ఉదరమే ఆధారం...

13 Oct, 2016 00:07 IST|Sakshi
ఉదరమే ఆధారం...

పొట్ట ఆధారంగా చేసే ఆసనాల సాధన ద్వారా అనూహ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అలాంటి ఆసనాల గురించిన వివరణే....

 
1. భుజంగాసన (కోబ్రా పోజ్)
బోర్లా పడుకుని మకరాసనంలో చేతులు రెండు మడచి కుడిచేయిని ఎడమ చేతిమీద ఉంచాలి. చేతుల మీద గడ్డం ఆనించి తలకొంచెం లిఫ్ట్ చేసేటట్లుగా ఉంచాలి. పాదాల మధ్య రెండు లేదా మూడు అడుగుల దూరం, కాలి బొటన వేళ్ళు భూమికి దగ్గరగా ఉంచినట్లయితే పొత్తి కడుపు భాగం, తొడలు పూర్తిగా భూమికి ఆని విశ్రాంతి కలుగుతుంది. పొట్ట ఆధారంగా చేసే ఆసనాలకు మధ్య మధ్యలో ఇలా మకరాసనంలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు పాదాలు రెండు కలిపి (వెన్నెముక లేదా సయాటికా సమస్య ఉన్నట్లయితే కాళ్ళు కొంచెం ఎడంగా ఉంచవచ్చు) అరచేతులు ఛాతీకిరువైపులా ఉంచి శ్వాసతీసుకుంటూ గడ్డాన్ని తలను పైకి లేపాలి. తరువాత చేతులు బలంగా నేలకు నొక్కుతూ మోచేతులు ఓపెన్ చేస్తూ ఛాతీని వీలైనంత పైకి లేపాలి. బొడ్డు నుంచి కిందకు నేలమీద పూర్తిగా ఆనేటట్లుగాను బొడ్డు నుంచి పై భాగాన్ని వీలైనంత పైకి లేపే ప్రయత్నం చేయాలి. (ఇది పూర్తి భుజంగాసన స్థితి). ఇలా కష్టం అన్పిస్తే మోచేతుల నుండి ముందు భాగం వరకూ పూర్తిగా రెండు చేతులను నేల మీద శరీరం ఇరువైపులా ముందుకు ఉంచి తలను ఛాతీని పైకి లిఫ్ట్ చేసే అర్థ భుజంగాసన ను ఎంచుకోవాలి.

 
1ఎ) భుజంగాసన: పూర్తి భుజంగాసన స్థితిలో ఉన్నప్పుడు తలను కుడివైపుకు తిప్పి కుడి భుజం మీదుగా వెనుక పాదాలను  మళ్ళీ తలను ఎడమవైపుకు తిప్పి ఎడమ భుజం మీదుగా వెనుక పాదాలను చూసే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా పొట్ట ఛాతీభాగాలను తరువాత గడ్డంను నేలమీదకు తీసుకు రావాలి. శ్వాస తీసుకుంటూ తల ఛాతీ పైకి లేపడం, శ్వాస వదులుతూ  తిరిగి నేల మీదకు మకరాసనంలో విశ్రాంత స్థితికి రావాలి.

 
ఉపయోగాలు: నడుము కింది భాగంలో నొప్పి (లోయర్ బ్యాక్‌యేక్)కి ఉత్తమమైన ఆసనం. ఉదరం, చిన్నప్రేవులు, ప్రాంక్రియాస్, లివర్, గాల్‌బ్లాడర్‌కు  టోనింగ్‌తో అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కిడ్నీ, ఎడ్రినల్ గ్రంథులు సమర్థవంతంగా పనిచేయడానికి, కార్టిసోన్  హార్మోను ఉత్పత్తిని నియంత్రణకి వీలవుతుంది. కీళ్లనొప్పులకు, రెనిమాటిజమ్‌కు పరిష్కారం. స్త్రీలలో ఓవరీ, యుటరస్‌కు టోనింగ్ జరిగి రుతు చక్రసమస్యలకు. పొట్ట భాగంలో కొవ్వు తగ్గడానికి అవకాశం.

 జాగ్రత్తలు: గర్భిణీస్త్రీలు, పెప్టిక్ అల్సర్స్, హెర్నియా, ఇంటెస్టియల్ ట్యూబరోక్లోసిస్ ఉన్నవారు సాధన చేయరాదు.

 
2. సర్పాసన (స్నేక్ పోశ్చర్)
మకరాసనంలో విశ్రాంతి స్థితిలో ఉండి, గడ్డం నేల మీద ఆనించి చేతులు రెండూ వెనుకకు తీసుకువెళ్ళి ఇంటర్‌లాక్ చేసి శ్వాస తీసుకుంటూ కాళ్ళు రెండూ నేలకు గట్టిగా నొక్కుతూ, ఇంటర్‌లాక్ చేసిన చేతుల్ని గట్టిగా పుష్ చేస్తూ పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. చేతులు వేరే వాళ్లు గుంజుతూంటే ఎలాంటి అనుభూతి కల్గుతుందో అదేవిధంగా చేయడానికి ప్రయత్నించాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ మళ్ళీ క్రిందకు రావాలి. ఇలా 3/ 5 సార్లు రిపీట్ చేయవచ్చు.


ఉపయోగాలు: వెన్నెముక బలపడటానికి, ఊపిరితిత్తులు, ఛాతీ, భుజాలు, పొట్ట భాగాలు స్ట్రెచ్ అవడానికి ఉపయోగపడుతుంది. భుజంగాసనం చేయడం వల్ల కలిగే లాభాలన్నీ సర్పాసనం చేయడం వల్ల కూడా కల్గుతాయి.

 - సమన్వయం: సత్యబాబు

 

 

మరిన్ని వార్తలు