డోంట్ వర్రీ.. ఈజీ డెలివరీ

27 Jul, 2018 11:28 IST|Sakshi
ఆమె పెట్టిన సోషల్‌ మీడియా పోస్ట్‌లు

ఆసనాలు, వ్యాయామంతో ప్రయోజనాలెన్నో..

సాధారణ ప్రసవానికి మంచి మార్గం  

తల్లి, శిశువు ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తం

నగర మహిళల్లో చిగురిస్తున్న కొత్త ఆశలు  

గర్భం దాల్చిన రోజు నుంచే సిజేరియన్‌కు మానసికంగా సిద్ధమైపోతోంది ఆధునిక మహిళ. నార్మల్‌ డెలివరీ అనేది దాదాపు అసాధ్యం అనే స్థాయికి ఆలోచనలు స్థిరపడ్డాయి. ఈ నేపథ్యంలో వ్యాయామం అలవాటు నార్మల్‌ డెలివరీకి, చక్కని సంతానభాగ్యానికి హామీగా మారుతూ పలువురిలో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. సిజేరియన్‌ బాధ లేకుండా పిల్లల్ని కనాలనుకునే వివాహితలకు సహకరించడం దగ్గర్నుంచి గర్భిణిగా  ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకూ,  ప్రసవానంతరం తలెత్తే పలు ఆరోగ్య సమస్యల పరిష్కచారానికి, డెలివరీ అనంతరం శరీరాకృతి మెరుగు పరుచుకునేందుకు కూడా ఉపకరిస్తోంది. దీన్ని గుర్తిస్తున్న నగర మహిళ ఆ‘పరేషాన్‌’కి చెక్‌ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.  

సాక్షి, హైదరాబాద్‌ (సిటీబ్యూరో) : హిమాయత్‌ నగర్‌లో నివసించే రమ్య ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. గర్భవతిగా తగినంత వ్యాయామం చేస్తూ.. నార్మల్‌ డెలివరీ ద్వారా చక్కని పాపకు జన్మనిచ్చారు.  గర్భిణిగా ఉన్నా అన్ని వ్యాయామాలు, ఆసనాలు సాధన చేయవచ్చని స‘చిత్ర’ సమేతంగా నిరూపిస్తూ గర్భం దాల్చిన దగ్గర్నుంచి బిడ్డ పుట్టేవరకూ ఆమె పెట్టిన సోషల్‌ మీడియా పోస్ట్‌లు ఎంతో మందికి స్ఫూర్తిని అందించాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో ఆమె తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.

ఆసనాలు ఇలా వేయాలి..
సూర్యనమస్కారాలు కాస్త సులభతరం చేసి చేయాలి. ఇందులో కోబ్రా పోజ్‌ తప్ప అన్నీ చేయవచ్చు. వృక్షాసన, తాడాసన, సేతుబంధాసన (ఇది ఎక్కువ సేపు కాకుండా 2 శ్వాసల కాలం మాత్రమే) అథోముఖ శ్వాసాసన వంటివి చేయవచ్చు. బటర్‌ఫ్లై ఆసనం కూడా చేయవచ్చు. ఫార్వర్డ్‌ బెండ్స్‌ చేసేటప్పుడు సగం మాత్రమే బెండ్‌ అవాలి. నెలలు నిండుతుంటే... వైడ్‌ లెగ్‌ ఫార్వార్డ్‌ ఫోల్డ్‌ చేయాలి. శశాంకాసన వంటివి చేయకూడదు. మాలాసన బాగా చేయాలి. నొప్పులు రాని పరిస్థితిని నివారించేందుకు ఇదిఅవసరం. మాలాసన చాలా ఉపయుక్తం.  ఇది నేచురల్‌ డెలివరీకి బాగా ఉపకరిస్తుంది. నా విషయంలో.. 37 వారాల తర్వాత బేబీ తల రివర్స్‌ అయింది. దీంతో మంచం మీద కాళ్లు పెట్టి తల కిందకు పెట్టి చేసే ఇన్వర్షన్స్‌ వర్కవుట్‌  చేశాను. ప్రాబ్లం సాల్వ్‌ అయింది. గర్భిణులకు ఆహారం తీసుకున్న తర్వాత అరుగుదల కాసింత ఆలస్యం అవుతుంది. కాబట్టి.. తిన్నాక కనీసం 4గంటల తర్వాత మాత్రమే వ్యాయామాలు/ఆసనాలు చేయడం మంచిది. లంచ్‌ అయ్యాక ఈవినింగ్‌ స్నాక్స్‌కి ముందు సమయం అయితే బెటర్‌.

ఆరోగ్య సంతాన ‘ప్రాప్తి’కోసం..
సంతానభాగ్యానికి అడ్డుపడే ఆరోగ్యపరమైన ఇబ్బందులని తొలగించుకోవడానికి  నడక వంటి వ్యాయామాలను, యోగాసనాలు ఉపకరిస్తాయి. వీటిని దినచర్యలో భాగం చేసుకోగలిగితే హార్మోన్‌ల సమతుల్యత పెంపొందడం, రక్తప్రసరణ సజావుగా సాగడం, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడతాయి. తద్వారా సంతానలేమికి కారణమైన సమస్యల నివారణకు అవకాశం ఎక్కువ. గర్భం దాల్చాలని ఆశిస్తున్న వివాహితలు తమ ఆరోగ్య పరిస్థితికి అనువైన అన్ని రకాల యోగాసనాలను సాధన చేయవచ్చు. అలాగే ప్రసవానంతరం కూడా... శరీరం వదులు కావడం వంటి కొన్ని సమస్యలు వస్తాయి. వాటికి కూడా యోగాయే సమాధానం.  

వాకింగ్‌తో క్వీన్‌..
గర్భధారణ సమయంలో కూడా ఎప్పటిలాగే చురుగ్గా ఉండాలి. గర్భవతులకు వాకింగ్‌ చాలా ఉపయుక్తం. తొలి రెండు త్రైమాసికాల్లో ప్రతిరోజూ స్లో వాకింగ్‌ చివర్లో బ్రిస్క్‌ వాకింగ్‌ చేయవచ్చు. దాదాపు 28 వారాలు నిండాక ప్రీమేటల్‌ ఏరోబిక్స్‌ కూడా చేయవచ్చు. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చాలా హెల్ప్‌ఫుల్‌. ప్రాణాయామ, అనులోమ, విలోమ ప్రాణాయామాలు చేయవచ్చు. ఎంత బాగా డీప్‌ బ్రీత్‌ తీసుకుంటే అంత చక్కగా శ్వాసని కడుపులోని బేబీకి పంపుతున్నట్టు అర్థం. మరో 2, 3 రోజుల్లో డెలివరీ ఉందనగా మెట్లు ఎక్కి దిగడం వంటివి చేస్తే ప్రసవం మరింత సులభం అవుతుంది. అలాగే డెలివరీ సమయంలో నొప్పుల్ని తగ్గించుకోవాలంటే... వేణ్నీళ్ల టబ్‌ ఒక మార్గం. నా డెలివరీ వాటర్‌ టబ్‌లోనే అయ్యింది.  

శారీరక శ్రమ అవసరమే..
అడుగు తీసి అడుగేయవద్దు, అటు పుల్ల ఇటు తీసి  పెట్టొద్దు.. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు వంటి అతి జాగ్రత్తలు గర్ణిణుల విషయంలో సర్వసాధారణం. అయితే అవి సరికాదు. నడక వంటి తేలికపాటి వ్యాయామాలతో పాటు, గర్భంలోని శిశువు సజావుగా పెరగడానికి, తల్లి ఆరోగ్యంలో అసాధారణ మార్పు చేర్పులు చోటు చేసుకోకుండా ఉండడానికి యోగాసనాల సాధన అత్యంత ఉపయుక్తం.

మూడోనెల నుంచీ..    
గర్భధారణ తర్వాత 3 నెలల తర్వాత నుంచి ఆసనాలు సాధన చేయవచ్చు. తగినంత యోగా నైపుణ్యం ఉన్నవారైతే ఇంకాస్త ముందుగానే మొదలుపెట్టవచ్చు. తేలికపాటి భంగిమలకు, ఆసనాలకు పరిమితం కావాలి. ముఖ్యంగా వెనుకకు బాగా వంగి చేసే ఆసనాలు వేయకూడదు. అలా చేస్తే ప్లెసెంటా డిటాచ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. స్ట్రెచ్చింగ్‌లు (శరీరాన్ని సాగదీసే వ్యాయామ భంగిమలు) అన్నీ చేయవచ్చు కానీ అశ్వసంచలాసన లాంటి ట్విస్ట్స్‌ చేయకూడదు. ఓపెన్‌ ట్విస్ట్స్‌ చేయవచ్చు. భరద్వాజాసన లాంటివి చేయవచ్చు. దీనిలోనే క్లోజ్‌ ట్విస్ట్స్‌ చేయకూడదు.  

అధిక ఆహారం అవసరం లేదు..
కొంత మంది తల్లీ, బిడ్డ.. ఇద్దరి కోసం తింటున్నాం అనే భావనతో రోజువారీగా తీసుకునే ఆహారం అమాంతం పెంచేస్తారు. అది సరికాదు. సగటున మహిళకు సాధారణ పరిస్థితుల్లో.. 300 కేలరీల కంటే ఎక్కువ ఆహారం అవసరం లేదు. గర్భవతిగా ఉన్నప్పుడు అత్యధికంగా 10 నుంచి 12 కిలోల బరువు పెరగడం వరకూ ఫర్వాలేదు. అంతకన్నా ఎక్కువైతే ఇబ్బందులే. డ్రైఫ్రూట్స్, ఆకు కూరలు, ప్రొటీన్‌ఫుడ్‌ బాగా తీసుకోవాలి. స్వీట్స్‌ ఎక్కువ తింటే జెస్టేషనల్‌ డయాబెటిస్‌ రావచ్చు. స్వీట్స్‌ బాగా తక్కువగా తీసుకోవాలి. పన్నీర్, పెరుగు వంటి కాల్షియం పుష్కలంగా ఉండేవి తీసుకోవాలి.  రక్తహీనత సమస్యను అధిగమించేందుకు ఖర్జూరం, బీట్‌రూట్‌.. క్యారెట్, పాలకూర, తోటకూర వంటివి బాగా తీసుకోవాలి. 

మరిన్ని వార్తలు