ధర్మ జిజ్ఞాస

6 Aug, 2017 00:01 IST|Sakshi

గ్రహణకాలం కేవలం ఖగోళ శాస్త్రజ్ఞులకు, జ్యోతిష్కులకు, వైజ్ఞానికులకు మాత్రమే ముఖ్యమైనది కాదు. యోగులు, సాధకులు కూడ ఈ సమయం కోసం వేచి చూస్తుంటారు. తంత్రశాస్త్రం ప్రకారం గ్రహణకాలం మంత్రదీక్షను స్వీకరించడానికి అనువైన కాలం. సాధారణ కాలంలో సిద్ధించని మంత్రాలకు గ్రహణకాలంలో చాలా సులువుగా సిద్ధి లభిస్తుంది. మంత్ర తంత్ర సంబంధిత ప్రయోగాలకు క్రియలకు గ్రహణ సమయాన్ని మించిన కాలం లేదు. మామూలుగా చేసే జపతపాలు, దానధర్మాలు గ్రహణ సమయంలో చేస్తే లక్షరెట్లు అధికఫలం కలుగుతుందని శాస్త్రోక్తి. గ్రహణ సమయం పర్వకాలమని పురాణాలు, ధర్మశాస్త్రాలలో పలు దృష్టాంతాలు కనిపిస్తాయి. వారణాసిలో చంద్రగ్రహణ మహిమ, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ ప్రభావం గురించి చెప్పారు.

గ్రహణకాలంలో ఇవి చేయాలి: చంద్ర లేక సూర్యగ్రహణం దర్శన యోగ్యంగా ఉంటే అదంతా పుణ్యకాలమే. మేఘాల వల్ల ఇది స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ, పంచాంగం ద్వారా లేదా శాస్త్రాల ద్వారా తెలుసుకుని గ్రహణ స్పర్శ – మోక్ష కాలాలు తెలుసుకుని స్నానం చేయాలి ∙గ్రహణ స్నానాన్ని కట్టుకున్న వస్త్రాలతోనే చేయాలి ∙గ్రహణకాలంలో చేసే ఇష్టదేవతారాధన, జపం, దానం అధికఫలప్రదం కాబట్టి వీలయినంతవరకు ఆయా పుణ్యకార్యాలను ఆచరించాలి ∙గ్రహణం విడువగానే పుణ్యనదులు, సరోవరాలు, కాలువలు, బావులు లేదా కనీసం కుళాయి నీటితో అయినా స్నానం చేయడం వల్ల శారీరక, మానసిక మలినాలు తొలగిపోయి, మంచి భావనలు కలుగుతాయి. సోమవారం (7–8–17) నాడు చంద్రగ్రహణం.

ఇవి చేయకూడదు: ∙గ్రహణాన్ని నేరుగా కంటితో చూడకూడదు ∙గ్రహణ కాలంలో నిద్రించకూడదు. మైథునం (సంగమం) చేయరాదు ∙వృద్ధులు, రోగులు, బలహీనులు మినహా మిగిలిన వారెవ్వరూ గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారమూ భుజించకూడదు. పాలు, మజ్జిగ, మీగడ, నూనెతో వండిన పదార్థాలు తినవలసి వస్తే ముందుగానే వాటి మీద దర్భలు ఉంచాలి. అప్పుడు అవి పరిశుద్ధమవుతాయి ∙గర్భిణులు గ్రహణ కాలంలో బయటకు రాకూడదు.

ఆలయాలను ఎందుకు మూసివేస్తారు?
సూర్యచంద్రులతో భూమికి గల సంబంధాన్ని బట్టే కాలగణన జరుగుతుంది. అటువంటి సూర్య చంద్రులకు గ్రహణం కలిగిందంటే అది దుర్దినమేకదా! సామాన్య భాషలో చెప్పాలంటే లోకానికి వెలుగు, వేడిని ప్రసాదించే సూర్యచంద్రులను క్రూరగ్రహాలైన రాహుకేతువులు మింగడమంటే అది లోకానికంతటికీ కష్టకాలమే కదా! కాబట్టి సమాజమంతటినీ కలిపే కేంద్రమైన దేవాలయాలను గ్రహణ కాలంలో మూసివేసి, గ్రహణం వీడిన తరువాత శుద్ధి చేసి న తర్వాతనే పూజాకాదికాలు ప్రారంభిస్తారు.
 

మరిన్ని వార్తలు