నిరుపేదకు వైద్య నైవేద్యం

6 Jun, 2018 00:02 IST|Sakshi
డాక్టర్‌ శ్రుతి

నిరుపేద రోగుల సేవలో  తరిస్తున్న యువ వైద్యురాలు.

‘యంగ్‌ ఇండియా వాలంటీర్స్‌ ఆర్గనైజేషన్‌’ తో బస్తీల్లోని పేదలకు సేవ.

వ్యాధికి చికిత్స చేయడం సహజంగా జరిగేదే. వ్యాధి రాకుండా ‘అవగాహన వైద్యం’ అందించాలని తపన పడేవారు మాత్రం శ్రుతి లాంటి కొందరు వైద్యులు  మాత్రమే. ‘‘వ్యాధుల బారిన పడినవారు డాక్టర్ల దగ్గరకు వస్తారు. కాని అలా రాలేని వారి దగ్గరకు, రావాలని తెలియని వారి దగ్గరకు వైద్యమే తరలివెళ్లాలి’’ అంటారు శ్రుతి. ఎంబీబీఎస్‌ పట్టా చేతికి అందగానే కోట్ల రూపాయల సంపాదనకు దాన్నొక మార్గంగా భావించడం సహజమైన ఈ రోజుల్లో... వైద్య విద్య అభ్యసించడానికి మాత్రమే కాదు, ఇప్పటికీ తన సొంత డబ్బునే వెచ్చిస్తూ... నిరుపేద రోగులకు ఆసరాగా నిలుస్తున్నారు యువ వైద్యురాలు. చిన్నతనంలో తానెదుర్కొన్న చేదు అనుభవాలే ప్రేరణగా... పల్లెలు, పేదల సేవ దిశగా మార్గ దర్శకత్వం చేస్తూ, నవతరం వైద్యులలో నిరుపేద రోగుల సేవా భావనకు కలిగిస్తూ అందిస్తున్నారు ‘యంగ్‌ ఇండియా వాలంటీర్‌ ఆర్గనైజేషన్‌’ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ కె.ఎస్‌.ఎల్‌. శ్రుతి. ఇలా ఎంతోమంది వైద్యులకు సామాజిక స్పృహను కలిగిస్తున్న శ్రుతికి స్ఫూర్తిని ఇచ్చిన వారెవరన్న విషయమై ‘సాక్షి’ ఆమెతో సంభాషించారు.

ఆ రెండు సంఘటనలు!
‘‘నాకు శ్రుతి అని పేరు పెట్టిన మా పిన్ని హేమ.. కిడ్నీ ఫెయిల్యూర్‌తో  చనిపోయింది. మా తాత లక్ష్మణరావు అల్సర్‌తో చనిపోయారు. జబ్బులపై సరైన అవగాహన ఉండి, సకాలంలో వైద్యం అంది ఉంటే వారిద్దరూ జీవించేవారు. ఎవరైనా చనిపోతే వారులేని లోటు ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. చిన్నతనంలో నేను చూసిన తాత, పిన్ని మరణాలు నన్ను తీరని వేదనకు గురి చేశాయి. వైద్య వృత్తిని చేపట్టే విధంగా  నన్ను ప్రేరేపించాయి. వారి మరణం కారణంగా బాల్యంలో నేను అనుభవించిన మానసిక క్షోభ మరెవరూ అనుభవించకూడదని భావించాను. జబ్బులు, వాటి వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నాను. ఇందుకోసం వైద్య వృత్తినే  ఓ ఆయుధంగా ఎంచుకున్నా. ఆ క్రమంలోనే మేము కొందరం 2012లో యంగ్‌ ఇండియా వాలంటీర్‌ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశాం. అప్పట్లో కేవలం 21 మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారు. పాకెట్‌ మనీ కోసం ఇంటి నుంచి పంపిన డబ్బులను హెల్త్‌ క్యాంపులకు ఖర్చు చేసేవాళ్లం. తర్వాత కొంతకాలానికే మాకు మరో 300 మంది సభ్యులు జత కలిశారు. 

ఎంతో కొంత ఇచ్చేయాలని
‘ఊరు నుంచి చాలా తీసుకున్నాం. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయకపోతే లావైపోతాం..’ శ్రీమంతుడు సినిమాలో ఓ డైలాగ్‌. ఇది కేవలం డైలాగ్‌ మాత్రమే కాదు గొప్ప సందేశం కూడా. ఇదే స్ఫూర్తితో బుర్రిపాలెంను దత్తత తీసుకున్నాం. ఇల్లిల్లూ తిరిగి అక్కడ 2,500 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించాం. చికిత్సలు చేసి జబ్బుల బారి నుంచి విముక్తి కల్పించాం. ఇలా ఇప్పటి వరకు విజయవాడ, సమీప గ్రామాల్లో వందకుపైగా హెల్త్‌ క్యాంప్‌లు నిర్వహించి 15 వేల మందికిపైగా స్కీనింగ్‌ నిర్వహించాం. 2,000 మందికిపైగా జబ్బులు ఉన్నట్లు గుర్తించి, వారిని సమీప ఆస్పత్రులకు రిఫర్‌ చేశాం. సర్జరీలు, చికిత్సల తర్వాత కూడా రెగ్యులర్‌ చెకప్‌లు చేయిస్తున్నాం. 

చిన్నపనులే పెద్దమనసుతో..
శ్రుతి సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. సొంతూరు మచిలిపట్నమే అయినప్పటికీ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. తండ్రి శేఖర్‌ బిజినెస్‌మ్యాన్‌. తల్లి జయలలిత సాధారణ గృహిణి. టెన్త్‌ వరకు సెయింట్‌ ఫ్రాన్సిస్‌ స్కూలులో చదివి రంగారెడ్డి జిల్లా టాపర్‌గా నిలిచారు. ఆ తర్వాత బాచుపల్లిలోని చైతన్య జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తిచేసి, రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకును సాధించారు. ఆ తర్వాత ఎంసెట్‌లో ర్యాంకు రావడంతో విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలోఎంబీబీఎస్‌లో చేరారు. పలు అంశాల్లో గోల్డ్‌మెడల్స్‌ కూడా సాధించారు. ప్రస్తుతం గాంధీ మెడికల్‌ కాలేజీలో ఎంఎస్‌ జనరల్‌ సర్జన్‌ సెకండ్‌ ఇయర్‌ చేస్తున్నారు. ‘పెద్దపనులు అందరం చేయలేం కానీ చిన్న పనులు పెద్ద మనసుతో చేయగలం’ అని మదర్‌థెరిసా చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారు శృతి. పుట్టిన మచిలీపట్నానికీ, పెరిగిన హైదరాబాద్‌కూ, చదివిన విజయవాడకే కాకుండా రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో పేదలకు వైద్యపరంగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం గుర్తించిన ‘హైరిస్క్‌’ బస్తీల్లోని నిరుపేదలకు సేవలందించాలన్న సంకల్పంతో ఉన్నారు. 
 – శ్రీశైలం నోముల, ‘సాక్షి’ ప్రతినిధి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు