మేనికాంతికి యోగం

27 Aug, 2014 22:31 IST|Sakshi
మేనికాంతికి యోగం

యోగం
 
వయసులో ఉన్నవారి నుంచి వయసు పైబడిన వారి వరకూ అందరి దృష్టీ చర్మకాంతిపైనే! మేని చర్మం నిగనిగలాడుతూ ఉండాలని ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. కానీ, చర్మకాంతికి పై పూతగా వాడే క్రీములు పది శాతం మాత్రమే పనిచేస్తాయి. మిగతా అంతా మనం తీసుకునే జాగ్రత్తలు, ఆహారం, ఆహ్లాదరకరమైన జీవనవిధానమే శాసిస్తుంది.
 
నేడు తీరికలేని పనులు, మానసిక ఒత్తిడుల వల్ల సరిగ్గా శ్వాస పీల్చడం కూడా మర్చిపోతున్నాం. బాల్యంలో సక్రమంగా ఉండే ఉచ్ఛ్వాస నిశ్వాసలలో వయసు పెరుగుతున్న కొద్దీ జీవనవిధానంలో వచ్చే తేడాల వల్ల అపసవ్యత చోటుచేసుకుంటుంది. ఫలితంగా ప్రాణవాయువు శరీరంలోని అన్ని భాగాలకూ సక్రమంగా అందక ఆరోగ్యం దెబ్బతింటుంది. చర్మం కాంతి కోల్పోతుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా, చర్మకాంతి పెరగాలంటే యోగసాధన సరైన మార్గం అంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ ఉదయం 45 నిమిషాలు యోగా చేయడం వల్ల శరీర అంతర్గత అవయవాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మకాంతి పెరుగుతుంది.
 
ప్రాణాయామం...
 
రోజులో 5-6 నిమిషాలు ప్రాణాయామానికి కేటాయించాలి. పద్మాసనం పద్ధతిలో విశ్రాంతిగా కూర్చోవాలి. ఛాతీ నిండుగా గాలి పీల్చి, వదిలేయాలి. ఇలా ఐదు సార్లు చేసిన తర్వాత ఒక వైపు నాసికా రంధ్రాన్ని బొటనవేలితో మూసి, రెండవ నాసిక రంధ్రం గుండా శ్వాస తీసుకోవాలి. ఆ వెంటనే మూసి ఉన్న నాసికపై వేలు తీసేసి లోపలి గాలిని బయటకు పంపించాలి. వయసును బట్టి ఐదు సెకండ్లు ఊపిరితీసుకోవడం, ఐదు సెకండ్లు వదిలేయడం చేయాలి.

యోగాలో భాగమైన ప్రాణాయామం చేసే ప్రక్రియ వ్యక్తుల ఆరోగ్యం, వయసును బట్టి మనిషికి మనిషికి మారుతుంటుంది. అందుకని నిపుణుల పర్యవేక్షణలో ప్రాణాపాయం నేర్చుకొని చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రాణాయామాన్ని సరిగ్గా చేయడం వల్ల వయసు కారణంగా చర్మంపై ఏర్పడే ముడతలు, చర్మం పొడిబారడం, కొంత విహీనం అవడం వంటి సమస్యలు తగ్గి చర్మ కాంతి రోజురోజుకూ పెరుగుతుంది.
 
 - జ్యోతి

 యోగా కేంద్రం
 హైదరాబాద్
 

మరిన్ని వార్తలు