కథ: పునరాగమనం

29 Jun, 2014 01:38 IST|Sakshi
కథ: పునరాగమనం

1965 ప్రాంతంలో, 23 ఏళ్ల వయసులో భాషా పండితుడినవ్వటానికి శిక్షణ తీసుకుంటున్నాను. మేము ఉంటున్న ఆవరణలో మాదొక్కటే అపార్ట్‌మెంట్. నేను అందులో ఆరవ అంతస్తులో ఉంటున్నాను. సెప్టెంబర్ మాసంలో ఒక రోజు పొద్దున్నే నా రూమ్‌లో చదువుకుంటున్నాను. చాలా బద్ధకంగా ఉంది. చదువు మీద అంత శ్రద్ధ పెట్టక, అప్పుడప్పుడు కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. కిటికీ నుంచి కార్నర్‌లో ఉన్న పంచకోణాకారపు స్థలంలోని డాన్ సెసారియో ఇల్లు కనిపిస్తుంది. ఆ పక్కనే ఉన్న అందమైన ఇంటిలో బెర్నాస్కోని కుటుంబం నివసిస్తుంది. చాలా మంచివారు. దయాగుణం కలిగినవారు. వాళ్లకు ముగ్గురు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి అడ్రియానా అంటే నాకు ఇష్టం. తనను చూడటానికి కిటికీ దగ్గర ఆ సమయంలో తచ్చట్లాడుతూ ఉంటాను. రోజూలానే డాన్ సెసారియో తన పెరట్లో మొక్కలకు నీరు పోస్తున్నాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఇంతలో చూడటానికి బిచ్చగానిలా ఉన్న ఒక బక్క పలచని, గడ్డపు వ్యక్తి పక్కనే ఉన్న గృహ సముదాయం నుంచి డాన్ సెసారియో, బెర్నాస్కోనిల ఇళ్ల ముందు పరిగెడుతూ కనిపించాడు.
 
 తలమీద పసుపు రంగు గడ్డి టోపీ, చేతిలో మురికోడుతున్న సంచీ. వెచ్చటి వాతావరణంలో కూడా కోట్ ధరించి ఉన్నాడు. ఆ బిచ్చగాడు డాన్ సెసారియో ఇంటి ముందు ఆగి, ఏదో అడుగుతున్నాడు. డాన్ సెసారియో ఆ బిచ్చగాడు చెబుతున్నది వినిపించుకోకుండా, వెళ్లిపొమ్మని సైగ చేశాడు. కానీ బిచ్చగాడు కదలకుండా అక్కడే ఉండి మాట్లాడుతూ ఉండటంతో ‘విసిగించకుండా వెళ్లు’ అని పెద్దగా అరిచాడు. అయినా బిచ్చగాడు వదలకుండా గేట్ తెరవడానికి ప్రయత్నించాడు. దానితో సహనం కోల్పోయిన డాన్ సెసారియో బిచ్చగాడిని ఒక్క తోపు తోశాడు. దానితో ఆ బిచ్చగాడు నిలదొక్కుకోలేక, నేలమీద పడ్డాడు. కాళ్లు ఆకాశం వైపు తిరిగాయి. తల మెట్టుకి కొట్టుకున్న చప్పుడు వినిపించింది. డాన్ సెసారియో పరిగెత్తుకుంటూ వెళ్లి, బిచ్చగాడి గుండెల మీద తలపెట్టి విన్నాడు. భయంతో బిచ్చగాడి కాళ్లను పట్టుకుని పక్కకు లాగి, ఎవరూ చూసి ఉండరన్న ధీమాతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. జరిగిన సంఘటనకు ఒకే ఒక సాక్షిని నేను.
 
 కొద్దిసేపటికి రోడ్డున వెళ్తున్న ఒక వ్యక్తి చచ్చిపడున్న బిచ్చగాడిని చూశాడు. నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు జనం పోగయ్యారు. పోలీసులు వచ్చారు. అంబులెన్స్‌లో బిచ్చగాడి శవాన్ని తీసుకెళ్లారు. అంతటితో అది ముగిసింది. ఆ విషయం గురించి మళ్లీ ఎవరూ మాట్లాడలేదు. నేను కూడా చాలా జాగ్రత్తగా అసలు ఆ విషయమై నోరు తెరవలేదు. నాకెప్పుడూ ఏ హానీ చేయని ముసలివాని గురించి చెప్పినందువల్ల నాకేమి లాభం అనుకున్నాను. అంతే కాకుండా, ఆ సంఘటన అనుకోకుండా జరిగింది. అతను కావాలని చంపలేదు. ఈ వయసులో కోర్టు, కచేరీల చుట్టూ తిప్పి ఇబ్బందిపెట్టడం ఎందుకు అనిపించింది. విషయాన్ని అతని మనస్సాక్షికి వదిలేస్తే మంచిది అనిపించింది. నెమ్మదిగా, కొద్దికొద్దిగా, ఆ సంఘటనని మర్చిపోయాను. కాని ఎప్పుడు డాన్ సెసారియోని చూసినా, ఒక వింత అనుభూతి. అతని రహస్యం తెలిసిన ఒకే ఒక వ్యక్తిని నేను అన్న సంగతి అతనికి తెలియదు కదా అని! అప్పట్నుంచీ ఎందుకో తెలియదు. అతన్ని తప్పించుకు తిరగడం మొదలుపెట్టాను. మాట్లాడే సాహసం చేయలేదు.
 
 రచయిత పరిచయం
 ఈ కథా రచయిత ఫెర్నాండో సొరెంటీనో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో 1942లో జన్మించారు. మాతృభాష స్పానిష్. ‘రాయడంకంటే చదవడానికే ఎక్కువ ఇష్టపడతాను,’ అంటారు. అందువల్లే తక్కువ కథలు రాశానంటారు. మూడు దశాబ్దాల పైబడిన తన రచనా జీవితంలో ఆయనవి ఆరు కథా సంకలనాలు వెలువడ్డాయి. సొరెంటీనో కథలు ఇంగ్లీష్, పోర్చుగీస్, ఇటాలియన్, జర్మన్, ఫ్రెంచ్, ఫిన్నిష్, హంగేరియన్, చైనీస్ లాంటి ఎన్నో భాషల్లోకి అనువాదమైనాయి. ప్రస్తుతం అచ్చయిన ఈ కథకు ఆంగ్ల శీర్షిక ‘ద రిటర్న్’.
 
 1969 నాటికి స్పానిష్ భాష, సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. అడ్రియానా పెళ్లి వేరొకరితో అయ్యింది. అతను అడ్రియానాని నా అంతగా ప్రేమిస్తాడా? అడ్రియానాకి నాతో సరితూగ గల వ్యక్తి లభించాడా అన్నది తెలియదు. పెళ్లయిన తర్వాత కూడా అడ్రియానా అదే ఇంట్లో నివసిస్తోంది. ఇప్పుడు గర్భవతి. డెలివరీ సమయం దగ్గర పడింది. డిసెంబర్ నెల ఉదయం హైస్కూల్ పిల్లలకు వ్యాకరణ పాఠాలు చెప్తున్నాను. అలవాటు ప్రకారం మధ్యమధ్యలో కిటికీ నుంచి రోడ్డు పైకి ఓ చూపు విసురుతున్నాను. హఠాత్తుగా గుండె ఆగినట్లు అనిపించింది. నేను చూస్తున్నది నిజమా? భ్రమా?
 నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కళ్ల ఎదురుగా మళ్లీ! అవే చిరిగి పీలికలైన బట్టలు, గచ్చకాయ రంగు కోటు, గడ్డి టోపీ, చేతిలో మురికోడుతున్న సంచీతో బిచ్చగాడు!
 
 నేను, నా శిష్యులను మర్చిపోయి కిటికీలో తల పెట్టేశాను. బిచ్చగాడు గమ్యం తెలిసినవాడిలా నెమ్మదిగా వస్తున్నాడు.డాన్ సెసారియో మీద పగ తీర్చుకోవటానికి బతికి వస్తున్నాడు, అనుకున్నాను.
 అయితే బిచ్చగాడు ఆ ఇంట్లోకి వెళ్లలేదు. పక్కనే ఉన్న బెర్నాస్కోని ఇంటి ముందు ఆగి గడియ తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. ‘‘ఇప్పుడే వస్తాను,’’ అని పిల్లలకు చెప్పి పరుగున అడ్రియానా ఇంటికి వెళ్లాను. అడ్రియానా వాళ్ల అమ్మ గుమ్మంలోనే, ‘‘హలో అతిథి! నువ్వు ఇక్కడ? వింతలు ఎప్పటికీ ఆగవా?’’ అంటూ ఎదురైంది. హత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఏమి జరుగుతుందో, నాకేమి అర్థం కాలేదు. అడ్రియానా తల్లి అయ్యిందనీ, అందరూ ఆ సంతోషంలో ఉన్నారనీ తెలిసి అభినందనలు తెలియజేసి వచ్చేశాను. నాకు వాళ్లను ఎలా అడగాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండటం బెటరా లేదా అడగాలా అనుకుంటూ, ‘‘ఒక బిచ్చగాడు సంచీతో మీ ఇంటిలోకి రావటం చూశాను. దొంగతనానికి వచ్చాడేమో అని భయపడ్డాను. అందుకే బెల్ మోగించకుండా లోనికి వచ్చాను’’ అని చెప్పాను.
 
 అందరూ నా వైపు ఆశ్చర్యంగా చూపు పారేసి, ‘‘బిచ్చగాడా? దొంగతనానికా?’’ అన్నారు. అందరూ ఎక్కువ సమయం హాల్లోనే గడుపుతారు కనుక, నేనేమి మాట్లాడుతున్నది వాళ్లకు అర్థం కాలేదు.
 ‘‘నేను పొరబడి ఉంటాను,’’ అన్నాను. బేబీని చూద్దువు రమ్మని అడ్రియానా ఉన్న గదిలోకి తీసుకెళ్లారు. అలాంటి సందర్భంలో ఏమి మాట్లాడాలో నాకు తెలియదు. అభినందనలు తెలిపి, ముద్దుపెట్టుకుని బేబీని చూస్తూ, ‘‘పేరేమి పెడుతున్నారు?’’ అని అడిగాను. ‘గుస్తావో’ అని చెప్పారు.
 నేను ఫెర్నాండో పేరుని ఇష్టపడేవాడిని అనుకున్నాను. కాని బయటకు అనలేదు. ఇంటికి తిరిగి వచ్చాక, ‘ఆ బిచ్చగాడు పగ తీర్చుకోవటానికి రాలేదు. అడ్రియానాకు బిడ్డగా జన్మ తీసుకోవటానికి వచ్చాడు’ అనుకున్నాను. రెండు మూడు రోజుల తర్వాత నా ఊహ హాస్యాస్పదంగా అనిపించింది.
 
 ఇక ఆ విషయం పూర్తిగా మర్చిపోయే వాడినేమో కాని, 1979లో జరిగిన ఒక సంఘటన వల్ల మరచిపోలేకపోయాను. కిటికీ పక్కనే కూర్చొని పుస్తకం చదువుతూ, మధ్యలో అటూ ఇటూ చూస్తూ ఉన్నాను. గుస్తావో, వాళ్ల ఇంటి టై పైన ఆడుకుంటూ కనిపించాడు. వరుసగా ఖాళీ క్యాన్‌లు ఉంచి, నాలుగు గజాల దూరంలో నుంచుని రాళ్లు విసిరి వాటిని పడగొడుతున్నాడు. విరిగిన రాళ్ల ముక్కలు అన్ని డాన్ సెసారియో పెరట్లో పడుతున్నాయి. పాడైన పూలను డాన్ సెసారియో చూస్తే పెద్ద ప్రళయమే వస్తుంది అనిపించింది. అదే సమయంలో డాన్ సెసారియో ఇంట్లో నుంచి పెరట్లోకి వచ్చాడు. వృద్ధాప్యం మీదపడటం వల్ల, తత్తరపడుతూ నడుస్తున్నాడు. గేట్ దగ్గరకు వచ్చి నెమ్మదిగా మెట్లు దిగటానికి ఆయత్తమయ్యాడు.
 
 సరిగ్గా అప్పుడే గుస్తావో రాయితో క్యాన్‌ని కొట్టాడు. అది గోడ మీద పల్టీలు కొట్టుకుంటూ పెద్ద శబ్దంతో డాన్ సెసారియో పెరట్లో పడింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి మెట్లు దిగబోతున్న డాన్ సెసారియో అదుపు తప్పి, జారిపడ్డాడు. తల మెట్టుకు కొట్టుకుంది. ఇదంతా నేను చూశాను. పిల్లవాడిని డాన్ సెసారియో కానీ, డాన్ సెసారియోని పిల్లవాడు కానీ చూడలేదు.
 
  కొద్ది క్షణాల్లోనే జనం డాన్ సెసారియో శవం చుట్టూ పోగయ్యారు. మరుసటిరోజు వేకువనే లేచి, కిటికీ దగ్గర స్థిరపడ్డాను. డాన్ సెసారియోకి కర్మకాండలు జరుగుతున్నాయి. రోడ్డు పక్కన జనం ధూమపానం చేస్తూ మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపటికి అడ్రియానా ఇంట్లోంచి... మళ్లీ ఒకసారి చిరిగిన బట్టలు, పైన కోటు, గడ్డి టోపీ, చేతిలో సంచీతో బిచ్చగాడు దర్శనమిచ్చాడు. నెమ్మదిగా గుంపులో నుంచి దాటుకుని దూరంగా వెళ్లి, అంతకుముందు రెండుసార్లు ఎటు వైపు నుంచి అయితే వచ్చాడో అటే అదృశ్యం అయ్యాడు.ఆ రోజు మధ్యాహ్నం గుస్తావో కనిపించటం లేదు అన్న వార్త విని, ఆశ్చర్యపోలేదు. ఇప్పటికీ బెర్నాస్కోని కుటుంబం, గుస్తావో కోసం వెతుకుతూనే ఉంది.
 ఆ వెతుకులాట అనవసరం అని వాళ్లకు చెప్పే ధైర్యం నాకు లేదు.
 మూలం: ఫెర్నాండో సొరెంటీనో
 అనువాదం: పాలడుగు అనూరాధ

మరిన్ని వార్తలు