నీకు నీవే ప్రేరణ!

5 Mar, 2015 23:36 IST|Sakshi
నీకు నీవే ప్రేరణ!

సంగలుడు ఒక నిరుపేద కూలి. చిరిగిపోయి, దుమ్ముకొట్టుకుపోయిన బట్టలతో ఉండేవాడు. ఒకరోజున తన దారికి ఎదురుపడ్డ భిక్షవుని చూసి, ‘నేను కూడా భిక్షువునైతే బాగుండును. ఈ కాషాయబట్టలు కట్టుకుని గౌరవంగా జీవించవచ్చు’ అనుకుని ఆ భిక్షువుని ఆపి, తన మనస్సులోని మాట చెప్పాడు.

‘‘నీకు భిక్షువు కావాలని ఉందా? అయితే నాతో రా’’ అని చెప్పి, తీసుకొని పోయి, ఒక కొలనులో స్నానం చేయించి, గుండుగీయించి, కాషాయ బట్టలు కట్టి విహారానికి తీసుకుపోయాడు. అప్పుడు సంగలుడు తన పాతబట్టల్ని, ఆ విహారం బైట ఉన్న ఒక చెట్టుతొర్రలో దాచి, లోపలికి వెళ్లాడు.

కొంతకాలానికి ఆ భిక్షు జీవితం మీద విరక్తి కలిగింది. చాకిరీ చేయడం కంటే. సూత్రాల్ని వల్లించడం, గుర్తు పెట్టుకోవడమే కష్టమనిపించింది. ‘ఇక ఈ భిక్షు జీవితం వద్దు, పాతజీవితమే మేలు’ అనుకుని విహార బైటకు వచ్చి, చెట్టుతొర్రలో ఉన్న బట్టల్ని తీసుకున్నాడు.

వాటిని చూడగానే తన పాత జీవితం గుర్తుకొచ్చింది. అతని మనస్సు ‘అటా ఇటా?’ అని కొంతసేపు ఊగిసలాడింది. చివరికి పాతబట్టల్ని చెట్టు తొర్రలోనే ఉంచి, తిరిగి విహారంలోకి వచ్చేశాడు. అలా చాన్నాళ్లు జరిగింది. అతను క్రమేపీ చదువుకు అలవాటు పడ్డాడు. కొంచెం కొంచెం జ్ఞానోదయం కలిగే కొద్దీ విహారం బయటి చెట్టు దగ్గరకు వెళ్లడం తగ్గించేశాడు. కొంతకాలానికి ఇక ఆ చెట్టు దగ్గరకు వెళ్లడమే మానుకున్నాడు.

అప్పుడు తోటి భిక్షువులు ‘‘సంగలా! నీ చెట్టు దగ్గరవకు పోవడం ఎందుకు మానుకున్నావు?అక్కడ ఏమి ఉంది? ఏమి దాచావు?’’ అని అడిగారు.‘మిత్రులారా! అక్కడ ఏమీ దాచలేదు. అక్కడ నా గురువుగారు ఉన్నారు. ఆయన అవసరం ఉన్నంత వరకు అక్కడికి వెళ్లి వచ్చాను. అంతే’’ అని చెప్పాడు.

ఈ విషయం తెలుసుకున్న బుద్ధుడు, ఒకసారి భిక్షువులతో ‘‘అవును భిక్షులారా! నిన్ను నీవే ప్రేరణ పరచుకోవాలి. నీకు నీవే ప్రేరణ కావాలి. నిన్ను నీవే పరీక్షించుకోవాలి. నీకు నీవే ప్రేరణ కావాలి. నిన్ను నీవే పరీక్షించుకోవాలి. నిన్ను నీవే రక్షించుకోవాలి. నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. నిన్ను నీతోనే పరిశోధించుకోవాలి. అలా చేసుకోగలవారికి దుఃఖం దూరం అవుతుంది. పరిపూర్ణ శాంతి దొరుకుతుంది. మన సంగలుడు అలాంటి పరిపూర్ణుడే:’అని చెప్పాడు  అనంతరం సంగలుడు గొప్ప భిక్షువుగా పేరుపొందాడు.
 - బొర్రా గోవర్ధన్
 

మరిన్ని వార్తలు