నాలో.. నాతో.. వైయస్సార్‌

9 Jul, 2020 00:06 IST|Sakshi

వైయస్సార్‌ సతీమణి శ్రీమతి వైయస్‌ విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో...   వైయస్సార్‌’’ పుస్తకాన్ని, మహానేత 71వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలో నిన్న ఆవిష్కరించారు. డాక్టర్‌ వైయస్సార్‌గారి సహధర్మచారిణిగా శ్రీమతి విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారమే ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న ఆనూహ్యంగా డాక్టర్‌ వైయస్సార్‌ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారమే ఈ పుస్తకం.

జీవితంలో తాను అనుభవించిన, తన గుండెల్లోనే దాచుకున్న భావోద్వేగాలను – ‘వైయస్సార్‌ తన కుటుంబంగా భావించిన’ అభిమానులందరితో పంచుకోవాలని శ్రీమతి వై.ఎస్‌. విజయ రాజశేఖరరెడ్డి చేసిన రచనే ‘నాలో.. నాతో.. వైఎస్‌ఆర్‌.’’ మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజల నుంచి తెలుసుకున్నానని; ఆయన గురించి ప్రజలకు తెలియని మరికొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని శ్రీమతి విజయమ్మ తన తొలి పలుకుల్లో తెలిపారు. డాక్టర్‌ వైయస్సార్‌ ఒక కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో ఉన్నది ఉన్నట్టుగా శ్రీమతి విజయమ్మ వివరించారు.

తమ వివాహం, ఆ నాటి పరిస్థితులు, పేదల డాక్టర్‌గా వైయస్సార్, రాజకీయాల్లో ఆయన రంగ ప్రవేశం, చిన్ననాటినుంచి వైయస్సార్‌ నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలు, అందరివాడిగా గడిపిన జీవితం, పీసీసీ అధ్యక్షుడిగా మొదలు ముఖ్యమంత్రి వరకు ఎదురైన ఒత్తిడులు, చారిత్రక ప్రజా ప్రస్థానం, జగన్‌; షర్మిలలతో.. వారి కుటుంబాలతో మహానేత అనుబంధాలు; మహానేత మరణంతో ఎదురైన పెను సవాళ్ళు,  శ్రీ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేవరకు పరిణామాలు... ఇవన్నీ ఈ పుస్తకంలో రేఖామాత్రంగా కొన్ని, వివరంగా మరి కొన్ని తెలిపారు.

మరణం లేని మహానేత గురించి, తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించి ఉన్న మహానేత గురించి, తెలుగువారంతా తమ కుటుంబమే అనుకున్న మహానేత గురించి రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రజలముందుంచుతున్నానని శ్రీమతి విజయమ్మ అన్నారు. ఆయç¯  జీవితం తెరిచిన పుస్తకమని; ఆయన ప్రజాప్రస్థానంలో ప్రతి అడుగూ ప్రజల జీవితంతోనే ముడిపడి ఉందని శ్రీమతి విజయమ్మ వివరించారు. ఒక ముఖ్యమంత్రి భార్య నుంచి ఇలాంటి రచన రావడం ఇదే ప్రథమం. ఎమెస్కో పబ్లికేషన్స్‌ ద్వారా ప్రచురించిన ఈ పుస్తకం ఆమెజాన్‌లో లభ్యం.

పుస్తకం తొలి పుటల్లో...
‘‘జీపులో వెనక సీట్లో కూర్చోబోతుండగా, ‘అక్కడ కూర్చోడమేంటి, వచ్చి ముందు కూర్చో విజయా’ అన్నారు ఆ వ్యక్తి. దాంతో చాలా ఇబ్బందిగా, బిడియంగా, దించిన తల ఎత్తకుండా ముందుసీట్లో ఈయన పక్కనే కూర్చున్నాను. బిగుసుకుపోయి కూర్చున్నానని గమనించినట్టున్నారు ఈయన. కాసేపాగి – ‘ఎందుకు టెన్షన్‌ పడుతున్నావు... ఫ్రీగా కూర్చోవచ్చు కదా’ అన్నారు. అయినా నేను అలాగే బిగుసుకుని ఉండడంతో, లాభం లేదనుకున్నారో ఏమో, మాటల్లోకి దించారు. అప్పుడు కాస్త భయం తగ్గిందనుకుంటా, నేను కూడా మెల్లమెల్లగా ఓ రెండు మాటలు మాట్లాడడం మొదలెట్టాను.

ఎందుకో మాటల మధ్యలో ధైర్యం చేసి, ఈయనను మొదటిసారి కళ్ళు ఎత్తి చూశాను... ఆ కోరమీసాలు, చందమామ లాంటి ముఖం, కాంతివంతమైన చిరునవ్వు, ఆ ముఖవర్చస్సు, ఉట్టిపడుతున్న రాజసం... నా గుండె దడ పెరిగింది. ఎప్పుడూ లేని కొత్త ఆలోచనలు కలిగాయి. ఇలాంటి వ్యక్తితో జీవితం అంతే అందంగా ఉంటుందేమో అనిపించింది. ఈయన్ని అలా చూడగానే, నాన్న ఎన్నోసార్లు అమ్మతో అన్న మాటలు గుర్తొచ్చాయి – ‘జాతకం ప్రకారం నా కూతురు రాణి అవుతుంది... వచ్చేవాడు రాజు అవుతాడు’ అని!

మరిన్ని వార్తలు