కరోనా సమయంలో పేదలను ఆదుకునే జకాత్‌

26 Apr, 2020 01:08 IST|Sakshi

రమజాన్‌ మాసం ఈ సారి కరోనా సంక్షోభసమయంలో వచ్చింది. సాధారణంగా ముస్లిములు జకాత్‌ను పవిత్రమైన రమజాన్‌ మాసంలో చెల్లిస్తుంటారు. కానీ, కరోనా విపత్తు వచ్చి పడిన తర్వాత, వేలాది వలస కార్మికులు రోడ్లపై తమ సొంతూళ్ళకు పిల్లాపాపలతో కాలినడకన బయలుదేరిన విషాద దృశ్యాలు ముందుకు వచ్చిన తర్వాత, అనేకమంది లాక్‌డౌన్‌ వల్ల తినడానికి తిండి లేక అలమటిస్తున్నారని తెలిసిన తర్వాత చాలా మంది ముస్లిములు పేదలకు అన్నదానాలు ప్రారంభించారు. పేదల కోసం ఖర్చు పెట్టడానికి రమజాన్‌ వచ్చే వరకు ఆగవలసిన పనిలేదని, కరోనా విపత్తు ముంచుకు వచ్చింది కాబట్టి వెంటనే జకాత్‌ చెల్లించాలని ధర్మవేత్తలు ప్రకటించారు. ఈ ప్రకటనల ప్రభావంతో అనేకమంది తమ తమ జకాత్‌ ఎంత ఉందో లెక్కించి దానధర్మాలకు ఖర్చు చేయడం ప్రారంభమయ్యింది.

నిజం చెప్పాలంటే రమజాన్‌ మాసం ఆర్థికవ్యవస్థకు గొప్ప వేగాన్నిస్తుంది. భారీగా క్రయవిక్రయాలు జరుగుతాయి. ముస్లిములు ఈ మాసంలో దానధర్మాలకే కాదు, షాపింగ్‌ కోసం కూడా ఖర్చుపెడతారు. తక్కిన పదకొండు నెలల్లో జరిగే వ్యాపారం కన్నా ఈ ఒక్క నెలలో జరిగే వ్యాపారం చాలా ప్రాంతాల్లో చాలా ఎక్కువ. ద్రవ్యం మార్కెటులో చలామణీలోకి వెళుతుంది కాబట్టి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్ధికవ్యవస్థ బలం పుంజుకుంటుంది. కాని ఈ సారి రమజాన్‌ మాసం కోవిద్‌ 19 లాక్‌ డౌన్‌లో వచ్చింది. ఈ  లాక్‌డౌన్, భౌతిక దూరాల నియమాలను పాటించడం చాలా అవసరం. అంటు వ్యాధుల విషయంలో ప్రవక్త ముహమ్మద్‌ (స) ప్రవచనాలు, సంప్రదాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.

అంటువ్యాధి ప్రబలిన ప్రాంతం నుంచి ప్రజలు బయటకు వెళ్ళరాదని, ఆ ప్రాంతానికి బయటి వారు రాకూడదని ప్రవక్త స్పష్టంగా చెప్పారు. లాక్‌ డౌనంటే ఇదే కదా. కాబట్టి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌కు కట్టుబడి, భౌతికదూరం పాటిస్తూ రమజాన్‌ మాసాన్ని దైవారాధనలో గడపవలసి ఉంది. ఆ విధంగా కరోనా మహమ్మారిని నిరోధించాలి. సాధారణ పరిస్థితుల్లో మాదిరిగా ఇఫ్తార్‌ పార్టీలు, సామూహిక ప్రార్థనలు చేయరాదు. ఎవరి ఇంట్లో వారు నమాజులు చదువుకోవాలి. ఇలా ఇంటికి పరిమితం కావడమే ధర్మాన్ని పాటించడం. ఒకçప్పటి కాలంలో ప్రజలు తమ చేయి గుండెలపై పెట్టుకుని ఒకరికొకరు అభివాదం తెలిపేవారు. ఆ పద్ధతి పాటించడం శ్రేయస్కరం.  

ఇక జకాత్‌ విషయానికి వస్తే, ఇప్పుడు జకాత్‌ 60 వేల కోట్ల రూపాయలకు పైబడి పంపిణీ అవుతుందని పలువురి అంచనా. జకాత్‌ మాత్రమే కాకుండా ఇతర దానధర్మాలు, అన్నదానాలు, ఆహారపంపిణీ వంటివి కలుపుకుంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఈ విధంగా ఖర్చవుతాయని అంచనా. కోవిద్‌ 19 సంక్షోభ సమయంలో ఈ జకాత్‌ నిధులను సరయిన విధంగా ఖర్చు పెడితే పేదవారికి ఎంతైనా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కరోనా కారణంగా, లాక్‌ డౌన్‌లో ఉపాధి కోల్పోయి, నగరాల్లో ఇరుక్కుపోయిన వలస కూలీలు, తమ తమ ఊళ్ళకు కాలినడకన బయలుదేరిన అనేకమంది కూలీల దీనావస్థను చాలా మంది చూశారు. ఇలాంటి ఎంతో మంది నిరుపేదలను ఈ నిధులతో ఆదుకోవచ్చు. అలాగే ఈ సారి ఇఫ్తార్‌ పార్టీలు ఇచ్చే అవకాశాలు లేవు, కాబట్టి ముస్లిములు ఏదైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆహారపొట్లాలు అన్నార్తులకు పంపిణీ చేసే కార్యక్రమానికి ఈ సొమ్ము ఇవ్వడం ద్వారా రమజాన్‌ శుభాలను పొందవచ్చు.

జకాత్‌ అంటే..?
ఇస్లాంకు మూలస్తంభాలుగా పరిగణించే ఐదు మౌలికవిధుల్లో జకాత్‌ ఒకటి. జకాత్‌ అనేది ఆర్థిక ఆరాధన. కాబట్టి స్తోమత ఉన్న ముస్లిములకు మాత్రమే విధి. స్తోమత ఉన్న ముస్లిములంటే ఎవరనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానముంది. ఏడున్నర తులాల బంగారం లేదా యాభైరెండున్నర తులాల వెండికి సమానమైన సంపద ఒక సంవత్సరం పాటు తన వద్ద ఉన్న వ్యక్తి ఆ సంపదపై రెండున్నర శాతం జకాత్‌ చెల్లించాలి. అంటే ఏడున్నర తులాల బంగారం వెల లేదా యాభై రెండున్నర తులాల వెండి వెల ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటుందో అది జకాత్‌ చెల్లించడానికి నిసాబ్‌ గా భావించాలి. ఇప్పుడు మార్కెటు ధరల ప్రకారం ఏడున్నర తులాల బంగారం కన్నా యాభై రెండున్నర తులాల వెండి ధర తక్కువగా ఉంది. కాబట్టి యాభై రెండున్నర తులాల వెండి విలువ కన్నా ఎక్కువ సంపద తన వద్ద ఉన్న వ్యక్తి జకాత్‌ చెల్లించవలసి ఉంటుంది. ఈ రోజు వెండి విలువను బట్టి లెక్కేస్తే 23 వేల రూపాయల సంపద తన వద్ద ఉన్న వ్యక్తి జకాత్‌ చెల్లించవలసి ఉంటుంది.

– అబ్దుల్‌ వాహెద్‌

మరిన్ని వార్తలు