కీలెరిగిన పాదం

25 May, 2016 23:41 IST|Sakshi
కీలెరిగిన పాదం

పూర్వీకులు అందించిన ఆయురారోగ్యశాస్త్రం యోగా. దేహంలోని ప్రతి అవయవాన్నీ చైతన్యవంతం చేసే ఏకైక సాధనం ఇది. శరీర భాగాలను ఆధారం చేసుకుని యోగాసనాలు సాధన చేసే క్రమంలో  శరీరాన్ని ముందుకు కదిలించే పాదం  సజీవ చైతన్యాన్ని  సైతం ముందడుగు వేయిస్తోంది. ఆసనాలకు ఆసరాగా అమరిపోతూ ఆరోగ్య భాగ్యం అందిస్తోంది. అద్భుతమైన ఫలాలను అందించే ఆసనాలకు వందనం. వాటిని మనకు చేరువ చేస్తున్న యోగా నిపుణులకు పాదాభివందనం. పాదాలను ఆధారం చేసుకుని చేసే ఆసనాలు ఈ వారం...

 

ఉభయ పాదాంగుష్టాసన
సమస్థితిలో కూర్చుని కాళ్లు ముందుకు  చేతులు రెండూ పైకి స్ట్రెచ్ చేయాలి.  శ్వాస వదులుతూ తలనూ శరీరాన్ని ముందుకు శ్వాస తీసుకుంటూ చేతులు కాళ్లు రెండూ వీలైనంత వరకూ కలిపి ఉంచుతూ వెనుకకు రోల్ అవుతూ నావాసన సాధన చేసిన తరువాత మెడ వెన్నెముక బాగా రిలాక్స్ అవుతుంది. ఐదారుసార్లు వెనక్కు, ముందుకు బాగా రోల్ అయిన తర్వాత సీటు భాగం నేల మీద సపోర్ట్‌గా ఉంచి కాళ్లను పైకి లేపి కాలి బొటన వేళ్లను గాని పాదాలను గాని రెండు చేతుల్తో పట్టుకుని శ్వాస వదులుతూ కాళ్లు రెండూ శరీరానికి వీలైనంత దగ్గరగా తీసుకొస్తూ మోకాళ్లను స్ట్రెయిట్‌గా ఉంచేందుకు ప్రయత్నించాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులు పాదాలను చేత్తో పట్టుకోవడం వీలుకాకపోతే ఏదైనా తాడును కాని చిన్న టవల్‌ను కాని ఉపయోగించవచ్చు. సీటు మీద బ్యాలెన్స్ చేయలేని వారు ముందు ఒక గోడకు వీపును ఆనించి కాళ్లు రెండూ పైకి లేపి చేత్తో పట్టుకునే ప్రయత్నం చేయవచ్చు.

 

ఉపయోగాలు
పొట్టలో భాగాలన్నింటికీ టోనింగ్ జరుగుతుంది. జీర్ణశక్తి బాగా మెరుగవుతుంది. లివర్, పాంక్రియాస్ ఉత్తేజితమవుతాయి. అధిక వెన్నెముక సమస్య, హెర్నియా నివారణకు మేలు. బ్యాలెన్సింగ్  వలన  ఏకాగ్రత మెరుగవుతుంది.

 

ప్రసారిత ఏక పాదాంగుష్టాసన
ఉభయ పాదాంగుష్టాసనం తర్వాత శరీరం బాగా వార్మప్ అయి ఉంటుంది. అందువలన సాధారణ స్థితికి వచ్చాక, ఎడమకాలుని ఎడమవైపునకు స్ట్రెచ్ చేసి  కుడికాలుని కుడి భుజం మీదకు తీసుకువచ్చి కుడి పాదం తలకు దగ్గరగా (ఏకపాద శిరాసనం) తీసుకురావాలి. కుడి అరచేతిని నేల మీదకు సపోర్ట్‌గా ఉంచి కుడి భుజంతో కుడి తొడ లోపలి భాగాన్ని లోపలకు నొక్కుతూ కుడి కాలి పాదాన్ని ఎడమచేతితో పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఆసనం లోనికి వెళ్లాక 3 లేదా 5 సాధారణ శ్వాసలు తీసుకున్న అనంతరం శ్వాస తీసుకుని, వదులుతూ కుడి చేతిని ముందుకు రెండు కాళ్లను ముందుకు తీసుకురావాలి. ఇదే విధంగా రెండోవైపు కూడా సాధన చేయాలి.

 

ఉపయోగాలు
తొడ కీలు భాగం, సయాటికా  సమస్యల నుంచి విముక్తి.

 

ఎ.ఎల్.వి కుమార్
ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్

 

మరిన్ని వార్తలు