రీమేక్ న్యూ లుక్

27 Feb, 2018 08:40 IST|Sakshi
శ్రీదేవి ,శ్వేతారెడ్డి, పేజ్‌త్రీ డిజైనర్‌ ,అపేక్ష ,అనిత, మోడల్‌

ఆనాటి చీరలు ఈనాడు కొత్త హంగులు అద్దుకుంటున్నాయి. ట్రంకు పెట్టెల్లో భద్రపరిచిన అమ్మమ్మ, నానమ్మల జ్ఞాపకాలు ఒంటిపై సందడి చేస్తున్నాయి. పాతకాలం పట్టుచీరలకు రీమేక్‌తో న్యూలుక్‌ అందిస్తున్నారు సిటీ డిజైనర్లు. ఇప్పుడిది ట్రెండ్‌గా మారింది.

సాక్షి, సిటీబ్యూరో  :అందరూ పెళ్లి చీరలు భద్రంగా దాచుకుంటారు. అయితే వాటిని తరచూ ధరించే అవకాశం ఉండదు. అలాగే పండగలు, వివిధ సందర్భాల్లో వేల రూపాయల చీరలు కొంటారు. ఇంకొంత మందికి అమ్మ, అమ్మమ్మ, నానమ్మ చీరలని ఎన్నో సెంటిమెంట్స్‌ ఉంటాయి. ఒక్కో చీర ఒక్కో మధురానుభూతికి చిహ్నంగా నిలుస్తుంది. అయితే ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా వాటిని ధరించే వీలులేకపోవడంతో బీర్వాలు, లాకర్లకే పరిమితమవుతున్నాయి. ఇప్పుడు వీటికి మెరుగులద్ది కొంగొత్తగా తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు.  

క్వాలిటీ.. క్రియేటివిటీ..   
ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన చీరలు ఇప్పుడు ఓల్డ్‌ ఫ్యాషన్‌ అయిపోతున్నాయి. పాత ఉప్పాడ, కంచి, కాంజీవరం, నారాయణపేట్, వెంకటగిరి, ధర్మవరం, గద్వాల్, బెనారస్, పోచంపల్లి... తదితర ఎన్నో రకాల చీరలు క్వాలిటీకి పెట్టింది పేరు. ఇలాంటి క్వాలిటీ చీరలకు క్రియేటివిటీని జతచేసి రీమేక్‌తో న్యూలుక్‌ అందిస్తున్నారు డిజైనర్లు. మగ్గం వర్క్, థ్రెడ్‌ వర్క్, మిర్రర్‌ వర్క్, జర్దోసి వర్క్, గోట పట్టి, సీక్వెన్స్‌... ఇలా విభిన్న డిజైన్లతో కొత్తందాలు ఇస్తున్నారు. అమ్మమ్మ, నానమ్మల చీరలను మనవరాళ్లు తమకు నప్పేట్టుగా డ్రెస్సులుగా మార్పించుకుంటున్నారు. నేత చీరలతో అనార్కలీ సూట్‌లు.. కంచి, ఉప్పాడ, బెనారస్, కాంజీవరం తదితర పట్టు చీరలతో ఫ్లోర్‌లెంగ్త్‌ ఫ్రాక్‌లు, పలాజో సూట్‌లు, గాగ్రా చోళీలు, లంగా ఓణీలు, దోతి శారీస్‌... ఇలా విభిన్న ఇండోవెస్ట్రన్‌ డ్రెస్సెస్‌ని తయారు చేయించుకుంటున్నారు.   

మా అమ్మ చీర..
ఇది మా అమ్మ చీర(సిల్క్‌ శారీ). నాకు బాగానచ్చిన చీర. అయితే నాకు చీరలు కట్టుకుంటే కంఫర్ట్‌ ఉండదు. అందుకే ఈ చీరను ‘డిజైనర్‌ గాగ్రా‘గా తయారు చేయించుకున్నాను. చీరను లెహంగాగా, చీర చెంగును పైన టాప్‌గా డిజైన్‌ చేయించి... మ్యాచింగ్‌ రాసిల్క్‌ మెరూన్‌ లేస్‌ని లెహంగాకు బోర్డర్‌గా వేయించాను. డిఫరెంట్‌ లుక్‌తో నాకు చాలా బాగా నచ్చిందీ డ్రెస్‌.  – శ్రీదేవి   

ఇది నానమ్మ చీర...
ఇది మా నానమ్మ చీర(పోచంపల్లి పట్టు). ఇందులోని కలర్‌ కాంబినేషన్‌ అంటే నాకు చాలా ఇష్టం. నానమ్మ ఈ చీర కట్టుకున్నప్పుడల్లా నాకిచ్చేయమని అడిగేదాన్ని. 15ఏళ్ల క్రితం కొన్న ఈ చీర ధర రూ.?? వేలు. నేను ఈ చీరను ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా, ట్రెడిషనల్‌గా, ఫంక్షన్స్, పార్టీకి వేసుకునేటట్టు ‘కోల్డ్‌ షోల్డర్స్‌తో ఫ్లోర్‌లెంగ్త్‌ ఫ్రాక్‌‘ డిజైన్‌ చేయించుకున్నాను. ఐ లవ్‌ దిస్‌ స్పెషల్‌ ఔట్‌ఫిట్‌.  – అనిత, మోడల్‌  

సెంటిమెంట్స్‌కిఅనుగుణంగా...  
చాలామంది తమ దగ్గర ఎంతో విలువైన పాతకాలం పట్టు చీరలున్నాయని, వాటిని ట్రెండ్‌కి అనుగుణంగా రీమేక్‌ చేసివ్వమని అడుగుతున్నారు. వారి సెంటిమెంట్స్‌కి అనుగుణంగా రీమేక్‌ చేస్తున్నాం. అమ్మాయిలు తమ అమ్మమ్మ, నానమ్మ చీరలను ఫ్రాక్‌లు, లంగా ఓణీలుగా మార్చుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. వాటికి ట్రెండీ వర్క్స్‌ జోడిస్తున్నారు. ఇందుకు ఎంత ఖర్చయినా వెనకాడట్లేదు. ఈ తరహా మేకింగ్‌కు రూ.4వేల నుంచి రూ.40 వరకు ఖర్చవుతుంది. సెలబ్రిటీలు సైతం ఇలా రీమేక్‌ చేయించుకుంటున్నారు.   – శ్వేతారెడ్డి, పేజ్‌త్రీ డిజైనర్‌  

నా తొలి చీర..
ఇది పదేళ్ల క్రితం ఫంక్షన్‌కి కొనుకున్న నా ఫస్ట్‌ శారీ(ప్యూర్‌ షిఫాన్‌ డిజైనరీ శారీ). నాలుగేళ్లు ధరించాను. ఇక మళ్లీ మళ్లీ కట్టుకుంటే బోర్‌ కట్టేసింది. అందుకే రీమేక్‌ చేయించుకున్నాను. ‘టు పీసెస్‌ ఫ్లోర్‌లెంగ్త్‌ డిజైనర్‌ ఫిష్‌ డ్రెస్‌‘గా మార్పించుకున్నాను.   – అపేక్ష 

మరిన్ని వార్తలు