ఆకాశానికే ఊపిరి పోసింది

3 Jul, 2019 07:54 IST|Sakshi
‘మై లిటిల్‌ ఎపిఫనీస్‌’ పుస్తకంపై పుస్తక రచయిత్రి ఐషా చౌదరి

ఊపిరి ఉండేదే ఆకాశంలో. అవును. అంత తేలిగ్గా ఉంటుంది మరి. మనం పిచ్చివాళ్లం.ఊపిరి మనది అనుకుంటాం. నలుగురికి ప్రాణం పోసేదే ఊపిరి. జీవం ఇచ్చేదే ఊపిరి. ధైర్యం చూపేదే ఊపిరి. ఆయేషాకు పందొమ్మిదేళ్లు. ఊపిరి ఆగిపోయింది. మనందరికీ ఊపిరిగా మిగిలిపోయింది.

ది స్కై ఈజ్‌ పింక్‌. అక్టోబర్‌ 11న రిలీజ్‌ కావలసిన బాలీవుడ్‌ పిక్చర్‌. ఏమిటిప్పుడు! రిలీజ్‌ అవడం లేదా? అవుతోంది. ప్రోమోషన్‌ టూర్‌లకు కూడా నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఒక్కరు మాత్రం ‘సారీ.. అయామ్‌ నాట్‌ అవైలబుల్‌’ అన్నారు. ఆ మాట అన్నది జైరా వసీమ్‌! సినిమాలో మెయిన్‌ క్యారెక్టర్‌ తనదే. చిన్నమ్మాయి కనుక నిర్మాతలు పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. ‘ఇట్సాల్‌ రైట్‌’ అని చిరునవ్వు నవ్వారు. అసలు ఈ చిన్నమ్మాయి (19) జూన్‌ 29నే ఒక పెద్ద ప్రకటన చేశారు. ఇక మీదట తను సినిమాల్లో నటించబోవడం లేదని! కారణం కూడా చెప్పారు. మతవిశ్వాసాలకు లోబడి ఉండబోతున్నానని. అలా అని సోషల్‌ మీడియాలో పెద్ద పోస్టే పెట్టారు. అభినందించినవారు అభినందించారు. విమర్శించినవారు విమర్శించారు. అన్నిట్లోకీ పెద్ద అభినందన ఒమర్‌ అబ్దుల్లా పెట్టిన ట్వీట్‌. ‘తనకు ఏది హ్యాపీగా అనిపిస్తే అదే చెయ్యనివ్వండి. మనమెవరం మధ్యలో మాట్లాడేందుకు!’ అన్నారు అబ్దుల్లా. జమ్మూకశ్మీర్‌ లీడర్‌ ఆయన. ఒకప్పటి ముఖ్యమంత్రి కూడా. ఇక జైరాకు వచ్చిన అతి చెత్త విమర్శ.. సినిమా ప్రమోషన్‌లో భాగంగా కోసం ‘యాక్ట్‌’ చేస్తోందని!

జైరా వసీమ్‌కు యాక్ట్‌ చేసే అవసరం లేదని ఇప్పటివరకు ఆమె నటించిన రెండు సినిమాల్లో ఆమె చేసిన యాక్షన్‌ చూస్తే అర్థమౌతుంది. ‘దంగల్‌’, ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌’.. రెండూ శుభ్రమైన సినిమాలు. టీన్స్‌ని ఇన్‌స్పైర్‌ చేసేవి. త్వరలో రాబోతున్న మూడో సినిమా ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ కూడా అలాంటిదే. ఐషా చౌదరి అనే టీనేజ్‌ అమ్మాయి బయోపిక్‌ అది. దంగల్‌లోని గీతా ఫోగట్, సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌లోని ఇన్సియా మాలిక్, ఇప్పుడీ స్కై ఈజ్‌ పింక్‌లోని ఐషాలకు జైరా సరిగ్గా సరిపోయారు. మొదటి సినిమా.. కూతురు మీద తండ్రి పెట్టుకున్న ఆశల్ని కూతురు నెరవేర్చడం. రెండో సినిమా.. కూతురు ఆశల్ని పట్టించుకోని తండ్రికి తెలియకుండా కూతురు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడం. మూడో సినిమా.. చిన్న వయసులోనే శ్వాసకోశ వ్యాధి బారిన పడిన ఓ టీనేజర్‌.. మనుషులు తమ ఆశల్ని, ఆశయాల్ని నెరవేర్చుకునేలా మోటివేట్‌ చేయడం.

కథలో లైఫ్‌ ఉంది. కథను సినిమాగా తీసిన వాళ్లలో స్కిల్‌ ఉంది. సినిమాలో ముఖ్యపాత్రగా నటించిన జైరాలో టాలెంట్‌ ఉంది. ఇన్ని ఉన్నప్పుడు మూవీ ప్రమోషన్‌ నుంచి జైరా క్విట్‌ అవడంలో వ్యూహం ఏముంటుంది? మనసులో ఉన్నదాన్ని క్లియర్‌గా చెప్పే వయసునింకా ఆమె దాటి రానేలేదు. అదలా ఉంచితే, ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ను.. ఆ చిత్రంలో జైరా తల్లిగా నటించిన ప్రియాంక చోప్రా గానీ, తండ్రిగా నటించిన ఫర్హాన్‌ అఖ్తర్‌ గానీ సాదాసీదా స్టార్‌లేమీ కారు. సినిమాను వాళ్లు ప్రమోట్‌ చేయగలరు. చిత్ర దర్శకురాలు సోనాలీ బోస్‌కు ఉన్న ఫేస్‌ వాల్యూ తక్కువేమీ కాదు. సినిమాను ఆమె ప్రమోట్‌ చేయగలరు. చిత్ర నిర్మాతలు సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్, రోనీ స్య్రూవాలా! ప్రమోషన్‌లో వాళ్లను మించినవారెవరు? వీళ్లందరూ చేయకున్నా పోయిందేమీ లేదు. ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ రిలీజ్‌ అయ్యాక ఆ సినిమా తనకు తాను ప్రమోట్‌ చేసుకోగలదు. అంత జీవితం ఉంది కథలో. జీవితం కోసం థియేటర్‌లకు వెళతారా ప్రేక్షకులు! జీవితంలో ఊపిరి ఆడకే కదా ఆ రెండున్నర గంటలు బతికేందుకు వెళతారు. కావచ్చు. కానీ ఐషా జీవితంలో పదిమందిని బతికించే శక్తి ఉంది. బతకమని ఇన్‌స్పైర్‌ చేసే గుణం ఉంది. అందుకే ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ కు  కథానాయిక అయింది.
                                                                    ∙∙
ఐషా జీవితంలోని తొలి రోజు 1996 మార్చి 27. ఆ రోజున ఆమె పుట్టింది. ఐషా జీవితంలోని చివరి రోజు 2015 జనవరి 24. ఆ రోజు ఆమె మరణించింది. ఈ మధ్యలోని పందొమ్మిదేళ్లలో చివరి నాలుగేళ్లు ఆమె తన స్పీచ్‌లతో యువతను మోటివేట్‌ చేశారు. పద్దెనిమిదేళ్ల వయసుకే పుణెలోని టెడ్‌లో (టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజైన్‌) స్పీకర్‌గా పని చేశారు. ‘మై లిటిల్‌ ఎపిఫనీస్‌’ అనే పుస్తకం రాశారు. ఆమె చనిపోవడానికి ముందు రోజు ఆ పుస్తకం రిలీజ్‌ అయింది. జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌లో పుస్తకావిష్కరణ అనంతరం ఐషా గుర్‌గావ్‌లో కన్నుమూశారు. ఐషా తండ్రి నిరేన్‌ చౌదరి. అమెరికన్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ కంపెనీ ‘యమ్‌ బ్రాండ్‌’ దక్షిణాసియా విభాగంలో పెద్ద ఉద్యోగి. తల్లి అదితి.. మెంటల్‌ హెల్త్‌ వర్కర్‌. అన్నయ్య ఇషాన్‌. ఇదీ ఐషా ఫ్యామిలీ. ఢిల్లీలో ఉంటారు. పుట్టుకతోనే ఐషాకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంది. ఆరేళ్ల వయసులో బోన్‌మ్యారో మార్పిడి జరిగింది. సైడ్‌ ఎఫెక్ట్‌గా పల్మనరీ ఫైబ్రోసిస్‌ వృద్ధి చెందింది. చివరికి శ్వాసకోశాలు దెబ్బతిని ఐషాను మృత్యువు లాక్కెళ్లింది. ఆమెతో పాటు ఆమె తన ప్రసంగాలతో నిలబెట్టవలసిన ఎంతోమంది జీవితాల్లోని భాగ్యాన్ని కూడా! అయితే ఐషా గురించి ఇదంతా పైపై కథ. ఐషా లోపల ఇంకో జీవితం ఉంది. అది.. ఆలోచనల జీవితం. మనిషి ఆలోచనలే మనిషి అనుకుంటే.. ఐషా ఇంకా బతికే ఉన్నట్లు. ‘మై లిటిల్‌ ఎపిఫనీస్‌’ ఆమెను సజీవంగా ఉంచినట్లు.
                                                                   ∙∙
ఐషా తన జీవితాన్ని ఎలా అర్థం చేసుకుందో, జీవితంలో తను ఏం కనిపెట్టిందో, జీవితంలో ఏది ముఖ్యమని గ్రహించిందో, జీవితాన్ని తను ఏ విధంగా అవలంబించిందో అదే.. మై లిటిల్‌ ఎపిఫనీస్‌. ఇంత చిన్న వయసులోనా! అందుకే కదా.. జైనా వసీమ్‌ ఆ పాత్రకు చక్కగా సరిపోయారు. ‘ఎపిఫనీ’ అంటే అవగాహన పరచుకోవడం. ‘నాకొక కొత్త జత షూ కావాలి.. ఈసారి నా నుంచి నేను పరుగెత్తి పోడానికి’ అని పుస్తకంలో ఒక చోట రాసుకున్నారు ఐషా. జీవితం నుంచి వెళ్లిపోయే రోజున ‘ఎక్కడికెళతావ్‌..’ అని మనం పెంచుకుంటున్న కుక్కపిల్ల కూడా బలంగా కాళ్లకు చుట్టేసుకుంటుందని ఆమెకు మాత్రం తెలియదా? ఐషాను అంటుకుని ఎప్పుడూ కోబో, రోలో అనే రెండు పెంపుడు కుక్కలు ఉండేవి. రోలో చనిపోయింది. పుస్తకం ప్రారంభంలోనే రెండు మూడు పేజీల తర్వాత రోలో గురించి ఉంటుంది.

‘మై డియరెస్ట్‌ డార్లింగ్, రోలో.. మాటలు రావడం లేదు. బేబీ.. నువ్వు లేకుండా నాకు ఊపిరి అందుతుందా? నా జీవితానికి కాంతివి నువ్వు. నా వేకువకు కారణం నువ్వు. నా శక్తివి. నువ్వే అన్నీ. నా అనారోగ్యాన్ని నీ కళ్లలోకి తీసుకున్నావు. మరీ అంతగా తీసుకోవద్దని చెప్పేలోపే అకస్మాత్తుగా నాకన్నా ముందే నువ్వు వెళ్లిపోయావు. నిన్నెప్పటికీ మర్చిపోలేను’ అని రాసుకున్నారు ఐషా. ఐదువేల పదాల ఆలోచనలున్న ఈ పుస్తకం చెప్పేదొక్కటే. మనిషి చనిపోవచ్చు... ఆశ చావకూడదని. తన స్పీచ్‌లలో.. అంత చిన్న వయసులో ఐషా ప్రతిచోటా ఇదే మాట చెప్పేవారు. బహుశా ఈ మాటలే ఆమె కూడా తన మరణాన్ని తేలిగ్గా తీసుకునేలా చేసి ఉండాలి. ఇంగ్లిష్‌లో ‘ఇన్‌ ది పింక్‌’ అనే మాట ఉంది. గుడ్‌ కండిషన్‌లో ఉందని చెప్పడం. ‘ఇన్‌ ది పింక్‌ ఆఫ్‌ హెల్త్‌’ అంటే.. ఇన్‌ వెరీ గుడ్‌ హెల్త్‌ అని. ఐషా ఊపిరి ఆకాశానికి చేరుకుంది. ఆకాశాన్ని ఆరోగ్యవంతం చేసింది. అందుకేనా ఈ చిత్రానికి ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అని పేరు పెట్టారు!             

జీవిత పరమార్థంపై ఐషా ఇచ్చిన ప్రసంగం నాకు స్ఫూర్తిని ఇచ్చింది.
– దీపక్‌ చోప్రా, ప్రముఖ రచయిత, ప్రజావక్త

మరిన్ని వార్తలు