సమకోణాసనం

16 Dec, 2013 23:07 IST|Sakshi

ఈ ఆసనం వేసినప్పుడు దేహం సమానమైన కోణాకృతిలో ఉంటుంది.
 
 ఎలా చేయాలంటే..?
 రెండు కాళ్లు బారజాపి వెన్నెముకను నిటారుగా ఉంచి రెండు అరచేతులు తొడల మీద బోర్లించి సమస్థితిలో కూర్చోవాలి.
     
 ఇప్పుడు రెండుకాళ్లను రెండవ ఫొటోలో ఉన్నట్లు ఇరువైపులా పక్కలకు చాపాలి. మోకాళ్లను వంచకూడదు.
     
 ఇప్పుడు మూడవ ఫొటోలో ఉన్నట్లు రెండు అరచేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. ఈ స్థితిలో వెన్నెముక నిటారు గా ఉండాలి. దృష్టి ఎదురుగా ఒక బిందువుపై కేంద్రీకరించాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఏకాగ్రత శ్వాస మీద లేదా ఆసన స్థితి మీద ఉండాలి.
     
 ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తరవాత యథాస్థితికి రావాలి. ఈ ఆసనాన్ని రోజు కు మూడు నుంచి ఐదుసార్లు సాధన చేయాలి. ఈ ఆసనాన్ని ఏ సమయంలోనైనా సాధన చేయవచ్చు.
 
 ఉపయోగాలు
 సుఖప్రసవం కావడానికి దోహదపడే ఈ ఆసనాన్ని గర్భం ధరించిన నాటి నుంచి తొమ్మిది నెలలు నిండేవరకు కూడా సాధన చేయవచ్చు.
     
 రుతుక్రమ సంబంధమైన సమస్యలు, రజస్వల సమస్యలు తొలగిపోతాయి.
     
 పురుషులలో స్వప్న దోషాలు, మూత్రదోషాలు పోతాయి. వీర్యశక్తి పెరుగుతుంది.
     
 ఏకాగ్రత పెరుగుతుంది. చిత్తం స్థిరంగా ఉంటుంది.
     
 కాళ్లకు రక్తప్రసరణ కావలసినంత జరుగుతుంది.
     
 మోకాళ్ల నొప్పులు తొలగిపోతాయి. తొడలలోని కొవ్వు కరుగుతుంది.
     
 వెన్నెముక సరళరతమవుతుంది. నిగ్రహశక్తి పెరుగుతుంది.
     
 కటిప్రదేశంలోని కండరాలు, భాగాలు బలంగా ఉంటాయి.
 
 జాగ్రత్తలు!
 మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు కాళ్లను మరీ ఎక్కువ ఒత్తిడి చేయకుండా సౌకర్యంగా ఉన్నంత వరకే చాపి సాధన చేయాలి.
 
 
 మోడల్ : ఎస్. దుర్గాహర్షిత,
 నేషనల్ యోగా చాంపియన్
 ఫొటోలు: శివ మల్లాల

 
 బీరెల్లి చంద్రారెడ్డి
 యోగా గురువు
 సప్తరుషి యోగవిద్యాకేంద్రం
 హైదరాబాద్

 

మరిన్ని వార్తలు