జ్ఞాపకాల 'గుడ్' మార్నింగ్

2 Sep, 2016 03:52 IST|Sakshi
జ్ఞాపకాల 'గుడ్' మార్నింగ్

జన హృదయ విజేత! సుగుణాల కలబోత!
- దిలీప్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సాక్షి

సుదీర్ఘ ప్రజా జీవనయానంలో ఆదర్శ ప్రాయంగా రాజకీయాలను శ్వాసించిన వాడు, శాసించినవాడు, విశాల జనహితం ఆశించినవాడు, మూడు దశాబ్దాలకు పైబడ్డ ప్రజాప్రాతినిధ్య ప్రస్థానంలో ఒడుదొడుకులెదుర్కొన్నవాడు, కష్టనష్టాల్ని చవిచూసినవాడు, ఎదుటివారి కష్టాల్ని చూసి చలించి, హృదయంతో స్పందించిన వాడు, చట్టాల శషభిషలు వీడి, పార్టీల కతీతంగా ఆపన్న హస్తం అందించిన వాడు, కష్టాల కడలి నుంచి  తీరం చేర్చినవాడు, ధీరత్వం చాటినవాడు... ఆయనే! అశేష ప్రజానీకం ‘వైఎస్సార్’ అని ముద్దుగా పిలుచుకున్న.. ఇప్పటికీ, ఎప్పటికీ తలచుకునే డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి.
   
1978 నుంచి పాతికేళ్లపాటు ఎన్నో పోరాటాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్నా రెండు సందర్భాలు ఆయన జీవన గతినే మలుపుతిప్పాయనుకోవచ్చు. అవి రెండూ ఆయన విపక్షనేతగా ఉన్నపుడే జరిగాయి. ఒకటి: ఆయనను ఆయనగా జనహృదయాల్లో ఆవిష్కరించిన ‘శాసనసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం’. రెండు: జననేతగా తనను తాను చెక్కుకునే గొప్ప శిల్పిని చేస్తూ... ‘పాదయాత్రగా సాగిన ప్రజాప్రస్థానం’ ఈ రెండు పరిణామాల తర్వాత, మబ్బులు తొలగిన నీలాకాశంలో సూర్యబింబంలా తెలుగువారి మనసుల్లో రాజశేఖరరెడ్డి దేదీప్యమానంగా వెలిగారు.

అత్యంత ప్రజాదరణతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. జనహితం కోసం పాటు పడ్డారు. ఉడికిందీ లేనిదీ తెలుసుకోవడానికి అన్నం మొత్తాన్ని చేత్తో పట్టి చూడాల్సిన పనిలేదు.  వైఎస్సార్ పేరు ప్రస్తావనకు వస్తే చాలు, నాటి నుంచి నేటి వరకు...... ఎద ఎదలో ఓ గాఢమైన భావన, ఇంటింటికీ ఓ మరపురాని గాథ! వాటిల్లో కొన్ని సందర్భాలు మనకు ఆయన్ని, ఆయనలో మూర్తీభవించిన మానవత్వాన్ని, ఎల్లలెరుగని ఆయన ధీరత్వాన్ని ఇట్టే పట్టిస్తాయి.
  
నిరుపేదలపై దయార్ద్రత
బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్. ఒకరోజు. విమానం బయల్దేరడానికి ఇంకా టైమ్ ఉంది. ఈ కాస్త సమయంలో ఇక్కడే కొన్ని ఫైల్స్ క్లియర్ చేయొచ్చని అనుకున్నారు. ఏవో ఫైల్స్ తెస్తామని అధికారులంటే, ‘...కాదు, అవి ఎప్పుడైనా చేయొచ్చు, తొందరేం లేదు. ప్రాణాంతక జబ్బులతో నిరుపేదలు క్షణాలు లెక్కపెడుతూ నిరీక్షిస్తూ ఉంటారు. సీఎమ్మారెఫ్ ఫైల్స్ తీసుకురండి’ అని పురమాయించారు. అంత దయార్ద్రత ఆయనది.
 
ప్రత్యర్థులకూ మర్యాద!
‘నియోజకవర్గంలో చాలామంది సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి సహాయం కావాలని అడుగుతున్నారు. మనమా వైఎస్సార్‌కు బద్ధ వ్యతిరేకులం, కలిస్తే స్పందనెలా ఉంటుందో? అలా కలిస్తే మన నాయకుడేమనుకుంటాడో? ఏం చేయాలో తోచటం లేదు’ అని అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు యువనాయకులు టీడీఎల్పీలో మాట్లాడుకుంటున్నారు. చివరికి ఏదైతే అదవుతుంది లెమ్మని అనంతపురం నాయకుడు, వరంగల్ జిల్లా నాయకుడు ఆ ఇద్దరూ జతగా ముఖ్యమంత్రిని కలిశారు.

వారిని వై.ఎస్.ఆర్. సాదరంగా ఆహ్వానించి ‘ఏమి సంగతులు?’ అని ముచ్చటిస్తూ వారిచ్చిన కాగితాలు తీసుకున్నారు. వారి వినతి పత్రాల్లో ఉన్న మొత్తాన్ని మంజూరు చేస్తూ సంతకాలు చేశారు. ‘ఓకే రైట్!’ అంటూ వారిని తిరిగి తలుపు వరకు సాగనంపారు. ‘ఎంత బెరుగ్గా వచ్చాం, ఎంత మర్యాద చవిచూశాం’ అని మనసులో అనుకుంటూ, వారికి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. అంతటి సహృదయత ఆయనది.
 
సానుకూల స్పందన
ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో కిలో రెండు రూపాయలకు బియ్యం అంశాన్ని  విభేదిస్తూ, ‘రాజశేఖరరెడ్డి గారూ మీ నిర్ణయం సరైంది కాదు, తర్వాత విచారించవలసి వస్తుంది’ అని ఓ సీనియర్ జర్నలిస్టు అక్కడికక్కడే కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ‘నేను మాట ఇచ్చాను. మాట తప్పలేను. ఏమైనా సరే పథకం అమలు జరిగి తీరవలసిందే’ అని ముఖ్యమంత్రీ కరాఖండిగానే చెప్పారు. కార్యక్రమం ముగిసి సంపాదకుడు వెళ్లిపోయిన తర్వాత... ‘ఈయనెవరండీ బాబు! ముఖ్యమంత్రితో అంత తీవ్రంగా వాదిస్తాడా...?’ అని అక్కడున్న కొందరు విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించినపుడు సీఎం అందుకు భిన్నంగా మాట్లాడారట. ‘‘అందులో ఆక్షేపించవలసింది ఏముంది? నాలుగు విషయాలు తెలిసిన పెద్దమనిషిగా ఆయన విధి ఆయన నిర్వర్తించాడు’’ అన్నారని అక్కడున్న వారే తనకు స్వయంగా చెప్పినట్టు సదరు సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావే ఒక చోట పేర్కొన్నారు.
 
ఆత్మ బంధువు
రాజమండ్రి పీసీసీ సభ్యుడు నక్కల నగేష్ ఒకసారి పది మందితో కలిసి కూర్చున్నారు. పార్టీలు, నాయకులు, సమకాలీన రాజకీయాలు.... వంటివి వారి మధ్య చర్చకు వచ్చాయి. మాటల్లో డా.వై.ఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తావన వచ్చింది. ఆయన గొప్పోడండి, ఆయనతో ఎన్ని సందర్భాలో... జీవితంలో మర్చిపోలేను. ‘ఇదుగో ! పాదయాత్ర సందర్భంగా అలిసిపోయి అనారోగ్యానికి గురైనపుడు మేం అక్కడే ఉన్నాం, మా చేతుల్లోనే వాలిపోయారాయన...‘ అంటూ ఓ ఫోటో చూపించారు. పది మంది మధ్య సదరు ఫోటోను గర్వంగా టేబుల్‌పై పెట్టారు. అందరూ ఆసక్తిగానే చూశారు. ఇది జరిగిన రెండు, మూడు రోజులకు, అక్కడ కూర్చున్న పది మందిలో ఏడుగురు తాము వైఎస్సార్‌తో వేర్వేరు సందర్భాల్లో దిగిన ఫోటోలు చూపించడంతో తెల్లబోవడం నగేష్ వంతయింది!
 
ఆత్మీయమైన పలకరింపు
కర్నూలు జిల్లాలోని ఓ నియోజకవర్గ వాసి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. సర్జరీ చెయ్యాలన్నారు డాక్టర్లు.  తనకు తెలిసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని సంప్రదించారు ఆయన. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులిప్పించి, ప్రాణం కాపాడమని కోరారు. వ్యతిరేక రాజకీయ పక్షం, స్పందన ఎలా ఉంటుందో అని కాస్త సందేహించినా ఆ నాయకుడు పూర్వపు పరిచయం కొద్ది చొరవ తీసుకొని ముఖ్యమంత్రి పేషీకి ఫోన్ చేశారు. సీఎం మీటింగ్‌లో ఉన్నారని బదులొచ్చింది. దాదాపు గంట తర్వాత భోజనం చేస్తుండగా సీఎం కార్యాలయం నుంచి ఫోన్, స్వయంగా సీఎం మాట్లాడుతున్నారు.

‘‘రాజశేఖర్ బాగున్నావా..?’’ అని, పాత చనువు, తొందర వల్ల అలా సంబోధించి, వెంటనే గ్రహించి, సర్దుకొని... ‘‘సారీ, ముఖ్యమంత్రి గారు నేను.....’’ అని చెప్పబోయారు. అవతలి వైపు నుంచి చిరునవ్వుతో ఆత్మీయమైన పలకరింపు, ‘‘అన్నా మీరు ఇదివరకటి లాగే పిలవాలి, కాదని సీఎం గారూ-గీరూ అంటే, నాకెంత ఇబ్బందిగా ఉంటుంది?’’అని బదులిచ్చారు. తర్వాత పని జరిపించారు. అదీ వైఎస్సారంటే!
 
అవినీతిపై ఆగ్రహం
ముఖ్యమంత్రి వై.ఎస్ ఒకరోజు అసెంబ్లీ చాంబర్‌లో కూర్చుని ఉన్నారు. గాంధీభవన్‌లో క్రియాశీలంగా ఉండే ఓ సీనియర్ కార్యకర్త వచ్చారు. ఆ మాటా, ఈ మాటా  అయ్యాక, ‘ఈయన మాకు  చాలా కావాల్సిన మనిషి, ఇదుగో ఈ ఇన్‌స్పెక్టర్ బదిలీ ఫలానా చోటికి అయ్యేలా చూడండి సర్’ అని ఓ కాగితం ముందుంచి వినతి చేశారు. సీఎం అదోలా నవ్వారు. ‘‘బదిలీ కోసం నీకు డబ్బు ముట్టచెప్పాక, అది రాబట్టుకోవడానికి తను రేపు తప్పుడు పనులు చేయాల్సిందే కదా! మళ్లీ ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు చేయకు. నా దగ్గరికే కాదు, ఇలాంటి ప్రతిపాదనలతో ఎవరి దగ్గరికీ వెళ్లకు’’ అని మందలించి పంపించారు.
 
మాట... పల్లెబాట
‘పాదయాత్ర సమయంలో 3 కిలోమీటర్లు సమీపంగా వచ్చి కూడా వీలుపడనందున గ్రామంలోకి రాలేదు, ఇప్పుడు పల్లెబాటలో అంతే దగ్గరగా వస్తున్నారు, ఖచ్చితంగా మా గ్రామాన్ని సందర్శించాల’ని ఈ వ్యాసకర్త కోరినపుడు నవ్వుతూ సరే అన్నారు ముఖ్యమంత్రి. స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పల్లెబాట కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తుంటే, ఫలానా గ్రామాన్ని జాబితాలో చేర్చండని సూచించారు. ఈ చేర్పు ఇలా జరిగిందన్న విషయం తెలియని జిల్లా కలెక్టరు, ఎస్పీలు కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి ఓ నివేదిక ఇస్తూ, ఫలానా ఎనగండ్ల గ్రామాన్ని పర్యటన లోంచి తొలగించామన్నారు.

మధ్యలో చెరువు కట్ట ఎత్తుగా, ప్రమాదకరంగా ఉంది, ముఖ్యమంత్రి పయనించే పెద్దబస్సు వెళ్లలేదు కనుక రద్దు చేశామన్నారు. విషయం సీఎం దృష్టికి వచ్చినపుడు, ‘పెద్ద బస్సు వెళ్లలేదని రద్దు చేస్తే ఇక ‘పల్లెబాట’అని పేరు పెట్టి ప్రయోజనమేముంది? సదరు చిన్న దూరాన్ని చిన్న వాహనంలో వెళ్లొచ్చు, ఆ గ్రామాన్ని చేర్చండ’ని పురమాయించటంతో అధికారులు తిరిగి చేర్చారు.
 
టైమ్ అంటే టైమే..!
వై.ఎస్.ఆర్. హైదరాబాద్ వీడి ఎక్కడికైనా పర్యటనలకు వెళ్లినపుడు, అతిథి గృహాల్లో రాత్రి విశ్రమించే ముందు మరుసటి రోజు ఉదయం కార్యక్రమాలేంటని వ్యక్తిగత సిబ్బందితో ముచ్చటిస్తారు. ‘బయట ఫలానా చోట 10 గంటలకు మీటింగ్ ఉంది... మనం వెళ్లాలి, 9 గంటలకు ఫలానా ఉద్యోగ సంఘాల వాళ్లు కలవడానికి ఇక్కడికే వస్తారు...’ ఇలా కార్యక్రమం వివరించాక, ‘ఓకే... మొదటి ప్రోగ్రామ్ 9 గంటలకు కదా, 8.45కి నే బయటకు వస్తాను’ అని చెబితే, సరిగ్గా అదే సమయానికి తన పడక గది నుంచి బయటకు వస్తారు. ఆలస్యంగా రానే రారు. కొన్నిసార్లు ముందే సిద్ధమైనా, ‘రాత్రి చెప్పిందాని ప్రకారం సహాయ సిబ్బంది ఓ అంచనాతో వారి వారి పనుల్లో ఉంటారు, చెప్పిందానికన్నా నేను ముందే వచ్చి వారిని హడావిడి పెట్టడం ఎందుకు?’ అనుకుంటారో ఏమో! లోపలే పేపరో, పుస్తకమో చదువుకొని సరిగ్గా చెప్పిన సమయానికే బయటకొచ్చేవారని ఆయన వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఒకరు చెప్పారు. అదీ ఆయన ఖచ్చితత్వం.

మరిన్ని వార్తలు