90 ఏళ్ల బామ్మ.. 39 ఏళ్లుగా వీడియో గేమ్స్‌ 

23 May, 2020 06:38 IST|Sakshi
హమాకో మోరీ

ఏదైనా విషయం పట్ల అభిరుచి ఉన్నా ఈ వయసులో మనకెందుకులే అని వదిలేస్తారు చాలామంది. ఫోన్‌ ఆపరేటింగ్‌ కూడా కష్టమయ్యే వయసులో ఓ బామ్మ ఏకంగా యూట్యూబ్‌ గేమర్‌గా గిన్నిస్‌ రికార్డ్‌లో చోటు సంపాదించుకుంది. ఈ బామ్మ వయసు 90 ఏళ్లు. యూట్యూబ్‌లో కుర్రకారును ఆకర్షించే గేమ్స్‌ని ఈ బామ్మ టకటకా ఆడేస్తుంది. ఎన్నాళ్లుగానో తెలుసా! దాదాపు 39 ఏళ్లుగా. ప్రపంచంలోనే ఇన్నేళ్లుగా గేమింగ్‌ చేసేవారు ఎవరూ లేరట. ఇంత విశేష ప్రాచుర్యం పొందిన ఈ బామ్మ పేరు హమాకో మోరీ. జపాన్‌వాసి. అందరూ ఆప్యాయంగా ‘గేమర్‌ గ్రాండ్‌’ అని పిలుస్తారు.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సర్టిఫికెట్‌తో

2015లో యూ ట్యూబ్‌ ఛానెల్‌లోనూ ఎంటరయ్యింది. ఇప్పుడు తన గేమింగ్‌ ఛానెల్‌లో 2,70,000 మంది చందాదారులు ఉన్నారు. ప్రతి నెలా తన ఛానెల్‌లో నాలుగైదు వీడియోలను అప్‌లోడ్‌ చేసే ఈ గేమింగ్‌ బామ్మ వీడియోలను చూసేవారి సంఖ్యా పెరుగుతోంది. కాల్‌ ఆఫ్‌ డ్యూటీ, డూన్స్, ఎన్‌ఐఇఆర్‌ ఆటోమాట తో సహా అనేక ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతోంది. ఇది మాత్రమే కాదు ఈ బామ్మ జీటీయే వి ఎక్కువ ఆడటానికి ఇష్టపడుతుంది. మోరీని గేమింగ్‌ గురించి పలకరిస్తే ‘మొదట్లో ఇది చాలా సరదాగా అనిపించింది.

కానీ ఇది నా వయసుకు సరైంది కాదులే అనుకున్నాను. కొన్నాళ్లు వదిలేశాను. మొదట్లో ప్లే స్టేషన్‌లో ఆడేదాన్ని. మోడర్న్‌ గేమ్స్‌లోకి రావడానికి కొంతసమయం పట్టింది. వచ్చాక అంతే... నా ముందు ఎవరూ నిలవలేనంతగా గేమింగ్‌ చేస్తూనే ఉన్నాను. రోజూ 7–8 గంటల పాటు ఆడుతాను. ఈ మధ్య వచ్చే యాక్షన్‌ గేమ్స్‌ చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు నా ఫేవరేట్‌ గేమ్‌ గ్రాండ్‌ థెప్ట్‌ ఆటో 5’ అని గడగడా చెప్పేస్తుంది మోరీ. ‘ఇది కూడా సినిమా చూడటం లాంటిదే. పిల్లలకున్నట్టు నాకు గేమింగ్‌లో ఏజ్‌ లిమిట్స్‌ లేవు. ఎవ్వరూ అడ్డు చెప్పరు’ అని సంబరంగా చెబుతుంది ఈ గేమింగ్‌ బామ్మ.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా