ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

2 Apr, 2018 03:48 IST|Sakshi

భరత్‌ అనే నేను – సాంగ్‌ ఆఫ్‌ భరత్‌
నిడివి: 5 ని. 29 సె. ::: హిట్స్‌: 67,47,050

‘భరత్‌ అనే నేను... హామీ ఇస్తున్నాను’... అని సాగుతుంది ఈ పాట. హీరో ఉదాత్తతను ఎస్టాబ్లిష్‌ చేస్తూ ఉన్న ‘అట్టడుగున నలిగే కలలకి బలమివ్వని పదవులు దేనికి’... వంటి వాక్యాలు ఆకట్టుకుంటాయి. ‘భరత్‌ అనే నేను’ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో, రామజోగయ్య శాస్త్రి రాయగా, డేవిడ్‌ సిమన్‌ పాడిన ఈ లిరికల్‌ సాంగ్‌ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కుతూహలం రేపేలా ఉంది. కొన్నాళ్లు సినిమాల్లో టైటిల్‌ సాంగ్స్‌ ఊపుగా ఉండేవి. మళ్లీ ఇప్పుడు అవి కనిపిస్తున్నాయి.

కొరటాల శివ తీసిన అన్ని సినిమాల్లో టైటిల్‌ సాంగ్స్‌ కనిపిస్తాయి. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారెజ్‌’... ఈ మూడిటిలోని టైటిల్‌ సాంగ్స్‌లాగానే ‘భరత్‌ అనే నేను’ సాంగ్‌ కూడా మార్కులు సాధించేలా ఉంది. మహేశ్‌బాబు సీఎంగా నటిస్తున్న సినిమా ఏ కొత్త పాయింట్‌ను చెప్పిందో చూడాలి. గతంలో శంకర్‌ ‘ఒకే ఒక్కడు’ దాదాపు ఇదే పాయింట్‌తో తీశాడు. హీరో ముఖ్యమంత్రి కావడం శేఖర్‌ కమ్ముల ‘లీడర్‌’లో కూడా చూశాం. రాబోయే ‘భరత్‌ అనే నేను’ కోసం ప్రేక్షకులు కాచుకుని ఉన్నారు. ఏప్రిల్‌ 20 విడుదల.

నాను కి జాను – ట్రైలర్‌
నిడివి: 2 ని. 20 సె. ::: హిట్స్‌: 1,18,05,550

తెలుగువారిని, తమిళులను ఒక ఊపు వూపిన హారర్‌ సినిమాల వరుస ఇప్పుడు బాలీవుడ్‌కు పట్టింది. ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’లో ఈ జానర్‌ వాడి రోహిత్‌ శెట్టి హిట్‌ కొట్టాక చాలా బాలీవుడ్‌ కథలు ఈ దారి పట్టాయి. వాస్తవానికి రామ్‌గోపాల్‌ వర్మ కొన్ని సినిమాలు వరసపెట్టి తీసినా అప్పుడు లేని మూడ్‌ ఇప్పుడు వచ్చినట్టు ఉంది. ‘నాను కి జాను’ తాజాగా ఆసక్తి రేపుతున్న హారర్‌ సినిమా. అభయ్‌ డియోల్‌ ముఖ్యపాత్రధారి.

ఒక ఫ్లాట్‌లో చేరిన అభయ్‌ డియోల్‌ అక్కడ వింత వింత అనుభవాలను ఎదురుచూడటం కథ. హాస్యం, ఉద్వేగం కలగలిసిన సన్నివేశాలు ఈ సినిమాలో మెండుగా ఉన్నాయని ట్రైలర్‌ చెబుతోంది. ఫరాజ్‌ హైదర్‌ దర్శకుడు. ఈ సినిమా హిట్‌ అయితే అభయ్‌కు లైఫ్‌ రావడంతో పాటు దెయ్యాలకు కూడా లైఫ్‌ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్‌ 20 విడుదల.

హై–జాక్‌ – ట్రైలర్‌
నిడివి: 1 ని. 37 సె. ::: హిట్స్‌: 3,18,93,400

హైజాక్‌ను సీరియస్‌గా డీల్‌ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇది కామెడీగా డీల్‌ చేసిన సినిమా. చాలా కాలంగా జీతాలు ఇవ్వని తమ ఎయిర్‌లైన్స్‌ అధిపతి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని ఆ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులు నలుగురు డిసైడ్‌ అవుతారు. అందుకు మార్గం ఆ రోజు ఎగిరే ఆఖరు విమానాన్ని హైజాక్‌ చేయాలనుకుంటారు. హైజాక్‌ చేస్తారు కూడా.

కాని లోపల ఉన్న ప్రయాణికులు చిత్రవిచిత్రంగా ఉంటారు. వాళ్లు హైజాక్‌కు కారణాలు అడుగుతారు. అంతే కాదు వీళ్లను నానా హింసలు పెడతారు. అదంతా హస్యంతో నిండి ప్రేక్షకులకు వినోదం కలిగించే అవకాశం ఉంది. ఆకర్ష్‌ ఖురానా దర్శకుడు. వెబ్‌ సీరిస్‌ ద్వారా పేరు గడించిన సుమిత్‌ వ్యాస్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. మిగిలిన వాళ్లంతా దాదాపు కొత్తవారే. హాస్యం ఇష్టపడేవాళ్లు దీని మీద ఆశలు పెట్టుకోవచ్చు. ఏప్రిల్‌ 20 విడుదల.

మరిన్ని వార్తలు