పతంజలి మహర్షి

6 Jan, 2016 22:51 IST|Sakshi
పతంజలి మహర్షి

యోగి కథ

యోగా అత్యంత ప్రాచీనమైన విద్య. మౌఖిక సంప్రదాయంలో విద్యావ్యాప్తి కొనసాగే కాలంలో ఈ విద్య అతి కొద్దిమందికి మాత్రమే పరిమితమై ఉండేది. యోగా నియమ నిబంధనలేవీ చాలాకాలం పాటు గ్రంథస్థం కాలేదు. గురువుల అనుగ్రహంతో మాత్రమే కొందరు జిజ్ఞాసులు ఈ విద్యను నేర్చుకోగలిగేవారు. క్రీస్తుశకం నాలుగో శతాబ్దంలో పతంజలి మహర్షి తొలిసారిగా యోగ సూత్రాలను గ్రంథస్థం చేశారు. ఇప్పటి కాలంలోనూ జన సామాన్యానికి యోగా గురించి కాస్తో కూస్తో అవగాహన ఉందంటే, అందుకు పతంజలి మహర్షి చలవే! ఆయన ప్రాచీన యోగశాస్త్రాన్ని మథించి, 196 సూత్రాలు రాశారు. యోగ విద్యలో హఠయోగ, క్రియాయోగ వంటి ఎన్ని శాఖోపశాఖలు ఉన్నా, కార్పొరేట్ యుగంలో యోగాను మనం ఎన్ని కొత్త కొత్త పేర్లతో పిలుచుకుంటున్నా, వాటన్నింటికీ పతంజలి మహర్షి సూత్రాలే ప్రామాణికం. ఆయన తన సూత్రాలన్నింటినీ నాలుగు విభాగాలుగా విభజించారు. అవి: సమాధిపద, సాధనాపద, విభూతిపద, కైవల్యపద.

మనోచలనాన్ని నిరోధించడం ద్వారా సమాధి స్థితికి ఎలా చేరుకోవాలో ‘సమాధిపద’లో వివరించారు. ఇందులో 51 సూత్రాలు ఉన్నాయి. క్రియా యోగ, అష్టాంగ యోగాలను ఎలా సాధన చేయాలో ‘సాధనాపద’లో 55 సూత్రాల ద్వారా తెలిపారు. ధారణ, ధ్యాన, సమాధి సాధనలలో ఎలా సంమయనం పాటించాలో ‘విభూతిపద’లో వివరించారు. ఇందులో 56 సూత్రాలు ఉన్నాయి. ఈ విభాగంలో సిద్ధుల సాధన ప్రస్తావన ఉన్నా, అవి మాయ మాత్రమేనని, కైవల్య లక్ష్యానికి దూరం చేస్తాయని హెచ్చరించారు. యోగసాధన పరమలక్ష్యమైన కైవల్యప్రాప్తి (మోక్షప్రాప్తి) గురించి 34 సూత్రాలతో ‘కైవల్యపద’ను విపులీకరించారు. యోగ సాధనకు యమ (నైతిక క్రమశిక్షణ), నియమ (విధి విధానాలు), ఆసన (యోగాసనాలు), ప్రాణాయామ (ఉఛ్వాస నిశ్వాసాలపై నియంత్రణ), ప్రత్యాహార (ఆలోచనల నుంచి ఉపసంహరణ), ధారణ (ఏకాగ్రత), ధ్యాన (ధ్యానం), సమాధి (నిశ్చల స్థితి) అనే అష్టాంగాలు కీలకమైనవని మానవాళికి తొలిసారిగా చాటిన మహనీయుడు పతంజలి మహర్షి.
 

మరిన్ని వార్తలు