ఒక్క సంతకం

9 Mar, 2019 00:36 IST|Sakshi

చేయలేరా?!

అత్యాచారానికి బలైన ఆడబిడ్డల పరిహారంలో జాప్యం జరగడం అంటే అది మళ్లీ ఇంకో అత్యాచారం జరిగినంత దారుణం! ప్రతిదీ హక్కుల కార్యకర్తలే చూసుకోలేరు. అత్యాచార బాధితులకు తక్షణం పరిహారం అందించేందుకు ఫైళ్లను త్వరత్వరగా క్లియర్‌ చేయడం కోసం ప్రభుత్వ అధికారులు కూడా హక్కుల కార్యకర్తల్లా వ్యవహరించాలి. అది వారి వృత్తిధర్మం మాత్రమే కాదు. నైతిక బాధ్యత కూడా. సంతకం చేతిలో పనే కదా. 


నాలుగేళ్ల క్రితం రజియా వయసు 13 ఏళ్లు. మానసికంగా ‘భిన్నమైన’ అమ్మాయి. ఉండడం ఉత్తరాఖండ్‌లోని ఒక కుగ్రామంలో. ‘నాలుగేళ్ల క్రితం’ అంటూ విషయాన్ని మొదలు పెట్టడానికి కారణం ఉంది. 2014లో రజియాపై అత్యాచారం జరిగింది. ఆమె తమ్ముడికి పాఠాలు చెప్పేందుకు ఇంటికి వచ్చే 17 ఏళ్ల యువకుడు ఆ దుశ్చర్యకు ఒడిగట్టాడు. రజియాకు మాటలు కూడా సరిగా రావు. ఆమె తల్లిదండ్రులకు మాటలు వచ్చుగానీ, న్యాయం కోసం పోరాడ్డం రాదు. వారి తరఫున ‘లతిక రాయ్‌ ఫౌండేషన్‌’.. కోర్టులో కేసువేసింది. బాలికలు, మహిళల సంక్షేమంగా కృషి చేస్తుండే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ.. లతిక రాయ్‌ ఫౌండేషన్‌. సంస్థ ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో ఉంది. రెండేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు రజియాపై అత్యాచారం చేసిన యువకుడిని జైలు పంపించింది.

రజియాకు రెండు లక్షల రూపాయలను నష్టపరిహారంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది జరిగింది 2016లో. అయితే యువకుడి జైలు శిక్ష వెంటనే అమలైంది కానీ, బాధితురాలికి మరో రెండేళ్ల వరకు నష్టపరిహారం అందలేదు! లతిక తర్వాతి పోరాటం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మొదలైంది. రజియా కేవలం అత్యాచార బాధితురాలు మాత్రమే కాదు. అత్యాచారానికి గురైన మానసిక వికలాంగురాలు కూడా. అయితే పరిహారాన్ని తక్షణం రాబట్టడం కోసం ‘వైకల్యం’ అనే కారణాన్ని అధికారులకు చూపలేదు లతిక. కోర్టులు న్యాయం చేసినప్పటికీ, అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల రజియా లాంటి ఎందరో బాలికలు, మహిళలు తమకు దక్కవలసిన పరిహారాన్ని పొందలేకపోతున్నారని ఒక నివేదికను తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.

అలాగే ఒక వీడియోను రూపొందించి బాధిత బాలికలు, మహిళలు ఎలాంటి దీనావస్థలో ఉన్నారో చూపించింది. ఫలితంగా 2018 ఏప్రిల్‌లో రజియాకు పరిహారం లభించింది. అమె ఒక్కరికే కాదు, మరో 22 మంది లైంగికహింస బాధితులకు పరిహారం అందజేసే ఫైళ్లు త్వరత్వరగా కదిలాయి. ఒకవిధంగా వీళ్లంతా అదృష్టవంతులు అనుకోవాలి. హక్కుల సంస్థ కల్పించుకోబట్టి పని జరిగింది. మరి అలాంటి సంస్థల దృష్టికి రానివారి మాట ఏమిటి? ‘‘అధికారులే హక్కుల సంస్థ కార్యకర్తలుగా పనిచేయాలి’’ అని లతికఫౌండేషన్‌ ఆకాంక్షిస్తోంది. పరిహారం వచ్చినందువల్ల కోల్పోయింది తిరిగి రాదు. కానీ గౌరవప్రదమైన జీవితానికి ఆ మాత్రపు ఆర్థిక సహాయమైనా ఉపయోగపడుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా లతిక కోఆర్డినేటర్‌ ఒకరు రజియా తరఫున జరిగిన ఈ న్యాయపోరాటం గురించి వెల్లడించారు. అయితే బాధితురాలి అసలు పేరును బయటపెట్టలేదు. రజియా అన్నది మారుపేరు. 

మరిన్ని వార్తలు