షుగర్...నో ఫికర్

12 May, 2016 00:17 IST|Sakshi
షుగర్...నో ఫికర్

పాంక్రియాస్‌ను చైతన్యవంతం చేసే ఆసనం ఉంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ఆర్డర్‌లో పెట్టే ఆసనాలూ ఉన్నాయి. షుగర్ రావడం అంటే శరీరంలో ఏదో సవ్యత లోపించడమే. యోగా శరీరాన్ని క్రమస్థితిలో ఉంచుతుంది. అంటే షుగర్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతుందన్నమాట.

1. వక్రాసన
సుఖాసనంలో కూర్చుని రెండు కాళ్లు ముందుకు సాచాలి. స్ట్రెచ్ చేయాలి. కుడి మోకాలును పైకి లేపి పాదాన్ని పూర్తిగా జననేంద్రియాలకు దగ్గరగా ఉంచాలి. శరీరాన్ని, నడుముని కుడివైపుకు తిప్పి నిలబెట్టినట్టుగా ఉండాలి. కుడిమోకాలు ఎడమ చంకభాగంలోకి వచ్చేటట్లుగా కుడి చెయ్యి సీటుకి వెనుక వైపుగా తీసుకెళ్లి, అరచేతిని భూమి మీద నొక్కుతూ ఆ

 సపోర్ట్‌తో వీలైనంతవరకూ నడుమును పూర్తిగా ట్విస్ట్ చేస్తూ కుడి భుజం నుండి వెనుకకు చూసే ప్రయత్నం చేయాలి. ఈ ఆసనంలోకి వెళ్లి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి వెనుకకు అంటే యధాస్థితికి రావాలి. కాళ్లు రెండూ ఫ్రీ చేసుకున్న తరువాత రెండవ వైపు కూడా ఇలాగే సాధన చేయాలి. ఈ వక్రాసనం మరీచాసనం తరువాత చేయబోయే అర్థమశ్చీంద్రాసనానికి సిద్ధం చేస్తుంది.

ఉపయోగాలు: నడుమును ట్విస్ట్ చేయుడం, పొట్ట దగ్గర కండరాలను లోపలకు లాగడం వలన జీర్ణావయవాలకు మంచి టోనింగ్ జరుగుతుంది.

2. అర్ధమశ్ఛీంద్రాసన
పై వక్రాసనంలో నిలబెట్టి ఉంచిన కుడికాలును ఎడమకాలు మీద నుండి క్రాస్ చేసి, ఎడమ పాదాన్ని కుడి తొడ బయట వైపుకు తీసుకురావాలి. సీటుకు వీలైనంత దగ్గరగా ఉంచి ఎడమకాలును మడిచి ఎడమ పాదాన్ని, ఎడమ మడమ కుడి సీటు భాగానికి దగ్గరగా ఉంచి, ఎడమ చంక భాగంలోకి నిలబెట్టి (ఫొటోలో చూపిన విధంగా) కుడి చేతిని మడచి వీపు వెనుక భూమికి సమాంతరంగా ఉంచాలి. కుడి మోకాలు మీద నుంచి ఎడమ చేతిని ట్విస్ట్ చేస్తూ వీపు వెనుక రెండు చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేసే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ తల కుడి భుజం మీదుగా తిప్పి వెనుకకు కుడివైపుకు చూసే ప్రయత్నం. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి యధాస్థితికి రావాలి. తరువాత కాలు మార్చుకుని రెండవ వైపుకు కూడా ఇలాగే చేయాలి.

ఉపయోగాలు: ఈ ఆసనం ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పకుండా చేయాలి. పాంక్రియాస్ మీద ఒత్తిడి ఉండటం వలన, పాంక్రియాస్ బాగా యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరుగుతుంది. రెండవవైపు చేసినప్పుడు లివర్ మీద ప్రభావం ఉంటుంది. దీంతో ఫాటీ లివర్ సిండ్రోమ్, లివర్ సిరోసిస్ వంటి వ్యాధులకు కూడా పరిష్కారం లభిస్తుంది.
గమనిక: ఆసనం పూర్తి స్థాయిలో చేయలేకపోయినా కాలు నిలబెట్టి ఉంచినప్పుడు క్రాస్ చేసినప్పుడు శరీరానికి దగ్గరగా అదుముతూ నడుమును పక్కలకు ట్విస్ట్ చేయగల్గినట్లయితే ఆశించిన పలితం తప్పకుండా చేకూరుతుంది.

3. యోగముద్రాసన
పద్మాసనంలో కూర్చొని చేతులు రెండు వెనుకకు తీసుకెళ్లాలి. వ్యతిరేక దిశలో కుడిచేతితో ఎడమపాదాన్ని కాలివేళ్లను, ఎడమచేత్తో కుడి పాదాన్ని, కాలివేళ్లను పట్టుకుని (ఆ ఆసనం బద్ధ పద్మాసనమని పిలుస్తారు) శరీరాన్ని నిటారుగా ఉంచి, పూర్తిగా శ్వాసతీసుకుని శ్వాసను వదులుతూ ఉండాలి. నడుము నుండి పై శరీర భాగాన్ని బాగా సాగదీస్తూ ముందుకు వంగి నుదురును భూమి మీద ఆనించాలి. లేదా భూమికి వీలైనంత దగ్గరగా తీసుకురావాలి.

ఒక వేళ వెనుక నుండి కాలి వేళ్లను ఫొటోలో చూపిన విధంగా పట్టుకోలేకపోతే ఎడమచేతి మణికట్టును కుడి చేత్తో పట్టుకుని చేతుల్ని వెనుక కిందకు లాగుతూ శరీరాన్ని ముందుకు వంచవచ్చు. తల భూమికి శక్తి కొద్దీ దగ్గరకు తీసుకువస్తే ఆశించిన ఫలితం లభిస్తుంది. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుని పైకి రావాలి.

 ఉపయోగాలు: జీర్ణవ్యవస్థకు, పునరుత్పత్తి వ్యవస్థకు ఈ ఆసనం చాలా మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కగా పనికి వచ్చే ఆసనం.

మరిన్ని వార్తలు