రుణం ఎలా తీర్చాలో తెలియటం లేదు..

22 Jan, 2019 06:15 IST|Sakshi
వీరేష్‌ భార్యా పిల్లలు, మృతుడు ఉప్పర వీరేష్‌

నివాళి

వ్యవసాయాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న యువ రైతు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నా అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండల కేంద్రానికి చెందిన ఉప్పర వీరేష్‌ ఆత్మహత్య చేసుకొని 11 నెలల క్రితం చనిపోయినా అతని కుటుంబానికి ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. దీంతో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. 2018 ఫిబ్రవరి 2న ఉప్పర వీరేష్‌ (35) అప్పుల బాధ తాళలేక పొలంలోనే పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పేరున 4.71 ఎకరాల భూమి ఉంది. సిండికేట్‌ బ్యాంకులో రూ.5 లక్షలు రుణం తీసుకొని పప్పుశనగ సాగు చేశాడు. పైరు ఎదుగుదల సమయంలో వర్షాలు లేక ఎండిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పు తీర్చాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి తెచ్చారు.

దిక్కు తెలియని పరిస్థితుల్లో ఆత్మస్థయిర్యం కోల్పోయి పురుగుల మందు తాగి తనువు చాలించాడు. మృతుడికి భార్య విజయలక్ష్మి, కూతురు శ్రావణి (3వ తరగతి), తేజశ్వణి(2వ తరగతి) వంశీకృష్ణ (నర్సరీ) ఉన్నారు. పిల్లలను పోషించుకోవడానికి విజయలక్ష్మి ఇక్కట్లు పడుతున్నారు. ‘రుణాలు తీర్చలేక, పిల్లలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. రాత్రి పూట పిల్లలు నాయన ఎప్పుడు వస్తాడని అడుగుతుంటే ఎమి చెప్పాలో, ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. మాకు పెద్దగా ఆస్తులు లేవు. ఉన్నది తాకట్టు పెట్టినా లేదా విక్రయించినా రూ.5 లక్షల బ్యాంకు రుణం తీరేటట్లు లేదు. రుణాలను ఎలా తీర్చాలో తెలియడంలేదు. ఆర్‌డీఓ వచ్చి విచారణ చేసి వెళ్లారు, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. మా కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్న ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి..’ అని విజయలక్ష్మి గుడ్లనీరు కుక్కుకుంటున్నారు.  

– పి. గోపాల్, సాక్షి, పత్తికొండ, కర్నూలు జిల్లా
 

మరిన్ని వార్తలు