నిలిచి గెలిచారు

15 Nov, 2019 03:14 IST|Sakshi

ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం మొదలై ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో.. బయటికి వచ్చి పోరాడిన సెలబ్రిటీ బాధిత మహిళలకు దక్కింది ఏమీ లేకపోగా పోగొట్టుకున్నదే ఎక్కువ అనే భావన ‘మీటూ’ ను సమర్థించేవాళ్లలో సైతం నెలకొని ఉంది. మన దగ్గర రీతుపర్ణ చటర్జీ, సోనా మహాపాత్ర, వినితా నందా, చిన్మయి శ్రీపాద.. ప్రధానంగా ఫైట్‌ చేసిన మీటూ మహిళలు.

ఏడాది క్రితం వరకు ప్రొఫెషన్‌ పరంగా వీళ్లెంత సౌఖ్యంగా ఉన్నారో.. ఇప్పుడంత అసౌకర్యంగా, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఈ నలుగురిలో ఒక్కరు కూడా ఆ మాటను ఒప్పుకోవడం లేదు. ‘‘పర్సనల్‌గా మేమెంతో నష్టపోయి ఉండొచ్చు. కానీ ఒక పర్సన్‌గా మీటూ మమ్మల్ని నిలబెట్టింది’’ అంటున్నారు.

ప్రఖ్యాత జర్నలిస్టు రీతుపర్ణా చటర్జీ తనకొక ఉద్యోగం కావాలని ఇటీవల తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పెట్టారు! అదింకా అలాగే ఉంది. అంటే ఆమె ఇంకా నిరుద్యోగిగానే ఉన్నారు. ఒక జాతీయ పత్రికకు పదిహేనేళ్లు ఎడిటర్‌గా పనిచేసిన సీనియర్‌ పాత్రికేయురాలు ఉద్యోగాల వేటలో ఉండటం ఏమిటి?! ఇదే ప్రశ్న రీతు కూడా తనకు తను వేసుకున్నారు. అసలిలా ట్విట్టర్‌లో పెట్టడం కాన్ఫిడెన్స్‌ లోపించడం అవదా అని తన మనసుతో తను ఇరవై నాలుగు గంటలపాటు చర్చ కూడా పెట్టుకున్నారు. అయినా తప్పలేదు. నిజంగానే ఆమెకు ఇప్పుడొక ఉద్యోగం అవసరం. ‘మీటూ’ ఉద్యమంలో గత ఏడాదిగా చురుగ్గా ఉంటున్నారు రీతు. అందుకు దక్కిన ‘ప్రతిఫలమే’.. ఉద్యోగం కోసం తనకై తాను ఒక ప్రకటనను ఇచ్చుకోవలసిన పరిస్థితి తలెత్తడం! ఆమె రెజ్యుమె గొప్పదిగా ఉండొచ్చు.

కానీ ఆమె ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా, ఆ రెజ్యుమె కంటే ముందు ఆమె మీటూ చరిత్ర కంపెనీల యాజమాన్యాలకు చేరుతోంది. ‘ఓ.. ఆవిడా!! వీరనారి. ఆవిడకు ఉద్యోగం ఎందుకు?’’ అనే వెక్కిరింపు వారి నుంచి వస్తోంది. మీటూ బాధితులకు రీతు దగ్గరుండి మరీ సహాయాలు చేశారు. పోలిస్‌ కంప్లయింట్‌ ఎలా రాయాలో తెలియకపోతే తనే రాసి ఇచ్చారు. కొన్ని కేసులలో తనే స్వయంగా జాతీయ మహిళా కమిషన్‌ను కూడా సంప్రదించారు. ఇవన్నీ ఊరికే పోలేదు. ఉద్యోగాలిచ్చేవాళ్లు గుర్తుపెట్టుకున్నారు!

బాధిత మహిళలంతా ఏకం కావడమే ఒక ఉద్యమం. ఒకే అంశం మీద ఏకం అవడం ఉద్యమం కన్నా పెద్ద విషయం. విప్లవం అనొచ్చు దీనిని. ఇవాళ ప్రతి ఖండంలో, ప్రతి దేశంలో ‘మీటూ’ మహిళలు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. ‘‘బయటికొచ్చి చెప్పుకున్నావుగా! ఏ ఒరిగింది నీకు’’ అనే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. తప్పుడు పని చేసిన వ్యక్తిని బయటపెట్టాను. అది విజయం సాధించడం కాదా?! నా తరఫున ఎవరూ లేకున్నా.. నాలాంటి బాధితుల తరఫున నేను ఉంటాను. జర్నలిస్టుగా ఎంత సంతృప్తిగా జీవించానో.. జర్నలిజానికి దూరమైనప్పటికీ మీటూ కార్యకర్తగా అంతే సంతృప్తిగా, గౌరవంగా జీవిస్తున్నాను.
– రీతుపర్ణా చటర్జీ

గత ఏడాది అక్టోబర్‌లో ఒక చిన్న ట్వీట్‌.. దేశంలో ‘మీటూ’ను రాజేసింది. గాయని సోనా మహాపాత్ర చేసిన ట్వీట్‌ అది. సహ గాయకుడు అను మాలిక్‌ తన భర్త రామ్‌ సంపత్‌ ఎదుటే తనను లైంగికంగా కించపరుస్తూ మాట్లాడాడని సోనా ఆ ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. అను మాలిక్‌ ‘ఇండియన్‌ ఐడల్‌’ జడ్జి కూడా. వేళకాని వేళలలో సోనాకు ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడేవారట ఆయన. కైలాష్‌ ఖేర్‌ కూడా తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఇంకో ట్వీట్‌లో సోనా బహిర్గతం చేశారు.అలా ఆమె ‘మీటూ’ ఉద్యమ ప్రయాణం మొదలైంది. ఆర్థికంగా ఆమె చితికిపోడానికి కూడా ఆ ట్వీటే నాంది పలికింది. ఏడాదిగా సోనాకు అవకాశాల్లేవు! ప్రొఫెషన్‌లో ఒక్కక్కొరుగా ఆమెకు దూరం అవుతున్నారు. భర్త, కుటుంబ సభ్యులు.. వీరు మాత్రమేకు ఆమె అండగా ఉన్నారు.

నాకు జరిగిన దానిని ఒక ఉద్యమ నాయికగా నేను బయట పెట్టలేదు. ఒక బాధితురాలిగా మాత్రమే చెప్పుకున్నాను. ఒకసారి మనం నోరు విప్పామా.. మిగతా బాధితులకూ  ధైర్యం వస్తుంది. ‘‘అక్కా మాక్కూడా ఇలా జరిగింది’’ అని చెప్పుకున్నవారు ఉన్నారు. నేటికీ నాతో చెప్పుకోడానికి వస్తున్నవారూ ఉన్నారు. బాధితులందరి పేర్లు, ఫోన్‌ నంబర్‌లతో ఒక నెట్‌వర్క్‌ ఏర్పాటు అయింది.ఎవరైనా బెదిరించినా, చట్టం ప్రకారం చేయవలసిన సహాయాన్ని చేయడానికి అధికారులు నిరాకరించినా.. వెంటనే ఆ సంగతి మా అందరికీ తెలుస్తుంది. దానిపై ఉద్యమిస్తాం. సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నంలో మనం కొంత కోల్పోవలసి వస్తుంది. అది ఉద్యోగం అయినా, ఉపాధి అయినా. అప్పుడే మరింత ఆత్మ స్థయిర్యంతో ముందుకు సాగాలి.
– సోనా మహాపాత్ర

మీటూ ఉద్యమంలో బయటకు వచ్చిన మరో గళం వినీతా నందా. ఆమె బాలీవుడ్‌ సినిమా రచయిత, నిర్మాత. అలోక్‌ నాథ్‌ అనే బాలీవుడ్‌ నటుడు తనను 19 ఏళ్ల కిందట రేప్‌ చేశాడని అతడి మీద పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చింది. అలోక్‌నాథ్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ అయినప్పటికీ ముంబయి సెషన్స్‌ కోర్ట్‌ అతడికి ఈ ఏడాది జనవరిలో యాంటిసిపేటరీ బెయిల్‌ మంజూరు చేసింది. అలోక్‌కు బెయిల్‌ ఇవ్వడాన్ని న్యాయస్థానం సమర్థించుకుంటూ ‘‘వినీత తన స్వప్రయోజనాలను ఆశించి, నేరం జరిగిన వెంటనే కంప్లయింట్‌ చేయలేదు’’ అని పేర్కొంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న సమాజంలో పోరాడడం అంటే సమయాన్ని వృథా చేసుకోవడమేననే అభిప్రాయానికి వచ్చింది వినితా నందా. ఈ పోరాటంలో సాధించింది ఏమీ కనిపించకపోగా చేతిలో ఉన్న రెండు వెబ్‌ సిరీస్‌ ప్రాజెక్టులు వెనక్కి పోయాయి.

నేను మౌనంగా ఉంటే అంతా సవ్యంగా సాగిపోయేది. అయితే మన జీవితంలో మన  ప్రమేయం లేకుండా అపసవ్యత ఏర్పడినప్పుడు దాని గురించి మాట్లాడకుండా ఉండలేం. మాట్లాడి సాధించేది కూడా ఏమీ లేకపోవచ్చు. కోర్టు తీర్పు మనకు వ్యతిరేకంగా రావచ్చు. మన విలువలు అవహేళనకు గురి కావచ్చు. కానీ ‘మనం నిలబడ్డాం.. నిలదీశాం’ అనే ఆలోచన మనపై మన గౌరవాన్ని పెంచుతుంది. మనల్ని మరికొందరు అనుసరించేలా చేస్తుంది. న్యాయం దక్కటం, దక్కకపోవటం అనే వాటిని మనం ఫలితాలుగా చూడకూడదు. పరిణామాలుగా పరిగణించాలి. సమాజం పూర్తిగా మారినప్పుడే అది ఫలితం అవుతుంది. ఆ ఫలితానికి పరిణామం ఒక మెట్టు మాత్రమే.   
– వినీతా నందా

దక్షిణాదిలో మరో మీటూ బాధితురాలు చిన్మయి శ్రీపాద. ఆమె మంచి గాయని. ఆమె 2018 అక్టోబర్‌ నెలలో తన స్టోరీని ట్వీట్‌ చేసింది. అందులో ఆమెను లైంగికంగా వేధించిన వైరముత్తు తెరమీదకొచ్చాడు. వైరముత్తు తమిళంలో ప్రఖ్యాత పాటల రచయిత. పద్మశ్రీ, పద్మభూషణ్, సాహిత్య అకాడమీ అవార్డులు... మొత్తం ఏడు జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నాడు. అతడిని తమిళ జాతి గర్వకారణంగా గుర్తిస్తోంది ఆ రాష్ట్రం. అతడి మీద లైంగిక ఆరోపణలు రావడంతో రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది.

చిన్మయి తనకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే మాట్లాడి ఊరుకోలేదు. ‘మాకూ ఇలాగే జరిగింది’ అంటూ ముందుకొచ్చిన మహిళల గళం కూడా తానే అయింది. ఇలా మీటూలో ఎంతమంది మహిళలు గొంతు విప్పినప్పటికీ తమిళ సమాజం వైరముత్తును తప్పుపట్టడానికి ఇష్టపడలేదు. అతడిలోని గురివిందను చూడడానికి ఇష్టపడ లేదు. పైగా వైరముత్తు అభిమానులు చిన్మయిని సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేశారు. చిన్మయి మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. సోషల్‌ మీడియా వేదికగా కొనసాగిస్తోంది.

నాకిప్పుడు కోపం లేదు. అసహనం లేదు. అసంతృప్తి లేదు.   రకరకాల మనస్తత్వాల వాళ్ల మధ్య ఉన్నప్పుడు మన ఆవేదనకు ఒక్కొక్కరు ఒక్కో అర్థం చెబుతారు. మనం ఎవరి మీదనైతే ఫిర్యాదు చేశామో వారిని అభిమానించే వారు మన ఆవేదనకు చెప్పే నిర్వచనం మనసుకు బాధ కలిగించేలా ఉంటుంది. అయితే ఆ దశను నేను ఎప్పుడో దాటిపోయాను. మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లావని కొందరు ప్రశంసిస్తుంటారు. ఉద్యమమైనా, సంఘర్షణ అయినా ముందుకు వెళ్లేటప్పుడు అంతే వేగంతో మనల్ని వెనక్కు నెట్టే శక్తులు ఉంటాయి. వాటికి తట్టుకుని నిలబడటమే ముందుకు వెళ్లడం అంటాను.                  – – చిన్మయి శ్రీపాద

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా