మీ గుండెచప్పుడే... పాస్‌వర్డ్!

7 Sep, 2013 01:23 IST|Sakshi
మీ గుండెచప్పుడే... పాస్‌వర్డ్!

మొబైల్ ఫోన్లు, పీసీలు, ట్యాబ్లెట్లు... కారు, ఇంటి తలుపులను సైతం ఇకపై మీ గుండె చప్పుడుతోనే ఓపెన్ చేసేయొచ్చు. ఇందుకు కావలసిందల్లా జస్ట్ మీ చేతికి ఓ రిస్ట్‌బ్యాండ్‌ను కట్టుకోవడమే. అవును.. గుండెచప్పుడును బట్టి మనుషుల్ని గుర్తించే సరికొత్త రిస్ట్‌బ్యాండ్‌ను టొరంటోలోని ‘బయోనిమ్స్’ కంపెనీ పరిశోధకులు తయారుచేశారు. ‘నైమీ’ అనే ఈ రిస్ట్‌బ్యాండ్‌పై ఉండే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) సెన్సర్లపై కొన్ని సెకన్లపాటు చేతితో తాకితే చాలు.

ముందుగానే రికార్డు అయిన మీ గుండెచప్పుడుతో పోల్చి చూసుకుని ఇది బ్లూటూత్ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తుంది. వేలిముద్రలు, కనుపాపలే కాదు... గుండె కొట్టుకునే విధానంలో కూడా మనిషికి మనిషికీ మధ్య తేడాలుంటాయట. దీన్నిబట్టే ఈ రిస్ట్‌బ్యాండ్ అసలు మనిషిని గుర్తిస్తుందట. ఇప్పుడున్న బయోమెట్రిక్ పద్ధతుల కన్నా ఇది మరింత భద్రమైనదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 

మరిన్ని వార్తలు