ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

25 Jun, 2018 01:04 IST|Sakshi

ఆఫీస్‌ రొమాన్స్‌ – హిందీ షార్ట్‌ఫిల్మ్‌
నిడివి 8 ని. 05 సె.
హిట్స్‌  27,21,025

ప్రేమలు పుట్టే అతి ముఖ్య స్థలం క్లాస్‌రూమ్‌. అది దాటాక ఆఫీస్‌ ఫ్లోర్‌. క్లాస్‌రూమ్‌ ప్రేమలు సఫలం అవుతాయో అవవో చెప్పడం కష్టం... ఎందుకంటే అప్పటికి వాళ్లు జీవితంలో సెటిల్‌ అయి ఉండరు కనుక. కానీ ఆఫీస్‌ ప్రేమలు సఫలమయ్యే చాన్సులు ఎక్కువ. ఎందుకంటే వాళ్లను ఆపే శక్తి ఎవరికీ ఉండదు కనుక. కానీ ఆఫీసు ప్రేమ పండి పెళ్లి వరకూ చేరుకునే దాకా చాలా సీక్రెసీ మెయిన్‌టెయిన్‌ చేయాల్సి ఉంటుంది. తెలిస్తే కొలీగ్స్‌తో తలనొప్పి. బాస్‌కి ఇష్టం లేకపోతే అతడు హరాస్‌ చేసే అవకాశం ఉంది. చెవులు కొరుక్కోవడం. ఈ షార్ట్‌ఫిల్మ్‌లో ప్రేమలో ఉన్న ఇద్దరు కొలీగ్స్‌ కనిపిస్తారు. ఇద్దరూ ఒకే క్యాబ్‌లో వస్తారు. కానీ ఆఫీసుకు కాస్త దూరంలో దిగి ఆమె ముందు వెళుతుంది. ఐదు నిమిషాల తర్వాత ఏమీ ఎరగనట్టు అతడు చేరుకుంటాడు. ఆఫీసులో కళ్లతోనే ప్రేమించుకుంటారు. మాటలు కూడా సైగల ద్వారానే. పైకి మాత్రం ఏమెరగనట్టు ఉంటారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌లో మరుసటి రోజు ఆ కుర్రాడి బర్త్‌డే ఉంటుంది. అమ్మాయి ఆఫీసు నుంచి త్వరగా బయటపడి పార్టీ చేసుకుందాం అనుకుంటుంది. ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు బాస్‌కు మస్కా కొట్టి పర్మిషన్‌ తీసుకుంటారు. పార్టీ చేసుకుని ఇద్దరూ మరి కాస్త మజా చేసుకోవడానికి రూమ్‌కు చేరుకుంటే ఏమైందనేది క్లయిమాక్స్‌. సరదా షార్ట్‌ఫిల్మ్‌. నటించిన నిక్, ప్రాజెక్తా ఇద్దరూ యూట్యూబ్‌ స్టార్లే కనుక హిట్స్‌ జోరుమీదున్నాయి.

నా పెళ్లిగోల  – షార్ట్‌ఫిల్మ్‌
నిడివి 10 ని. 38 సె.
హిట్స్‌  5,73,318

గతంలో మనుషులకు చాలా సెలబ్రేషన్స్‌ ఉండేవి. ఊళ్లో తిరునాళ్ళు, వన భోజనాలు, నవమి పందిళ్లు, ఆరుబయట కబుర్లు, పూజలు, వ్రతాలు... ఇప్పుడు అవన్నీ పోయి ఒకే సెలబ్రేషన్‌ మిగిలింది. పెళ్లి. జీవితంలో డబ్బు తప్ప వేరే ఏమీ సంపాదించే పని లేదని భావించి కష్టపడి, తీరా డబ్బు సంపాదించాక అందరూ డబ్బు సంపాదించేపనిలోనే ఉన్నారు కనుక ఎవరికీ ఒకరంటే ఒకరికి గౌరవం లేదని అర్థం చేసుకొని, చివరకు ఆ డబ్బును ప్రదర్శించడం వల్లే గుర్తింపు పొందుదామని తాపత్రయపడి, అందుకోసం ఒక సందర్భాన్ని సృష్టించుకుంటే ఆ సందర్భమే పెళ్లి. ఆ పెళ్లి మీద బోలెడన్ని సెటైర్లు వేస్తుంది ఈ షార్ట్‌ఫిల్మ్‌లో మహాతల్లి. ‘మహాతల్లి’ పేరుతో యూ ట్యూబ్‌ సిరీస్‌ నడుపుతున్న జాహ్నవి తన టీమ్‌తో చేసిన సందడి ఇది. పెళ్లి అనగానే ఇరుగు పొరుగు ఆరాలు, స్నేహితుల రియాక్షన్‌లు, తల్లిదండ్రుల ఆకాంక్షలు... ఇవన్నీ అవసరమా అన్నట్టు ముక్తాయింపు ఇస్తుంది. కాలక్షేపం ఇస్తూనే చిన్న మెసేజ్‌ కూడా ఇచ్చిన షార్ట్‌ఫిల్మ్‌ ఇది.

సిటీ బస్‌లో గోల  – షార్ట్‌ఫిల్మ్‌
నిడివి 7 ని. 42 సె.
హిట్స్‌  4,43,063

సిటీబస్‌ అంటేనే ఒక సర్కస్‌. మానవ జీవితంలో ఉండే సకల ఫీట్లూ మూడ్‌లూ ఆ బస్‌లో ఉంటాయి. గమనించాలేగానీ వేయి మనస్తత్వాలు, లక్ష వినోదాలు ఆ బస్‌లో దొరుకుతాయి. గతంలో సిటీబస్‌ కామెడీ చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు చేశారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ఫిల్మ్‌గా విడుదల చేశారు. సీటున్నా ఫుట్‌బోర్డ్‌ మీద నిలుచునేవాళ్లు, సీటున్నా ఆడవాళ్ల దగ్గర ఆనుకుని నిలుచునేవారూ, టికెట్‌ వెనుక చిల్లర కోసం వందసార్లు అడిగేవారు, టికెట్‌ కొనకుండా పాస్‌ ఉందని అబద్ధం చెప్పేవాళ్లు, మగవారి మీద చేయి వేసే మగవారు, ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకుని ఊసులాడుకునే ప్రేమికులు... వీళ్లందరూ ఈ సిటీబస్‌లో హాస్యం పుట్టిస్తారు. చివరకు స్క్వాడ్‌ వచ్చి చెకింగ్‌ చేస్తే ఏమయ్యిందనే ముగింపు. నటుడు రవితేజ నానిమల కండక్టర్‌గా ఆకట్టుకుంటాడు. ప్రయాణికులుగా నటించిన టీమ్‌ కూడా. సరదా వీడియో ఇది. దర్శకత్వం: జోన్స్‌ కాట్రు. 

మరిన్ని వార్తలు