తీరైన సాధన... సరైన పధాన...

14 Sep, 2017 00:06 IST|Sakshi
తీరైన సాధన... సరైన పధాన...

నిరంతరం శరీరాన్ని బాగా స్ట్రెచ్‌ చేస్తూ ఉంటే లేదా జిమ్‌ వ్యాయామాల తరహాలో యోగాసనాలను సాధన చేస్తూ ఉంటే కండరాలు గట్టిగా అవడం, తద్వారా వాటికి ఆక్సిజన్‌ సరఫరా తగ్గడం జరుగుతుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ తగ్గకపోగా ఇంకా పెరగడం, ఫైబ్రోమయాల్జియా వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి సాధన ఫలాలు పూర్తిగా అందుకోవడానికి ఏం చేయాలో తెలియజెప్పే సూచనల సమాహారం...

పరిమితికి మించితే...
యోగ సాధన చేసేటప్పుడు శరీరంలోని 360 జాయింట్లకు, 640 కండరాలకు వాటికి సంబంధించిన లిగమెంట్లు, టెండాన్లు, టిష్యూలకు చక్కగా వ్యాయామం అందేటట్టుగా సాధన చేయడం ముఖ్యం. అలా కాకుండా చేస్తున్న సాధన పరిమితికి మించి ఇంటెన్సివ్‌గా ఉన్న పక్షంలో అది శరీరానికి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంది. అది కలిగించే నష్టం వెంటనే కాకపోయినా 3 నుంచి 5 సంవత్సరాల సాధన తర్వాత  సమస్యలు మొదలవుతాయి.  ఉదాహరణకు  గుండెకు సరైన ముందస్తు శిక్షణ లేకుండా కంటిన్యూగా చేసే సూర్యనమస్కారాల వల్ల అది సమర్థవంతంగా పనిచేయలేకపోయే పరిస్థితి రావచ్చు. తద్వారా గుండెపోటు వంటి తీవ్రమైన పరిణామానికి కూడా కారణం కావచ్చు. వర్కింగ్‌ పల్స్‌రేట్‌ టార్గెట్‌ పల్స్‌రేట్‌ (180లో నుంచి వ్యక్తి వయసు తీసివేస్తే వచ్చేదే టార్గెట్‌ పల్స్‌రేట్‌) కన్నా మించిపోయినా, లేదా కార్డియాక్‌ రికవరీ రేట్‌ సరిగ్గా లేకపోయినా సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌కి దారి తీస్తుంది. ఇటువంటి వ్యాయామం వల్ల ఇంగ్వైనల్‌ హెర్నియా చాలా తేలికగా వస్తుంది.

ఆక్సిజన్‌... ఆరోగ్యం...
మన ఆరోగ్యం ప్రధానంగా ఆక్సిజన్‌ మేనేజ్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. శరీరం తక్కువ ఆక్సిజన్‌ కోరుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అలాకాకుండా ఆక్సిజన్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉన్నట్లయితే అది అనారోగ్య సూచికగా పరిగణించవచ్చు. ఉదాహరణకు ఊబకాయులకు, బాగా ఒత్తిడికి గుర య్యే వారికి వ్యాయామం చేసే అలవాటు లేనివారికి జంక్‌ఫుడ్‌ బాగా ఆహారంలో భాగం చేసేవారికి ఆక్సిజన్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. మన ఆహార, విహారాలు, అలవాట్లు శరీరపు తీరుతెన్నులు మన ఆక్సిజన్‌ అవసరాన్ని నిర్దేశిస్తాయి.

శరీరంలో ఫ్లెక్సిబులిటీ పెరగడానికి ఆసనాలను సాధన చేసేటప్పుడు కొత్త వారైతే ముందుగా తేలికపాటి ఆసనాలు కొన్ని సాధన చేయాలి. అలవాటు ఉన్నవారైతే ఆసనం చేసేటప్పుడు తర్వాత మరొక ఆసనానికి వెళ్లేటప్పుడు తగినంత శ్వాస పీల్చడం, వదలడం చాలా ముఖ్యం. సాధన నెమ్మదిగా స్థిరంగా చేసినప్పుడు కండరాలకు ఆక్సిజన్‌ సరఫరా చక్కగా ఉంటుంది. అది ఫ్లెక్సిబులిటీకి ఉపకరిస్తుంది.

ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లయినా ఇలాంటి సాధన చేసినట్లయితే శరీరం తేలికగా అవుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. లేదంటే ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా శరీరంలో ఎటువంటి మార్పులూ కనపడవు. వ్యాయామంతో పాటు మంచి న్యూట్రిషన్‌ విలువలు కలిగిన ఆహారం అంటే పండ్లు, కూరగాయల సలాడ్స్‌ తదితర ఆల్కలైజింగ్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటే దేహానికి చక్కని ఫ్లెక్సిబులిటీ చేకూరుతుంది.

సాధనకు ముందు సిద్ధం చేయాలి...
యోగ సాధనకు ముందుగా శరీరాన్ని సిద్ధం చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ముందుగా ప్రిపరేటరీ పోస్చర్స్‌ గురించి తెలుసుకుందాం. మెడను సిద్ధం చేయడానికి బ్రహ్మముద్రలు చేయాలి. ఇవి నిలబడి లేదా కూర్చుని చేయవచ్చు. మొత్తం 12 రకాల బ్రహ్మముద్రలు ఉంటాయి. ఇవి దక్షిణ, వామ, అథో, ఊర్థ్వ బ్రహ్మముద్రలు.

1.దక్షిణ : శ్వాస తీసుకుంటూ కుడి భుజం మీదకు శ్వాస వదులుతూ గడ్డాన్ని, తలను మధ్యకు తీసుకురావాలి.   
2.వామ: శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని ఎడమ భుజం మీదకు శ్వాస వదులుతూ మధ్యకు తీసుకురావాలి.
3.అథో: ఇదే విధంగా గడ్డాన్ని శ్వాస వదులుతూ కిందకు, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి తీసుకురావాలి.
4.ఊర్థ్వ: శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని, తలను పైకి శ్వాస వదులుతూ ముందుకు మధ్యలోకి తీసుకురావాలి.
5.కర్ణ స్కంద స్వర్శ ముద్ర (దక్షిణ): శ్వాస తీసుకుంటూ కుడి  చెవిని కుడి భుజం మీద ఉంచి శ్వాస వదులుతూ మధ్యలోకి తీసుకురావాలి.
6.కర్ణ స్కంద స్పర్శ ముద్ర (వామ): శ్వాస వదులుతూ ఎడమచెవిని ఎడమ భుజం మీద ఉంచి శ్వాస వదులుతూ మధ్యలోకి తీసుకురావాలి.
(పైన పేర్కొన్నవన్నీ కనీసం 5 లేదా  10 రిపిటీషన్స్‌ చేయాలి)

తర్వాత తలను పెద్ద వృత్తంలా చేస్తూ, శ్వాస వదులుతూ గడ్డం ఛాతీ మీదకు శ్వాస తీసుకుంటూ కుడి పక్కకు పైకి తల వెనుకకు, మళ్లీ శ్వాస వదులుతూ గడ్డం ఎడమ భుజం మీదకు మళ్లీ కిందకు ఛాతీ మీదకు... ఈ విధంగా 3 రౌండ్స్‌ గడియారం దిశలో తర్వాత 3 రౌండ్స్‌ వ్యతిరేక దిశలో చేయాలి. చేసేటప్పుడు కళ్లు తిరుగుతున్నట్లయితే దానికి ప్రధానంగా 3 కారణాలు ఉండవచ్చు. 1.లో సుగర్‌ లేదా హైపోగ్లైసీమియా 2)లో బీపీ  3)స్పాండిలైటిస్‌ సమస్య వల్ల కావచ్చు. అలాంటప్పుడు ఒక రౌండ్‌ గడియారం దిశలో; మరొక రౌండ్‌ వ్యతిరేక దిశలో చేయాలి. తల వెనుకకు తీసుకువెళ్లినప్పుడు కళ్లు తిరిగినట్లనిపిస్తే మెదడుకు, తలకు ఆక్సిజన్, రక్త సరఫరా తగ్గినందు వల్ల కావచ్చు. అలాంటప్పుడు ముందుకు వంగితే వెంటనే రిలీఫ్‌ వస్తుంది.
– సమన్వయం: ఎస్‌. సత్యబాబు మోడల్‌: ఈషా హిందోచా
ఎ.ఎల్‌.వి కుమార్‌ ట్రెడిషనల్‌  యోగా ఫౌండేషన్‌

మరిన్ని వార్తలు