భక్తియోగి చైతన్య మహాప్రభువు

16 Mar, 2016 23:01 IST|Sakshi
భక్తియోగి చైతన్య మహాప్రభువు

యోగి కథ
 
యోగవిద్యలో హఠయోగం, క్రియోయోగం, జ్ఞానయోగం వంటి మార్గాలు ఎన్ని ఉన్నా, భగవంతుడిని చేరుకోవడానికి భక్తియోగానికి మించినది లేదని త్రికరణ శుద్ధిగా నమ్మిన మహాభక్తియోగి చైతన్య మహాప్రభువు. గౌడీయ వైష్ణవాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన చైతన్యుడు సాటిలేని కృష్ణ భక్తుడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన భక్తియోగ మార్గాన్ని జీవితాంతం అనుసరించాడు. ‘హరేకృష్ణ’ నామసంకీర్తనకు విశేష ప్రాచుర్యం కల్పించాడు. శ్రీకృష్ణుడిపై తన భక్తిని చాటుకుంటూ సంస్కృతంలో శిక్షాష్టకాన్ని రచించాడు. బెంగాల్‌లోని నవద్వీపంలో 1486 ఫిబ్రవరి 18న పుట్టిన చైతన్యుడి అసలు పేరు విశ్వంభర మిశ్రా. చిన్నప్పుడు తెల్లనిఛాయతో మెరిసిపోయేవాడు. అందువల్ల అతడిని ముద్దుగా గౌరాంగ అని పిలిచేవారు. తండ్రి జగన్నాథ మిశ్రా, తల్లి శచీదేవి. చైతన్యుడి బాల్యమంతా దక్షిణ ఢాకాలో గడిచింది. భాగవత గాథలను ఆలకిస్తూ పెరిగిన చైతన్యుడికి బాల్యంలోనే కృష్ణుడిపై అపరిమితమైన భక్తి ఏర్పడింది. చిన్న వయసులోనే తండ్రి మరణించాడు. చదువుసంధ్యల కంటే ఊళ్లో జరిగే భజన సంకీర్తనలే చైతన్యుడికి ప్రధాన వ్యాపకాలుగా ఉండేవి.

తండ్రికి శ్రాద్ధకర్మలు చేసేందుకు గయకు వెళ్లినప్పుడు అక్కడ తారసపడిన గురువు ఈశ్వర పురి వద్ద గోపాలకృష్ణ మంత్రం పొందాడు. ఇక అక్కడి నుంచి స్వస్థలానికి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా లౌకిక వ్యవహారాలు పట్టకుండా పూర్తిగా భక్తిపారవశ్యంలో ఉండేవాడు. ప్రముఖ యోగగురువు కేశవభారతి ఆదేశాలపై సన్యాసం స్వీకరించాడు. సన్యాసిగా మారిన తర్వాత దేశమంతా విస్తృతంగా పర్యటించి, ప్రజలకు భక్తిమార్గాన్ని ప్రబోధించాడు. అవసాన దశలో జగన్నాథ ధామమైన పూరీలో గడిపాడు. పూరీలోని స్వర్గద్వార వద్ద 1534 జూన్ 14న మహాసమాధి పొందాడు.
 
 
 

మరిన్ని వార్తలు