ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

29 Jan, 2018 00:48 IST|Sakshi

దారి చూడు దుమ్ము చూడు మామ
నిడివి : 3 ని. 12 సె; హిట్స్‌: 25,06,100

దారి చూడు దుమ్ముచూడు మామ దున్నపోతుల బేరి చూడు కమలపూడి కట్ట మింద కన్నెపిల్లల జోరె చూడు... జానపదంలో ఎప్పుడూ ఒక కిక్‌ ఉంటుంది. కవ్వించే శృంగారం ఉంటుంది. చెణుకులు విసిరే వయ్యారం ఉంటుంది. అది నింపుకున్న పాట ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. నాని నటిస్తున్న ‘కృష్ణార్జునయుద్ధం’ సినిమాలో ఒక జానపద గీతాన్ని రికార్డ్‌ చేసి విడుదల చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన చిత్రకారుడు, గాయకుడు అయిన పెంచలదాసు రాసి పాడిన ఈ పాట సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ తమిళ సంగీతంలో మంచి ఊపు తెచ్చేలా ఉంది. ‘కురస కురస అడవిలోన పిలగ కురిసినాది గాంధారివాన’ వంటి వాక్యాలు ఈ పాటలో కొత్త సొగసును తెచ్చేలా ఉన్నాయి. కథ ప్రకారం ఇందులో నాని చిత్తూరు జిల్లాకు చెందినవాడట. అందుకని ఆ ప్రాంతపు జానపదాన్ని పెట్టారు. రెండువారాల్లో ఇరవైలక్షలకు పైగా హిట్స్‌ సాధించిన పాట ఇది.

గురుకులం– ది స్కూల్‌
నిడివి : 15 ని. 26 సె; హిట్స్‌: 1,41,730

తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ అవస్థ పడుతూనే ఉంటారు. బడి అంటే నాలుగుగోడలు ఉండే పాఠశాల కాదు ఈ విశాల ప్రపంచం కూడా బడే... దాని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది... పిల్లలు నేర్చుకుంటూనే ఉంటారు... అనే మెసేజ్‌తో తెలుగులో తయారైన షార్ట్‌ఫిలిమ్‌ ‘గురుకులమ్‌ ది స్కూల్‌’. ఇందులో నటుడు రాజీవ్‌ కనకాల ముఖ్యపాత్ర పోషించాడు. ఊరిలో చిన్న పనులు చేసుకుని బతికే రాజీవ్‌కు ఇద్దరు పిల్లలు ఉంటారు. పెద్దకొడుకు సరిగా చదవడం లేదని కంప్లయింట్స్‌ వస్తాయి. కాని ఆ పెద్దకొడుకు నిజంగా ఏ చదువు చదువుతున్నాడో తెలిసి ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఇంటర్నేషనల్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్స్‌లో నామినేషన్లు అవార్డులు పొందిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ను ‘బాహుబలి’ సినిమాకు కలరిస్ట్‌గా పని చేసిన శివకుమార్‌ దర్శకత్వం వహించాడు. పోస్టయిన మూడు నాలుగు రోజులకే సుమారు లక్ష హిట్స్‌ సాధించింది ఈ షార్ట్‌ఫిల్మ్‌.

వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌
నిడివి : 2 ని. 30 సె; హిట్స్‌: 2,05, 28,767

మన వైజాగ్‌ కుర్రాడు, అమెరికాలో స్థిరపడి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ రంగంలో పేరు గడించిన ‘చక్రి తోలేటి’ గతంలో కమలహాసన్‌ నటించిన ‘ఈనాడు’, తమిళంలో అజిత్‌ నటించిన ‘బిల్లా2’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు తాజాగా అతడి రొట్టె విరిగి నేతిలో పడింది. హిందీలో పెద్ద కాస్టింగ్‌తో ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’ సినిమాకు దర్శకత్వం వహించాడు. పంజాబీ సూపర్‌స్టార్‌ దిల్‌జిత్, సోనాక్షి సిన్హా, బొమన్‌ ఇరానీ ముఖ్యపాత్రలు ధరిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు కరణ్‌ జొహర్‌ ముఖ్యపాత్ర పోషించాడు. అంతేకాదు రానా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, రితేష్‌ దేశ్‌ముఖ్‌ వంటి వాళ్లు కూడా ప్రత్యేక పాత్రలు పోషించారు. ఒక ఈవెంట్‌ షోలో పాల్గొనేందుకు ఇండియా నుంచి న్యూయార్క్‌ బయలుదేరిన దిల్‌జిత్, సోనాక్షి అక్కడ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు అనేది కథ. ఆద్యంతం హాస్యం నిండి ఉండే ఈ సినిమా ట్రైలర్‌ పోస్టయిన వారంలోనే రెండు కోట్ల హిట్స్‌ను దాటడం విశేషం.


రంగస్థలం టీజర్‌
నిడివి : 1 ని. 3 సె; హిట్స్‌: 87,92,630

భిన్నమైన సినిమాలు తీస్తాడనే పేరు పొందిన సుకుమార్‌ తాజా సినిమా ‘రంగస్థలం’ కూడా భిన్నమైనదే అని టీజర్‌ని చూడగానే అర్థమైంది. రామ్‌ చరణ్‌ వంటి స్టార్‌ పల్లెటూరి మెకానిక్‌గా, చెవిటివాడుగా నటించడం విశేషమే కదా. నాటకంలో డైలాగ్‌ చెప్పడం ఎంత ముఖ్యమో ఎదుటివారి డైలాగ్‌ వినడం కూడా అంతే ముఖ్యం. అది వినపడకుండా నటుడిగా రాణించడం అసాధ్యం. రంగస్థలంలో రామ్‌చరణ్‌ స్టేజ్‌ నటుడని భోగట్టా. మరి చెవిటివాడు ఈ ఇబ్బందిని ఎలా అధిగమనించి రాణించాడనేది ఆసక్తికరమైన విషయమే. ‘మనల్ని అందరూ ఊళ్లో సౌండ్‌ ఇంజనీర్‌ అంటారు’ అనే డైలాగ్‌తో రిలీజైన ‘రంగస్థలం’ టీజర్‌ పోస్టయిన మూడు రోజుల్లో 80 లక్షల హిట్స్‌ను దాటేసింది. సమంత్, ఆది పినిశెట్టి, ప్రకాశ్‌రాజ్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు.
 

మరిన్ని వార్తలు