నీ శరీరమే రథం

13 Mar, 2016 00:20 IST|Sakshi
నీ శరీరమే రథం

నచికేతోపాఖ్యానం

ఆత్మజ్ఞానాన్ని పొందటం ఎలాగో యముడు నచికేతునికి చెబుతున్నాడు. మనస్సును ఎలా నడిపించాలో వివరిస్తున్నాడు. నచికేతుని దృఢదీక్షను మెచ్చుకుంటున్నాడు.
‘‘నాయనా! తమ పుణ్యకర్మఫలాన్ని ఆస్వాదిస్తూ, పరమాత్మకు నిలయమైన హృదయకుహరంలోని బుద్ధిని పొందగలిగిన వారు ఇద్దరు ఉన్నారు. బ్రహ్మవేత్తలు వారిని వెలుగునీడలు అంటారు. పంచయజ్ఞాలను మూడు నచికేతాగ్నులతో చేసిన గృహస్థులే వారు. గృహస్థాశ్రమం అంత గొప్పది. సంసార సాగరాన్ని దాటటానికి వ ంతెనగా ఉండే పరబ్రహ్మస్వరూపం అగ్ని. ఆ అగ్నికి నీ పేరు పెట్టాను. నాచికేతాగ్నిని గురించి అందరూ తెలుసుకోవాలి. చెబుతాను విను.

 నీ శరీరమే రథం. ఆత్మ రథికుడు. బుద్ధి సారథి. మనస్సు ఆ సారథి చేతిలో ఉండే కళ్లెం. ఆ రథానికి గుర్రాలు ఇంద్రియాలు. విషయాలు, కోరికలే దారులు. శరీరం, ఇంద్రియాలు, మనస్సుతో కూడిన ఆత్మనే జ్ఞానులు ‘భోక్త’ అని పిలుస్తున్నారు. అంటే ఆత్మ ఉనికికి ఈ మూడూ కారణమన్నమాట. అదుపులోలేని మనస్సుతో ఆత్మజ్ఞానం లేకుండా తిరిగేవాడి ఇంద్రియాలు సారథి అధీనంలో లేని అశ్వాల్లాగా విచ్చలవిడిగా యథేచ్ఛగా పరుగెత్తుతాయి. ఎవడు విజ్ఞానవంతుడై మనస్సును స్వాధీన పరచుకుంటాడో అతడి ఇంద్రియాలు సారథి అదుపులో ఉన్న గుర్రాల్లాగా సరైన దారిలో ప్రయాణిస్తాయి.

 మనస్సును అదుపులో పెట్టుకోకుండా, విజ్ఞానం లేకుండా శారీరకంగా మానసికంగా అశుభ్రంగా ఉండేవాడు సంసారాన్ని దాటలేడు. పరమపదాన్ని పొందలేడు. చావుపుట్టుకల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఎవడు విజ్ఞానవంతుడై, మనస్సును అధీనంలో ఉంచుకుంటాడో శుచిగా ఉంటాడో వాడు మాత్రమే మళ్లీ జన్మించనవసరం లేని పరమపదాన్ని చేరుకుంటాడు. ఎవ డు విజ్ఞానాన్ని సారథిగా, మనస్సును కళ్లెంగా చేసుకుంటాడో ఆ మానవుడు సర్వవ్యాప్తమైన పరమపదానికి చేరుకుంటాడు.

 ఇంద్రియాల కంటే విషయాలు, విషయాలకంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధికంటే ఆత్మ బలమైనవి. ఆత్మ కంటె అవతల ఉండేది అవ్యక్తం. అవ్యక్తానికి పైన ఉండేది పరమ పురుష స్థితి. దానికి మించినది ఏదీ లేదు. అదే మానవుడు చేరుకోవలసిన అత్యున్నత స్థితి.దానికి మించినది ఏదీ లేదు. అదే మానవుడు చేరుకోవలసిన అత్యున్నత స్థితి. ఆత్మవిద్యతో తెలియనిది ఈ లోకంలో ఏదీ లేదు.

 నచికేతా! అన్ని ప్రాణుల్లోనూ ఆత్మ గూఢంగా కనపడకుండా ఉంటుంది. సూక్ష్మమూ, ఏకాగ్రమూ అయిన బుద్ధితో తపస్సుతో సాధన చేసేవారికి మాత్రమే అది గోచరిస్తుంది.

 సాధకుడైన మానవుడు జ్ఞానవంతుడై తన వాక్కును మనస్సులో, మనస్సును బుద్ధిలో, బుద్ధిని ఆత్మలో, ఆత్మను పరమశాంతమైన పరమాత్మలో లీనం చేసుకోవడం అభ్యాసం చెయ్యాలి.

 నాయనా! ఆత్మకు శబ్దం (చెవి), స్పర్శ (చర్మం) రూపం (కన్ను), రసం (నాలుక) గంధం (ముక్కు) అనేవి ఉండవు. ఆత్మకు ఆది, అంతమూ ఉండదు. ఆత్మకన్నా గొప్పదీ, ఉన్నతమైనదీ, శాశ్వతమైనదీ లేదు. ఆత్మను సాక్షాత్కరింప చేసుకున్న వాడు మృత్యుముఖం నుండి బయటపడతాడు.

 నేను చెబుతున్న సనాతనమైన ఈ ఆత్మవిద్యకు నాచికేతోపాఖ్యానమని పేరుపెడుతున్నాను. దీనిని ఇతరులకు చెప్పినవారు, విన్నవారూ మేధావులై శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతారు. అతి రహస్యమైన ఈ బ్రహ్మవిద్యను విద్వత్ సభలలో, పితృదేవతల శ్రాద్ధకర్మలలో వినిపించేవారికి అనంతమైన పుణ్యం లభిస్తుంది.

 స్వయంభువు అయిన పరమాత్మ ప్రాణుల ఇంద్రియాలను దోషభూయిష్టంగా సృష్టించాడు. వాటికి బయట విషయాలపై ఉన్న ఆసక్తి అంతరాత్మపై ఉండదు. ధీరుడైనవాడు మాత్రమే తన దృష్టిని లోపలికి సారించి ఎంతో ప్రయత్నంతో అంతరాత్మను దర్శించి అమృతత్వాన్ని పొందగలుగుతాడు. అజ్ఞానులు పసిపిల్లల్లాగా బాహ్యసుఖాలను కోరుకుంటారు. దానితో మృత్యుపాశానికి చిక్కుకుంటారు. జ్ఞానులు అనిత్యమైన లౌకిక సుఖాల మోసాన్ని తెలుసుకొని శాశ్వతమైన ఆత్మతత్వాన్ని కోరుకుంటారు. మృత్యువునుండి తప్పించుకొని అమృతత్వాన్ని పొందుతారు.

 నచికేతా! రంగు, రుచి, వాసన, శబ్దం, స్పర్శ అనే పంచేంద్రియ విషయాలను ఆత్మజ్ఞానంతో చూడగలిగినవాడు అన్నిటినీ తెలుసుకోగలుగుతాడు. ఆత్మవిద్యతో తెలియనిది ఈ లోకంలో ఏదీ లేదు. దానినే నువ్వు తె లుసుకోవాలనుకుంటున్నావు. నిద్రలో, మెలకువలో ఎప్పుడైనా దేనినైనా ఆత్మతో దర్శించగలిగినవాడికి దుఃఖం కలగదు. ఇంద్రియజన్యమైన జ్ఞానం దుఃఖ కారణం. జీవిత మాధుర్యానికీ, భూతభవిష్యాలకు ఆత్మయే అధిపతి అని తెలుసుకున్నవాడికి భయమూ, అసహ్యమూ ఉండవు. ఇదే ఆత్మతత్వం.

 మానవులారా! మేలుకోండి. నిద్రమత్తు వదిలించుకోండి. పొందవలసిన గొప్ప స్థితిని తెలుసుకోండి. పదునైన కత్తి అంచు మీద నడిచే దారి ఇది. ఈ దారిలో నడవడం చాలా కష్టం. అశ్రద్ధ, నిర్లక్ష్యం, అజ్ఞానాలను వదిలించుకున్నవారే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారని పెద్దలు చెబుతున్నారు  - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

మరిన్ని వార్తలు