అడ్రినల్‌...ఆరోగ్యం

25 Oct, 2017 23:47 IST|Sakshi

యోగ

రెండు కిడ్నీలకు పై భాగంలో 2 1/2 అంగుళాల వెడల్పుతో ఆనుకుని ఉన్న అడ్రినల్‌ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వలన వచ్చే సమస్యే  అడ్రినల్‌ ఫాటిగ్‌.  అడ్రినల్‌ గ్రంథులు సెక్స్‌ సంబంధిత డిహెచ్‌ఇఆర్‌ హార్మోన్‌ను, స్లీప్‌ సైకిల్‌కు సంబంధించిన కార్టికో స్టిరాయిడ్‌ హార్మోన్‌ను, న్యూరో ట్రాన్స్‌మీటర్‌ అయిన అడ్రినలిన్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి.  నిరంతరంగా మోతాదుకు మించి కార్టిజోల్‌ హార్మోన్‌ ఉత్పత్తి అయితే (స్ట్రెస్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు) రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. కొలెస్ట్రాల్, హైగ్లిజరైడ్స్‌ పెరిగి రోగనిరోధక శక్తి, ఎముకల సాంద్రత తగ్గుతుంది. స్థూలకాయం, గుండె జబ్బులకు దారి తీస్తుంది.  హార్మోన్‌ తక్కువ స్థాయిలో ఉండడం కూడా స్థూలకాయానికి దారితీయవచ్చు. ఇంతే కాకుండా కండరాల బలహీనత, థైరాయిడ్, నిద్రలేమికి కూడా దారితీస్తుంది. ఆహారంలో మార్పులతో పాటు, డిహెచ్‌ఇఆర్, మెలటోనిన్‌ వంటి హార్మోన్‌ సప్లిమెంట్స్‌ను, బి కాంప్లెక్స్, విటమిన్‌–సి సప్లిమెంట్స్‌ను, ఎల్‌–థియానిన్, ఒమెగా–3, కాల్షియమ్, మెగ్నిషియమ్‌ మినరల్‌ సప్లిమెంట్స్‌ను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అయితే ఈ గ్రంథుల పనితీరు సరిగ్గా ఉండాలంటే యోగా వంటి  వ్యాయామం తప్ప వేరే మార్గం లేదు. పదినిమిషాల పాటు ప్రశాంతంగా  రోజూ ధ్యానం చేయడం ద్వారా కూడా సమస్య పరిష్కారంలో ఉపకరిస్తుంది.  ఇక ఆసనాల విషయానికి వస్తే.. అడ్రినల్‌ గ్రంథుల మీద డైరెక్ట్‌గా పనిచేసే ఆసనాలు జానుశిరాసనం, పశ్చిమోత్తనాసనం, యోగముద్ర, భరద్వాజాసనం. ఫాటిగ్‌(అలసట)ని తగ్గించడానికి  బాలాసనం, శశంకాసనం, విపరీత కర్ణి (గోడను లేదా కుర్చీని ఆధారంగా చేసుకుని), సుఖాసనం, సేతుబంధాసనం, శవాసనం లేదా యోగనిద్ర వంటివి చక్కగా ఉపయోగపడ్తాయి. ఇప్పుడు ఇందులో కొన్ని ఆసనాల గురించి, అవి చేసే విధానం గురించి తెలుసుకుందాం.

1 జాను శీర్షాసనం
కుడికాలు ముందుకు స్ట్రెచ్‌ చేసి ఎడమ మడమ పెరీనియం( జననేంద్రియానికి, గుద భాగానికి మధ్య భాగం) కు దగ్గరగా ఉంచి శ్వాస తీసుకుని చేతులు పైకి తీసుకువెళ్ళి నడుము భాగాన్ని బాగా పైకి సాగదీస్తూ శ్వాస వదులుతూ తల చేతులు కలిపి నెమ్మదిగా ముందుకు వంగి రెండు చేతులతో కుడి పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. శిరస్సు లేదా గడ్డం మోకాలుకి దగ్గరగా తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ తల చేతులు కలిపి మళ్ళీ పైకి తీసుకువెళ్ళి శ్వాస వదులుతూ రెండు చేతులు పక్క నుండి కిందకు తీసుకురావలెను. ఇదే విధంగా రెండవ వైపు కూడా చేయాలి.

జాగ్రత్తలు: ∙ఔ1– ఔ5 భాగంలో సమస్య, లోయర్‌ బ్యాక్‌లో సమస్య, పించ్‌ నర్వ్‌ లేదా సయాటికా సమస్య ఉన్నా కుడికాలిని స్ట్రెయిట్‌గా మోకాలిని పైకి లేపి ఉంచడం చాలా ముఖ్యం ∙ఇక ఎటువంటి నడుము నొప్పి లేకుండా ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కాలు నిటారుగా ఉంచి, ఒక వేళ రెండు చేతులతో పట్టుకోవడానికి అందకపోతే తాడును కాని, బెల్టుని కాని ఉపయోగించి శ్వాస వదులుతూ కొంచెం కొంచెం ముందుకు వంగడానికి ప్రయత్నించవచ్చు ∙గర్భం ధరించాలనుకునే స్త్రీలు ఈ ఆసనం చేయకపోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ ఆసనం చేసేటప్పుడు ఫాలోపియన్‌ ట్యూబ్‌ ద్వారా అండము గర్భాశయంలోకి చేరడాన్ని నివారిస్తుంది.
ఉపయోగాలు: కిడ్నీలు, అడ్రినల్‌ గ్రంథులు, కాలేయం, పాంక్రియాజ్‌ పనితీరు మెరుగవుతుంది.

2 పశ్చిమోత్త నాసనం
పశ్చిమ అంటే వెనుక భాగం లేదా వీపు. ఉత్తాన అంటే సాగదీయడం, ఈ ఆసనం చేసేటప్పుడు వీపు భాగం సాగదీయబడుతుంది. కాబట్టి దీనికా ఆ పేరు. కాళ్ళు రెండూ ముందుకు స్ట్రెచ్‌ చేసి శ్వాస తీసుకుంటూ చేతులు పక్కల నుండి పైకి తీసుకువెళ్ళి భుజాలు రెండూ తలకు ఇరువైపులా ఆనించి, నడుమును చేతులను పైకి సాగదీస్తూ, శ్వాస వదులుతూ నెమ్మదిగా తల చేతులు కలిపి ముందుకు వంగుతూ రెండు చేతులతో రెండు పాదాలను పట్టుకోవాలి. నుదురు మోకాళ్లకు దగ్గరగా, మోచేతులు రెండూ భూమికి దగ్గరగా తేవాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ తల చేతులు కలిపి పైకి తీసుకువెళ్ళి శ్వాస వదులుతూ రెండు చేతులు పక్కల నుండి కిందకు నడుముకు ఇరువైపులకు తీసుకురావాలి.
జాగ్రత్తలు: ఔ1– ఔ5లో సమస్య ఉన్నవాళ్ళు సయాటికా సమస్య ఉన్నవాళ్లు మోకాళ్లు పైకి లేపి ఉంచడం మంచిది. ఎంతవరకు సుఖ పూర్వకంగా వంగగలరో అంతవరకే చేయడం మంచిది. గట్టి ప్రయత్నం చేయదలచినవారు తాడును కాని, బెల్టును కాని పాదాల వెనుక నుండి పోనించి రెండు కొసలను చేతులతో పట్టుకుని ముందుకు వంగే ప్రయత్నం చేయవచ్చు.
ఉపయోగాలు: కిడ్నీలు, అడ్రినల్‌ గ్రంథుల మీద మంచి ప్రభావం. జీర్ణ వ్యవస్థకు మంచిది.

3 సేతు బంధాసనం
వెల్లికిలా పడుకుని మోకాళ్ళు రెండూ పైకి ఉంచి రెండు పాదాలు పూర్తిగా భూమి మీద ఆనేటట్లుగా జాగ్రత్త తీసుకుంటూ మడమలు రెండూ (పిరుదులకు) హిప్స్‌కు వీలైనంత దగ్గరగా ఉంచి రెండు చేతులతో మడమలను పట్టుకుని (ఒకవేళ పట్టుకోలేక పోయినా ఫరవాలేదు) లేదా దగ్గరగా ఉంచి శ్వాస తీసుకుంటూ సీటు భాగాన్ని, నడుమును, వీపు భాగాన్ని వీలైనంత పైకి లేపి శ్వాస వదులుతూ ఒక్కొక్క వెన్నుపూస పై నుండి కిందకు నెమ్మదిగా భూమి మీద తగిలే విధంగా కిందకు రావలెను. దీనిని 5 నుండి 10 సార్లు రిపీట్‌ చేయాలి.
గమనిక: ఒక వేళ సీటు భాగం వీపు భాగం అసలు పైకి లేపలేనివారు ఎల్తైన కుషన్‌ను లేదా బాలిస్టర్‌ను ఉపయోగించి ఈ స్థితిలో 5 నిమిషాలు విశ్రాంత స్థితిలో ఉండవచ్చు.
ఉపయోగాలు: స్ట్రెస్, మైల్డ్‌ డిప్రెషన్‌ని తీసివేస్తుంది. మనసు ప్రశాంత స్థితిని అనుభవిస్తుంది. రుతుసమస్యలకు, వెన్ను సమస్యకు, నిద్రలేమి సమస్యకు మంచిది. అడ్రినల్‌ గ్రంథుల మీద పనిచేయడం వలననే పై ఉపయోగాలు కల్గుతాయి.
– సమన్వయం: ఎస్‌. సత్యబాబు
మోడల్‌: ఈషా హిందోచా

–  ఎ.ఎల్‌.వి కుమార్‌
ట్రెడిషనల్‌ యోగా ఫౌండేషన్‌

మరిన్ని వార్తలు