళం సభ్యులు యాత్ర ఆద్యంతాల్లో ఒంటి పూట (మహా ప్రసాదం) భోజనంతో అత్యంత నియమ నిష్టలతో మంత్ర జపతపాలు, పూజాదుల్ని క్రమం తప్పకుండా పాటిస్తారు. పాద యాత్రలో వీరు బస చేసే మజిలీల్లో వసతి, ఆరోగ్యం, శాంతి భద్రత ఏర్పాట్లని శ్రీమందిరం దేవస్థానం పర్యవేక్షిస్తుంది.

నిత్యం శ్రీమందిరం నుంచి శ్రీజగన్నాథుని మహా ప్రసాదాలు (అన్న ప్రసాదాలు) వన జాగరణ దళం బస చేసే చోటుకు సాయంత్రం సరికి చేరేలా దేవస్థానం అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. దేవస్థానం ప్రధాన పాలనాధికారి ఈ వ్యవహారాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. దిగువ స్థాయి అధికారులతో వన జాగరణ దళానికి ఎటువంటి ప్రమేయం ఉండకపోవడం విశేషం. లోగడ నవ కళేబర ఉత్సవం 1969, 1977, 1996 సంవత్సరాల్లో జరిగినట్లు దేవస్థానం రికార్డుల సమాచారం.
 - ఎస్.వి. రమణమూర్తి, సాక్షి, భువనేశ్వర్
 
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు