ఇవి తీసుకుంటే ఉద్యోగం వచ్చిన ఫీలింగ్‌..

6 Feb, 2019 20:14 IST|Sakshi

లండన్‌ : రోజూ తీసుకునే ఆహారానికి అదనంగా పండ్లు, కూరగాయలను జోడిస్తే మానసికంగా ఉల్లాసంగా ఉండటంతో పాటు నిరుద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోకి అడుగుపెట్టిన తీరున ఉత్సాహంతో ఉరకలు వేయవచ్చని తాజా అథ్యయనంలో తేలింది.తాజా పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకుంటే గుండెకు మంచిదని వైద్యులు సూచిస్తుంటే వీటిని ఆహారంలో అధికంగా తీసుకుంటే మానసికంగానూ ధృడంగా ఉంటారని ఈ అథ్యయనం వెల్లడించింది. యాపిల్స్‌, క్యారెట్‌, అరటిపండ్లు మానసిక ఆరోగ్యాన్ని పరిపుష్టం చేస్తాయని ఈ అథ్యయనం పేర్కొంది.

రోజూ తీసుకునే ఆహారంలో మీరు తాజా పండ్లు, కూరగాయలను తొలగిస్తే మీ మానసిక స్థితి జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి పరిస్థితిలా తయారవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొనడం గమనార్హం. పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకునే వారి మానసిక ఆరోగ్యం స్వల్పకాలంలోనే ఉత్సాహంగా మారుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌ రీసెర్చి ఫెలో నీల్‌ ఓషన్‌ చెప్పుకొచ్చారు. దాదాపు 50,000 మందిపై తాము జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయని నీల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు