ఈ యుట్యూబ్ వారం హిట్స్

6 Nov, 2016 23:54 IST|Sakshi
ఈ యుట్యూబ్ వారం హిట్స్

వండర్ ఉమన్ : అఫిషియల్ ట్రైలర్
డయానా.. అమెజాన్‌ల యువరాణి. ఓ దీవిలో ఉంటుంది. యుద్ధవిద్యలో ఆరితేరి యోధురాలు అవుతుంది. దీవికి రక్షకురాలిగా ఉంటుంది. ఆ దీవిలో ఒక విమానం కుప్పకూలుతుంది. ప్రాణాలతో బయటపడిన ఆ విమానం పెలైట్‌కు డయానాతో పరిచయం అవుతుంది. త్వరలో ప్రపంచ యుద్ధం రాబోతోందని అతడు ఆమెకు చెబుతాడు. ఆ యుద్ధాన్ని నివారించేందుకు డయానా బయల్దేరుతుంది. ఆ ప్రయత్నంలో ఈ వండర్ ఉమన్‌కు డాక్టర్ పాయిజన్ అనే శత్రువు తారసపడతాడు. అతడితో తలపడుతుంది. ఈ కథ అంతటికీ  దృశ్యరూపమే వండర్ ఉమన్ తాజా ట్రైలర్.

డిసి కామిక్స్ క్యారెక్టర్ ఆధారంగా అదే పేరుతో వస్తున్న ఈ హాలీవుడ్ సూపర్‌హీరో మూవీ (‘వండర్ ఉమెన్’)  ట్రైలర్ మూడు రోజుల క్రితమే విడుదలైంది. నిమిష నిమిషానికీ హిట్స్ పెరిగిపోతున్నాయి. ప్యాటీ జెన్‌కిన్స్ డెరైక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. వచ్చే ఏడాది జూన్ 2న ఐమ్యాక్స్ త్రీడీలో మనం వండర్ ఉమన్‌ని చూడొచ్చు.
 
టి2: ట్రైన్ స్పాటింగ్ : అఫిషియల్ ట్రైలర్
నిడివి : 1 ని. 55 సె., హిట్స్ : 32,35,654

మొదట అవకాశం. తర్వాత నమ్మక ద్రోహం! పాతికేళ్లు గడిచిపోయాయి. అంతా మారిపోయింది. అసలేమీ మారకుండానూ ఉంది. మార్క్ రెంటన్ ఇంటికి చేరుకున్నాడు. ఈ భూమండలంపై తను ఇల్లు అని పిలుచుకునే ఏకైక ప్రదేశం అది. అక్కడ అతడి కోసం స్పడ్, సిక్ బాయ్, బెగ్బీ ఎదురుచూస్తూ ఉన్నారు. వారితో పాటు తక్కిన ప్రియ నేస్తాలు కూడా మార్క్ రెంటన్ కోసం నిరీక్షిస్తూ ఉన్నాయి. దుఃఖం, సంతోషం, ప్రతీకారం, ద్వేషం, ప్రేమ, భయం, పశ్చాత్తాపం, స్వీయపతనం.. ఇవన్నీ! మార్క్ జీవితం మళ్లీ ఫ్రెష్‌గా మొదలైంది. అతడు ఈ స్నేహితులు కాని స్నేహితులతో, శత్రువులు కాని శత్రువులతో కలిసి జీవించాలి. ఇదీ టి2 : ట్రైన్‌స్పాటింగ్ కథ. ఈ బ్రిటిష్ బ్లాక్ కామెడీ క్రైమ్ డ్రామా జనవరి 27న విడుదలవుతోంది. 1996లో వచ్చిన ‘ట్రైన్ స్పాటింగ్’కి ఇది సీక్వెల్. కాస్త గుండె ధైర్యం ఉన్నవాళ్లే ఈ సినిమాను  చూడగలరని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. అన్నట్టు... ట్రైలర్ చూడ్డానికి కూడా కొంచెం గుండెబలం కావాలి. ప్రాణాల్ని బాగా పైకి తీసుకెళ్లి, కిందికి వదిలేసే సన్నివేశాలు రెండుమూడు ఉన్నాయి మరి.
 
బాబా సాంగ్ : ప్రియాంక చోప్రా
నిడివి : 4 ని. 12 సె., హిట్స్ : 5,61,578

ప్రియాంక చోప్రా పాడుతున్నారు. ‘‘నాన్నా నీ మనసులోని బాధను నేనెప్పుడూ అర్థం చేసుకోలేదు. నేనెలా జీవించాలి? చెప్పు.. నేను ఎటువైపు వెళ్లాలి? నాకేమీ తెలియడం లేదు. నిన్నిలా అడుగుతోంది... నీకెంతో ప్రియమైన నీ కూతురు. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థం ఇచ్చావు. నాన్నా... దయచేసి ఆగు. నన్నొదిలి వెళ్లిపోకు’ అంటూ పాట సాగుతుంది. ‘నాన్నా ఏదైనా మాట్లాడు... ఏదో ఒకటి చెప్పు. ఏదైనా. వెళ్లిపోకు నాన్నా... వెళ్లిపోకు’ అంటూ పాట ఎండ్ అవుతుంది. తండ్రి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కూతురు పాడే పాట ఇది. ‘వెంటిలేటర్’ అనే మరాఠీ సినిమా కోసం ప్రియాంకా చోప్రా స్వయంగా ‘బాబా’ అనే ఈ పాటను ఆలపించారు. మంద్రస్థాయిలో మైక్ ముందు నిలబడి ఆమె పాడుతున్నప్పుడు మదిని ఉద్వేగపరిచే దృశ్యాలు నేపథ్యంగా కనిపించి కనుమరుగైపోతుంటాయి. గుండెలో మాత్రం అలా మిగిలిపోతాయి. సాహిత్యం మనోజ్ యాదవ్. సంగీతం రోహన్. చిత్రం రెండు రోజుల క్రితమే విడుదలైంది. సినిమాలో ప్రియాంక పాట మాత్రమే ఉంటుంది. ప్రియాంక ఉండరు. బై ది వే ఈ చిత్ర నిర్మాత ఎవరో కాదు, ప్రియాంకే!
 
 స్వీట్ గాళ్ వీడియో సాంగ్: రోచ్ కిల్లా

నిడివి : 5 ని., హిట్స్ : 15,29,557
రోచ్ కిల్లా... అవార్డు విన్నింగ్ పంజాబీ ర్యాపర్. కెనడాలో పెరిగిన ఈ పాకిస్థానీ సంతతి భారతీయుడు తాజాగా ‘స్వీట్‌గాళ్’ అనే సాంగ్‌ని రిలీజ్ చేశాడు. మ్యూజిక్ ఉల్లూ మనాటి. స్వరం బ్రౌన్ గర్ల్, రోచ్ కిల్లా. ఈ అమ్మాయి, అబ్బాయి  కలిసి ఇంగ్లిష్‌ని, పంజాబీని కలిపి కొట్టారు. ‘స్వీట్ స్వీట్ గాళ్... ఇన్ బ్యాడ్ బ్యాడ్ వరల్డ్’ అనే అర్థం వచ్చే ఈ గీతం... ‘గర్ల్ ఐ నో.. ఐ వాంట్ యు’ అని పల్లవితో స్టార్ట్ అవుతుంది. పొట్టి జాకెట్లు, అంతకన్నా కురచ నిక్కర్లు ధరించిన అమ్మాయిలు పాట పాడుతూ డాన్స్ చేస్తారు. హాఫ్ నేకెడ్ అబ్బాయిలు వారిని అనుసరిస్తూ ఉంటారు. అంతా కలిసి ఇలాతలంలో నేలపై, నీళ్లపై స్వేచ్ఛగా విహరిస్తున్నప్పుడు వీక్షించడం మనోహరంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు