ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

12 Mar, 2017 23:30 IST|Sakshi
ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

సడన్‌గా గదిలోకి వచ్చేశారు
చిల్డ్రన్‌ ఇంటరప్ట్‌ బిబిసి ఇంటర్వ్యూ
నిడివి : 43 సె.  ::: హిట్స్‌ : 99,01,708

ఈయన పేరు రాబర్ట్‌ కెల్లీ. దక్షిణకొరియాలోని పుసాన్‌ నేషనల్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. కొరియా రాజకీయాలపై ఇంటర్వ్యూ చెయ్యడానికి బిబిసి ఆయన ఇంటికి వెళ్లి స్టూడియోకి ఆయన్ని కనెక్ట్‌ చేసింది. లైవ్‌ ఇంటర్వూ్య అది. అవినీతి ఆరోపణలపై ఆ దేశ అధ్యక్షురాలు దిగిపోవలసి వచ్చింది. దానిపై ప్రశ్నలు అడుగుతుంటే కెల్లీ సమాధానాలు చెబుతున్నారు. ఇంటర్వూ్య మధ్యలో సడన్‌గా ఆయన పిల్లలు హాల్లోంచి, ఈయన కూర్చొన్న గదిలోకి వచ్చేశారు. మొదట పెద్ద పిల్లాడు తలుపు తోసుకుని వచ్చాడు. డాన్స్‌ చేసుకుంటూ వచ్చి తండ్రి దగ్గర నిలబడ్డాడు. దానిని స్టూడియోలోని టీవీలో గమనించి మేనేజ్‌ చెయ్యబోయారు ప్రొఫెసర్‌. వీలు కాలేదు. తర్వాత రెండో పిల్లాడు బేబీ వాకర్‌లో రయ్యిన లోనికి జారుకుంటూ వచ్చాడు!

అది గమనించిన తల్లి పరుగున అక్కడికి  వచ్చి పిల్లల్ని లోపలికి ఈడ్చుకెళ్లింది. పిల్లలకు అరుపులకు డిస్ట్రర్బ్‌ అయిన ప్రొఫెసర్‌ కెల్లి, వెంటనే సర్దుకుని ఇంటర్వ్యూ   కొనసాగించారు. ఇదంతా రికార్డ్‌ అయింది. ఈ సరదా దృశ్యాలను బిబిసి యూట్యూబ్‌కు అందించింది. దీనిపై యూట్యూబ్‌లో కొన్ని కామెంట్‌లు కూడా వచ్చాయి. ‘జీసస్‌... ఆ తల్లి ఎంత అమానుషంగా పిల్లల్ని లాక్కెళ్లింది! ఓమాహా బీచ్‌లో గాయపడిన సైనికుడిని ఆర్మీ డాక్టర్‌ ఈడ్చుకెళ్లినంత వేగంగా తీసుకెళ్లింది’ అని మేరీ మీస్‌ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరికొందరైతే ప్రొఫెసర్‌ కెల్లీ తన విజ్ఞాన్నానంతా కనబరుచుకోడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో పుస్తకాల షెల్ప్‌ ఉండేలా జాగ్రత్తపడ్డారు’ అని కామెంట్‌ చేశారు. ఏమైనా పిల్లల కారణంగా ఇప్పుడీ ప్రొఫెసర్‌ ఫేమస్‌ అయిపోయారు!

నిన్ననే రిలీజైనా... ఇప్పుడప్పుడే చూడలేం
ఆటమిక్‌ బ్లాండ్‌ : ట్రైలర్‌
నిడివి : 3 ని. 2 సె. హిట్స్‌ : 14,64,723

సౌత్‌ బై సౌత్‌వెఫ్ట్‌ చిత్రోత్సవంలో నిన్ననే విడుదలైన ఈ ‘ఆటమిక్‌ బ్లాండ్‌’ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ హాలీవుడ్‌ మూవీ ఈ ఏడాది జూలై 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది.  2012 నాటి ఆంటోనీ జాన్‌స్టన్‌ గ్రాఫిక్‌ నవల ‘ది కోల్డెస్ట్‌ సిటీ’ ఆధారంగా డేవిడ్‌ లీచ్‌ ‘ఆటమిక్‌ బ్లాండ్‌’ను డైరెక్ట్‌ చేశారు. 1989లో జర్మనీలోని బెర్లిన్‌ గోడను జర్మనీ ప్రజలు కూల్చివేయడంతో అమెరికా, రష్యాల మధ్య ఆధిక్యపోరులో కూటముల మధ్య బలాలు అటూఇటు అవుతాయి. ఆ పరిమాణాల నుంచి ప్రపంచ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు లోరిన్‌ బ్రాటన్‌ అనే ఏజెంటు (సినిమాలో చార్లైజ్‌ థెరాన్‌) బ్రిటన్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ ఎం16 నుంచి రహస్యంగా బెర్లిన్‌ వస్తుంది.

బెర్లిన్‌లో అత్యంత ప్రమాదకరమైన గూఢచర్యాన్ని అణచివేసే విధిలో భాగంగా ప్రత్యేక ఆదేశాలపై ఆమె అక్కడికి చేరుకుంటుంది. అక్కడ బెర్లిన్‌ స్టేషన్‌ చీఫ్‌ డేవిడ్‌ పెర్సివల్‌ (సినిమాలో జేమ్స్‌ మెక్‌ఎవాయ్‌) ఆమెకు సహాయం చేస్తుంటాడు. చివరికి ఈ అగ్గిలాంటి పిల్ల మిషన్‌ని పూర్తి చేస్తుంది. ట్రెయిలర్‌ రెండు రోజుల క్రితమే విడుదలైంది. ఈ ‘రిస్ట్రెక్టెడ్‌ ట్రైలర్‌’లో కొంత క్రైమ్‌ ఉండనయితే ఉంది కానీ, మరీ అంత అపరిమితంగా ఏమీ లేదు.

మరిన్ని వార్తలు