చిన్నారి నవల సూపర్‌హిట్టు

4 Oct, 2015 08:13 IST|Sakshi
చిన్నారి నవల సూపర్‌హిట్టు

పట్టుమని పదేళ్ల వయసైనా లేని పిల్లలు ఆవు వ్యాసం రాయడానికే ఆపసోపాలు పడుతుంటారు. అలాంటిది ఇంగ్లాండ్‌లో తొమ్మిదేళ్ల చిన్నారి ఏకంగా ఒక నవల రాసి పారేసింది. అయితే, పదమూడేళ్ల వయసులో ఆమె రచనా వ్యాసంగాన్ని మానేసింది. చిరుత కూకటి నాడు 1890లో రాసిన ఆ నవలను ఆమె చాలాకాలం మర్చిపోయింది కూడా. వయసొచ్చాక ఆమెకు పెళ్లయింది.

ఇక సంసార సాగరంలో పడింది. ఆమె తల్లి 1919లో మరణించడంతో పుట్టింటికి వచ్చింది. అంత్యక్రియలన్నీ అయ్యాక చెల్లెళ్లతో కలసి ఇంట్లోని వస్తువులన్నీ చూస్తుంటే, అప్పుడెప్పుడు తన చిన్నతనంలో పెన్సిల్‌తో రాసిన నవల కనిపించింది. తిరిగి ఆ నవల చదివింది. ఒక స్నేహితురాలికి కూడా చూపించింది. నవల అద్భుతంగా ఉందంటూ స్నేహితురాలు భరోసా ఇవ్వడంతో ప్రచురణకర్తలను సంప్రదించింది.

విక్టోరియన్ కాలం నాటి కులీన వ్యవస్థను కళ్లకు కడుతూ రాసిన ఆ నవల ‘ది యంగ్ విజిటర్స్’. ఆ రచయిత్రి డైసీ ఆష్‌ఫోర్డ్. ఆ నవలకు ప్రముఖ రచయిత జె.ఎం.బ్యారీ ముందుమాట రాశాడు. మార్కెట్‌లోకి విడుదల కావడమే తడవుగా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయింది. ఆ నవలపై వచ్చిన రాయల్టీతో రచయిత్రి డైసీ ఆష్‌ఫోర్డ్ ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కొనుక్కుని, అందులోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది.

మరిన్ని వార్తలు