ఉచిత బోరు.. రైతు కష్టాలు తీరు

26 Feb, 2019 05:49 IST|Sakshi

రైతు భరోసా

‘బక్కిరెడ్డి బావి ఎండిపోయింది. మళ్లీ రెండు మూడు మట్లు తవ్వితేగాని నీళ్లు పడవు. బ్యాంకు నుంచి అప్పు తెచ్చి రెండు మట్లు తవ్వడానికి 24 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాడు. కానీ నీటి జాడ కనబడలేదు. దీంతో బక్కిరెడ్డి మానసికంగా బాగా కుంగిపోయాడు. బాకీ తీర్చే మార్గం కనిపించడం లేదు. ఓ రోజు పొద్దున్నే బ్యాంకుల వాళ్లు వచ్చి ఊరోళ్ల సమక్షంలో బక్కిరెడ్డి పొలాన్ని వేలం వేశారు. తరతరాలుగా వచ్చిన పొలాలు పోయాయని, పొలం పోయిన రైతుకు ఊళ్లో ఇక ఏమాత్రం గౌరవం ఉండదని భావించిన బక్కిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడు’... ఇదీ ప్రముఖ నవలా రచయిత డాక్టర్‌ కేశవరెడ్డి రాసిన మూగవాని పిల్లన గ్రోవి నవల్లోని ఓ హృదయ విదారక దృశ్యం. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ సగటు రైతు బతుక్కి అద్దంపట్టే వర్ణన అది.

ఇలా ఎందరో నిత్యం రాష్ట్రంలో కన్నుమూస్తున్నారు. ఒకప్పుడు వంద, రెండు వందల అడుగులు తవ్వితే పడే నీళ్లు ఈవేళ ఏడెనిమిది వందల అడుగులు దాటినా కనిపించడం లేదు. రాయలసీమలోనైతే ప్రత్యేకించి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాలలో 12 వందలు, 14 వందల అడుగులు వేసినా నీరు పడక, పదేపదే బోర్లు వేసి చేతులు కాల్చుకుంటున్నారు రైతులు. చేసిన బాకీలు తీర్చక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యకృత్యం. ఈ దుస్థితిని తన ప్రజా సంకల్పయాత్రలో కళ్లారా చూసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్షనాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ఓ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో లక్షలాది మంది రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

భూగర్భ జలాలే కీలకం...
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 45 శాతం సాగు భూమి భూగర్భ జలాలతోనే సాగవుతోంది. 1998 నుంచి 2003 మధ్య కాలంలో సగటున భూగర్భజల మట్టం 2.5 మీటర్లు తగ్గింది. మోటబావులు, దిగుడు బావులు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బోరు బావులు వేసుకునే రైతుల కోసం ఓ వినూత్న పథకాన్ని తీసుకువచ్చింది. ఒక వేళ బోరు విఫలమైతే బీమా పొందేలా ఆ పథకానికి శ్రీకారం చుట్టింది.

ప్రభుత్వ అనుమతితోపాటు రూ.12వందల ప్రీమియం, జియలాజికల్‌ సర్వే కోసం మరో రూ.1000 (చిన్న సన్నకారు రైతులైతే రూ.500) చెల్లించి బోర్‌ వేసుకోవాలి, నీరు పడకపోతే ప్రభుత్వం నుంచి రూ.10 వేల రూపాయల బీమా లేదా బోరు వేయడానికి అయిన వాస్తవ ఖర్చును పొందవచ్చు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2006 జనవరి నాటికి 5,389 కొత్త బోరు బావులకు అనుమతి ఇచ్చారు. పోటీ పడి పక్కపక్కనే బోర్లు వేసుకోకుండా రైతు భాగస్వామ్య వ్యవస్థను తీసుకువచ్చారు. సంబంధిత బోరు బావి కింద ఎంత భూమి ఉండాలో నిర్ణయించి ఆ ప్రకారంగా రైతులందరూ నీళ్లను వినియోగించుకునే పద్ధతిని– ఉమ్మడి నీటి యాజమాన్య సంఘం–  ప్రవేశపెట్టారు.

భూ గర్భ జలాలను పెంపొందించే విధానాలను రైతులు ఆచరించేలా చేశారు. వేరుశనగ వంటి పంటల్లో సైతం తుంపర సేద్య పద్ధతిని ప్రవేశపెట్టి చిన్నసన్నకారురైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. కాలదోషం పట్టిన ప్రభుత్వ అంచనాల ప్రకారం బోరు వేయడానికి వ్యయం రూ.18,500ఖర్చు, వాస్తవానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయలవుతుంది. బోరు వేసే లోతును బట్టి ఈ ఖర్చు పెరుగుతుంది. బోరు విఫలమైతే రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. నాబార్డ్‌ లాంటి సంస్థలు వీటిని రీచార్జ్‌ చేసేందుకు సాయం అందిస్తున్నా శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ఉచిత బోర్ల పథకాన్ని ప్రకటించారు.

డీజిల్‌ ధర పెరగడంతో అడుగు లోతుకి రూ.300 నుంచి రూ.400 చార్జ్‌ చేస్తున్నారు. ఈ లెక్కన కనీసం 300 అడుగుల లోతున బోరు వేయాలంటే సుమారు లక్షన్నర ఖర్చు వస్తుంది. భార్య పుస్తెలమ్మి బోరు వేస్తే... ఆ బోరులో నీళ్లు పడతాయో లేదో తెలియదు. పంట చేను తడుస్తుందనే భరోసా ఉండదు కానీ ఆ రైతు నట్టిల్లు మాత్రం కన్నీళ్లతో నానిపోతుంది. ఈ దుస్థితి నుంచి రైతుల్ని కాపాడేందుకు
వైఎస్‌ జగన్‌ ప్రకటించిన ఉచిత బోర్ల పథకం ఉపయోగపడుతుంది.


ఉచిత బోరు.. బడుగు రైతుకు భరోసా
(ప్రతీకాత్మక చిత్రం)

– ఎ. అమరయ్య, చీఫ్‌ రిపోర్టర్, సాక్షి

మరిన్ని వార్తలు