ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

30 Apr, 2017 23:06 IST|Sakshi
ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

దుష్టశక్తులను అంతమొందించే అంతిమ యుద్ధం
కింగ్స్‌మాన్‌ : ది గోల్డెన్‌ సర్కిల్‌ : నిడివి : 1 ని. 57 సె.   ::: హిట్స్‌ : 1,34,27,916


బ్రిటిష్‌–అమెరికన్‌ యాక్షన్‌ స్పై చిత్రం ‘కింగ్స్‌మన్‌: ది గోల్డెన్‌ సర్కిల్‌’ ట్రైలర్‌ ఈవారం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ముందుంది! 2014 చివర్లో విడుదలైన ‘కింగ్స్‌మన్‌ : ది సీక్రెట్‌ సర్వీస్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. దాన్ని డైరెక్ట్‌ చేసిన మేథ్యూ (వాన్‌)నే దీనినీ డైరెక్ట్‌ చేస్తున్నారు. అయితే మొదటిది కొంచెం కామెడీ మిక్స్‌ అయిన యాక్షన్‌. ఇది ఓన్లీ యాక్షన్‌. మొదటి చిత్రంలో ‘కింగ్స్‌మన్‌’ అనేది సర్వ స్వతంత్రమైన, ఒక అంతర్జాతీయ ఇంటెలిజెన్స్‌ ఏజన్సీ. అన్నీ హైలెవల్‌ సీక్రెట్‌ ఆపరేషన్స్‌ చేస్తుంటుంది. కింగ్స్‌మన్‌ అంతిమ లక్ష్యం ఒకటే. ప్రపంచాన్ని దుష్టశక్తుల నుంచి సేఫ్‌గా ఉంచడం! ఇక ఇప్పుడు రాబోతున్న చిత్రంలోని కింగ్స్‌మన్‌ సీక్రెట్‌ ఏజెన్సీ హీరోలు (ఒక హీరోయిన్‌ కూడా ఉంది) కొంచెం దూకుడుగా ఉంటారు. అయితే వీళ్లుంటున్న ప్రధాన కార్యాలయాన్ని శత్రువులు పేల్చేసి, ప్రపంచాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటారు. వారి కబంధహస్తాల్లోంచి మానవాళికి విముక్తి కల్పించే  క్రమంలో కింగ్స్‌మన్‌ టీమ్‌ వేరొక ఇంటెలిజెన్స్‌ సంస్థతో చేతులు కలుపుతుంది. దాని పేరు ‘స్టేట్స్‌మన్‌’. రెండు టీమ్‌లూ కలిసి ప్రత్యర్థిని మట్టుపెడతాయి.

మతిపోగొట్టే పోరాట సన్నివేశాలతో ఈ చిత్రం సెప్టెంబర్‌ 22న విడుదల అవుతోంది. మొదట జూన్‌ 16న రిలీజ్‌ చెయ్యాలని ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న ‘ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌’ సంస్థ అనుకుంది కానీ, ఏవో అదనపు సీన్లు జోడించవలసి రావడంతో యు.కె.లో 29 సెప్టెంబరుకు, యూఎస్‌లో 6 అక్టోబరుకు వాయిదా వేసింది. ఆ తర్వాత రెండు దేశాలకూ కలిపి కొత్త డేట్‌ను ప్రకటించింది. మన దగ్గర కూడా సెప్టెంబరు 22కే విడుదల చేస్తోంది.

నా చుట్టూ తిరుగుతావు... దగ్గరకొస్తే పారిపోతావు!
చార్లీ పూఫ్‌ : అటెన్షన్‌ : నిడివి : 3 ని. 51 సె.  ::: హిట్స్‌ : 1,53,61,666

అగ్ని పరీక్షలా ఈ వీడియోలోనిది ప్రేమ పరీక్ష! నిజమైన ప్రేమా లేక అబద్ధమైన ప్రేమా అని... ప్రేమకు అగ్నిపరీక్ష పెడతాడు ఇందులోని పాటగాడు చార్లీ పూఫ్‌. పాతికేళ్ల ఈ అమెరికన్‌ సింగర్, సాంగ్‌ రైటర్‌. ‘అటెన్షన్‌’ అనే పేరుతో రిలీజ్‌ చేసిన ఈ సింగిల్‌ ట్రాక్‌... మైల్డ్‌గా సాగుతుంది. పాట చివరి దాకా హీరో ఓ క్లబ్‌ బయట తన ప్రియురాలి మెంటాలిటీని అంచనా వేస్తూ నిలబడతాడు. ఎంతకీ ఆమె అతడికి అర్థం కాదు. చివరికి క్లియర్‌ అవుతుంది. ఆ అమ్మాయి తన నుంచి అటెన్షన్‌ కోరుకుంటోందే తప్ప, తనను ప్రేమించడం లేదని! ఈ వీడియోను చూస్తే ఇంకో అనుమానం కూడా వస్తుంది.

19 ఏళ్ల అమెరికన్‌ నటి, గాయని బెల్లా థార్న్‌ను మనసులో పెట్టుకుని పూఫ్‌ ఈ వీడియోను చిత్రీకరించాడా అని! పాట ప్రారంభ చరణం ఇలా ఉంటుంది. ‘లాస్‌ ఏంజిల్స్‌లో జరిగే ప్రతి పార్టీలోనూ నువ్వు నా చుట్టూ తిరుగుతావు, దగ్గరికి వచ్చేటప్పటికి పారిపోతావు... నీది నిజమైన ప్రేమేనా’ అనే అర్థం అందులో కనిపిస్తుంది. ‘నీకు తెలుసు, నాకు తెలుసు. నీకు తెలుసని నాకు తెలుసు, నాకు తెలుసని నీకు తెలుసు... మన మధ్య ఏం జరుగుతోందో’ అని కూడా అంటాడు. ఈ మధ్యే చార్లీ పూఫ్‌.. బహిరంగంగా బెల్లా థార్న్‌ను తిట్టిపోశాడు. ‘నువ్వింకా వాడితోనే తిరుగుతున్నావ్‌’ అని అనుమానించాడు కూడా.

ఆ ‘వాడు’ అనే కుర్రాడు టేలర్‌ పోసే. అమెరికన్‌ నటుడు. వాళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందని పూఫ్‌కి కోపం. నిజానికి బెల్లా థార్న్‌ ఎలాంటి అమ్మాౖయెనా ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ తెలిస్తే అయ్యో అనిపిస్తుంది. బెల్లాకు ఒకటో తరగతి నుంచే డిస్లెక్సియా ఉంది. రీడింగ్‌ డిజార్డర్‌ అది. ఆమె సరిగా చదవలేదు. రాయలేదు కూడా. స్కూల్లో అంతా ఆటపట్టించేవారు. చదువు మాన్పించి హోమ్‌ ట్యూషన్‌ పెట్టించారు. దాంతో అమె ఎదుగుతున్న కొద్దీ  మానసికంగా ఒంటరి అయ్యింది. ఇప్పటికీ ఎవరితోనూ కలవలేదు. అయితే పూఫ్‌ ఎలాగో తనకి దగ్గరయ్యాడు. ఇదిగో... ఇప్పుడిలా పాటలు కట్టి ఆమెను ఇన్‌డైరెక్టుగా తిడుతూ ద్వేషగీతాలను ఆలపిస్తున్నాడు. ‘నువ్వు తప్ప నా మనసులో ఎవరూ లేరు’ అని బెల్లా చెప్పినప్పటికీ అతడి ద్వేషం తగ్గుముఖం పట్టలేదని ఈ లేటెస్ట్‌ సాంగ్‌ ‘అటెన్షన్‌’ను వింటే అర్థమౌతుంది.

గ్రహాంతరయానంలో ప్రాణాంతక క్షణాలు
ఏలియన్‌ : కవనెంట్‌ ‘ ప్రోలాగ్‌: ది క్రాసింగ్‌ : నిడివి : 2 ని. 40 సె.  ::: హిట్స్‌ : 33,47,845

2093 సంవత్సరం. మానవత్వపు సృష్టికర్తల కోసం (మానవత్వం ఉన్న సృష్టికర్తలు అని కాదు. మానవత్వాన్ని సృష్టించేవాళ్లు అని) ఒక సాహసికుల సైన్స్‌ గుంపు వేరే గ్రహంలో అన్వేషణ మొదలుపెడుతుంది! వాళ్లంతా శాస్త్రవేత్తలు. ఒకానొక విధ్వంసంతో వారి అన్వేషణ ఒక కొలిక్కి వచ్చి, ఒక ప్రాణాంకమైన విశ్వాంతరాళ క్రిమి జాడలను వారు కనిపెడతారు. దాన్ని పట్టుకుని మళ్లీ తమ దుస్సాహస అన్వేషణను ప్రారంభిస్తారు. వాళ్లు ప్రయాణించే నౌక పేరే ‘కవనెంట్‌’. అంటే ఒప్పందం అని అర్థం.

వీళ్లు అక్కడి జీవులతో ఏం ఒప్పందం చేసుకున్నారు? ఏం సాధించారు అన్నది తెలుసుకోడానికి ఈ ఉపోద్ఘాత (ప్రోలాగ్‌) ట్రైలర్‌లో మీరూ సుమారు 3 నిమిషాల పాటు  ప్రయాణించవచ్చు. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ హారర్‌ హాలీవుడ్‌ చిత్రం మే 12న యు.కె.లో, మే 19న యు.ఎస్‌. తో పాటు ఇతర దేశాలలో రిలీజ్‌ కాబోతోంది. వీడియో చివర్లో ఉత్కంఠను, కొద్దిగా గగుర్పాటును కలిగించే సన్నివేశాలున్నాయి. ఏలియన్‌ (1979), బ్లేడ్‌ రన్నర్‌ (1982), థెల్మా అండ్‌ లూసీ (1991), గ్లాడియేటర్‌ (2000), బ్లాక్‌ హాక్‌ డౌన్‌ (2001), హానిబల్‌ (2001), అమెరికన్‌ గాంగ్‌స్టర్‌ (2007), ప్రొమీథియస్‌ (2012), ది మార్షన్‌ (2015) వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన రిడ్లీ స్కాట్‌... అంతే ప్రతిష్ఠాత్మకంగా ఈ ఏలియన్‌కు చిత్రీకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు