ఎల్‌ఈడీ బల్బులు వాడుతున్నారా..?

30 Oct, 2017 17:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పవర్‌ ఆదాతో పాటు పర్యావరణానికీ మేలు చేసే ఎల్‌ఈడీ బల్బులు వాడేందుకు మొగ్గుచూపుతున్నారా..? అయితే ఒకసారి మార్కెట్‌ పరిశోధన సంస్థ నీల్సన్‌ చేపట్టిన సర్వేపై దృష్టిసారించాల్సిందే. ఎల్‌ఈడీ బల్బుల్లో 75 శాతం వరకూ ప్రభుత్వం నిర్ధేశించిన వినియోగదారుల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఈ సర్వేలో వెల్లడైంది. జులైలో ముంబై, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, న్యూఢిల్లీలోని 200 రిటైల్‌ అవుట్‌లెట్లలో నిర్వహించిన ఈ అధ్యయనంలో ఎల్‌ఈడీ ఉత్పుత్తులు ప్రమాదకరమని, అత్యంత రిస్క్‌తో కూడినవని తేలింది. జాతీయ రాజధాని ఢిల్లీలోనే భద్రతా ప్రమాణాలను యథేచ్ఛగా ఉల్లంఘించారని వెల్లడైంది.

నాన్‌ బ్రాండెడ్‌ ఎల్‌ఈడీ ఉత్పత్తులు మరింత ప్రమాదకరమని సర్వే పేర్కొంది. ఇక ఎల్‌ఈడీ బల్బు బ్రాండ్‌ల్లో 48 శాతం తయారీదారుల అడ్రస్‌ను ఇవ్వడం లేదు. మరో 31 శాతం తయారీదారు పేరును ప్రస్తావించడం లేదని ఈ సర్వేలో తేలింది. ఎల్‌ఈడీ ఉత్పత్తుల రంగంలో తక్కువ నాణ్యతతో రూపొందిన చైనా బల్బులు పోటెత్తుతున్న క్రమంలో ఎల్‌ఈడీ తయారీదారులు భద్రతా ప్రమాణాలను దీటుగా రూపొందించుకునేందుకు వారి ఉత్పత్తులను బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ వద్ద (బీఐఎస్‌) వద్ద నమోదు చేయించుకోవాలని ఈ ఏడాది ఆగస్టులో కోరింది.

చైనా నుంచి చవకబారు వినిమయ వస్తువుల రాకకు చెక్‌ పెట్టేందుకు వినియోగ, క్యాపిటల్‌ గూడ్స్‌ వస్తువులకు భారత్‌ కఠిన నాణ్యతా ప్రమాణాలను నిర్ధేశించింది. మార్కెట్‌ను ముంచెత్తే చైనా వస్తువులతో పన్ను రాబడి తగ్గడంతో పాటు పెట్టుబడి ఉద్దేశాలను దెబ్బతీసి సులభతర వాణిజ్య స్ఫూర్తికీ తూట్లు పొడుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు