ఆరోగ్య ధన్‌’వంతరి

17 Oct, 2017 04:16 IST|Sakshi

ఆయుర్వేదంలో ఎవరైనా మంచి హస్తవాసి గల వైద్యులుంటే వారిని ధన్వంతరితో పోలుస్తారు. ఆయుర్వేదమనే కాదు, వైద్యులందరూ కూడా ధన్వంతరికి వారసులేననడంలో తప్పులేదు. ఎందుకంటే మొట్టమొదటి వైద్యుడు ధన్వంతరే కాబట్టి. ఆయన దేవ వైద్యుడు. ప్రస్తుతం దీపావళికి రెండురోజుల ముందు మనం జరుపుకుంటున్న ధన్‌తేరస్‌ పండుగలో ధన్‌ అనేదానికి ధనమనే చెప్పుకుంటున్నాం కానీ, «నిజానికి అది ధన్వంతరికి సంబంధించినదే. ధన్వంతరిని సాక్షాత్తూ విష్ణుమూర్తి అంశగా చెప్పుకుంటారు.  దేశవ్యాప్తంగా ధన్వంతరికి ఆలయాలున్నాయి. ధన్వంతరి పేరుతో అనేక వైద్య, సేవాసంస్థలు కూడా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లేముందు అసలు ధన్వంతరి ఎవరో తెలుసుకుందాం.. దేవతలూ, రాక్షసులూ కలసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నారు. ముందుగా హాలాహలం ఉద్భవించింది. లోకాలను దహించివేసే ఆ హాలాహలాన్ని ఉండగా చేసుకుని, పరమేశ్వరుడు దానిని భక్షించి, గరళకంఠుడయ్యాడు. ఆ తరువాత కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం, అప్సరసలు ఆవిర్భవించారు. తరువాత లక్ష్మీదేవి, ఆ తరువాత అరచేత అమృతకలశాన్ని పట్టుకుని, విష్ణుమూర్తి అంశతో ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. ఆయనే ధన్వంతరి. అప్పటినుంచి దేవవైద్యుడు ఆయనే. ఆయుర్వేదానికి, సమస్త ఔషధాలకు మూలపురుషుడు ఆయనే.

లక్ష్మీదేవి, ధన్వంతరి ఒక్కరోజే ఉద్భవించినప్పటికీ, ధన్వంతరి విషయం ఎవరూ అంతగా పట్టించుకోరు. ఎందుకంటే, ఆరోగ్యం కన్నా, అందరికీ ధనమే ముఖ్యం అయిపోయింది కదా మరి! అందుకే ధన్‌తేరస్‌ నాడు కేవలం లక్ష్మీపూజ... అదీ కాదు... విలువైన వస్త్రాభరణాలు, ఖరీదైన వస్తుసామగ్రుల కొనుగోలులో మునిగి తేలుతుంటారు. లక్ష్మీపూజ చేయడంలో, వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేయడంలో తప్పు లేదు కానీ, ఆరోగ్యం కూడా సంపదే! అందుకే కదా, అష్టలక్ష్ములలో ఆరోగ్యం కూడా లక్ష్మీస్థానం సంపాదించుకుంది. కనీసం ఈ విషయం తెలిస్తే అయినా ఈ పర్వదినాన వైద్యనారాయణుడైన ధన్వంతరిని స్మరించుకుంటారని...
– డి.వి.ఆర్‌.

మరిన్ని వార్తలు