పేదరికాన్ని జయిస్తున్న సాహసులు

3 Jul, 2014 01:34 IST|Sakshi
పేదరికాన్ని జయిస్తున్న సాహసులు

హుస్సేన్‌సాగర్ గట్టుపై కూర్చుని అలలపై కదులుతున్న బోట్లను పరిశీలించడమే తెలుసు. కానీ ఓ రోజు ఆ అలలతో పోటీ పడి బోట్‌ను పరుగులు పెట్టిస్తామని వాళ్లెన్నడూ ఊహించలేదు. సెయిలింగ్... ఖరీదైన క్రీడ. బలమైన గాలులకు ఎదురీదుతూ చాకచక్యంగా బోట్‌ను నడిపే సాహసోపేతమైన ఆట. ఏమాత్రం అటూ ఇటైనా ప్రాణాలకే ప్రమాదం. అలాంటి ఆటలో ఆరి తేరారా పిల్లలు. స్లమ్స్‌లో పుడితేనేం... ఆత్మవిశ్వాసంలో వాళ్లు మిలియనీర్స్. వారి పట్టుదలకు కోచ్ సుహీమ్ షేక్ అంకితభావం తోడయ్యింది. పేదరికాన్ని సవాల్ చేస్తూ... సాగర అలలతోపాటు సంపన్నులతోనూ పోటీ పడుతున్నారు. అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌లో జరుగుతున్న డిలైట్ మాన్‌సూన్ రెగెట్టాలో పాల్గొని నీటిలో చేపలా దూసుకుపోతున్నారు.
 - .: వాంకె శ్రీనివాస్
 
రాగి రజనీకాంత్. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. హైదరాబాద్‌లో ఉన్న అన్న దగ్గరికొచ్చి ఉంటున్నాడు. హుస్సేన్‌సాగర్ నీటి శుద్ధి కేంద్రంలో పని చేన్తున్న అన్న దగ్గరికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. అప్పుడే కోచ్ సుహీమ్ కంటపడ్డాడు. ఆ అబ్బాయి కళ్లలో మెరుపు, చురుకుదనం చూసిన సుహీమ్ తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. గ్రామాల్లో పుట్టిపెరిగిన పిల్లలకు సహజంగానే ఈత వస్తుంది. బోటింగ్ నేర్పించడమే తరువాయి. అలా ఒక్క రజనీకాంతే కాదు... ఎర్రోళ్ల ప్రసాద్, పూనమ్ లీలా సాగర్, నిఖిల్ కుమార్, ప్రభాకర్, శివరామ్... దాదాపు పదిమంది సుహీమ్ షేక్ దగ్గర సెయిలింగ్‌లో శిక్షణ పొందారు. ఇప్పటికే ముంబై, చెన్నై, హైదరాబాద్‌లలో జరిగిన రెగెటా చాంపియన్‌షిప్‌లలో పాల్గొని పతకాలు తెచ్చారు.
 
 సెయిలింగ్ ఇలా...
 గాలులు బలంగా వీచే సమయంలో మాత్రమే సెయిలింగ్ పోటీలు నిర్వహిస్తారు. వైండ్ వార్డుకు ఎదురుగా బోట్‌ను ఉంచుతారు. పోటీదారులందరికీ త్రికోణాకృతిలో బోట్ నడపాలనే నిబంధన ఉంటుంది. దాంతోపాటు మరో రెండు రౌండ్ల కోసం ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక మ్యాప్ ఇస్తారు. ఈ ఆట 45 నిమిషాల పాటు సాగుతుంది. ఎవరు ముందు లక్ష్యాన్ని చేరుకుంటే వారికి ఒక పాయింట్ ఇస్తారు. రెండో వాడికి రెండు, మూడో వ్యక్తికి మూడు పాయింట్లు కేటాయిస్తారు. ఒకవేళ సైలింగ్ మధ్యలో ఒకరి బోట్‌ను మరొకరు ఢీకొట్టారంటే వారు ఆట నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే. 45 డిగ్రీలు, 90 డిగ్రీలు, 180 డిగ్రీల కోణంలో సెయిలింగ్ చేసుకునేందుకు అవకాశముంటుంది.
 
 రక్షణ ఇలా...

 ఒక బోట్‌లో మూడు బౌన్సీలు ఉంటాయి. ఒకవేళ అనుకోకుండా బోట్‌లోకి నీరు వచ్చి చేరినా అవి పీల్చుకుంటాయి. బోట్ వెనుక రాడార్, మధ్యలో సెంటర్ బోర్డు ఉంటుంది. బోట్‌లో సెయిలర్లు ఎటువైపు కూర్చుంటే అటువైపు రాడార్ పట్టుకొని కదిపితే ముందుకు వెళతారు. లైఫ్ జాకెట్ తప్పనిసరిగా ధరించాలి.
 
 హుస్సేన్‌సాగర్‌లో జారిపడ్డాం..
‘సెయిలింగ్ అంటే మొదట్లో చాలా భయపడ్డాం. మాకు అప్పటికే ఈత రావడంతో నేరుగా బోట్‌లోకి ఎక్కి సెయిలింగ్ ప్రాక్టీసు మొదలెట్టాం. ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తుండగా రెండు, మూడుసార్లు హుస్సేన్‌సాగ ర్‌లో జారిపడ్డాం. మాలాంటివాళ్లకు బోట్ ఎక్కడమే గగనం. అట్లాంటిది ఆ బోట్‌లో ఉండి నీటిపై ఆటలంటే అసలే సాధ్యం కాదు. వెనక్కి పోదామనుకున్నప్పుడల్లా ఒక్కసారి బ్యాక్‌గ్రౌండ్‌ను గుర్తుకు తెచ్చుకున్నాం. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే ఏం సాధించలేం అనుకున్నా... ముందుకు పోవడానికే నిర్ణయించుకున్నాం. ఇక సుహీమ్‌సార్ ఇచ్చే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. సెయిలింగ్‌పై పూర్తి పట్టు సాధించాం. ఇప్పుడు చదువుకుంటూనే సెయిలింగ్‌ను కొనసాగిస్తున్నాం. భవిష్యత్‌లో సూపర్ సెయిలర్స్ అవుతాం’ అంటూ పిల్లలు ముక్తకంఠంతో చెబుతున్నారు.
 
 అమ్మాయిలూ...
 ఇప్పుడిప్పుడే అమ్మాయిలూ ఈ ఆట వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వేసవిలోనే సెయిలింగ్‌లో శిక్షణ పొందిన అనీషా కూడా మాన్‌సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో ఇరగదీస్తానంటోంది. పిన్న వయస్సులోనే ఈ ఆటలోకి అడుగుపెట్టిన జుహీ విన్యాసాలు చూస్తే అబ్బురమనిపిస్తుంది. సికింద్రాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న 11 ఏళ్ల జుహీ వరల్డ్ చాంపియన్ అవుతానని అంటోంది. శుక్రవారం జరిగే అండర్-14 పిల్లలు పాల్గొనే అప్టీ ఫ్లీట్ పోటీలకు సమాయత్తమవుతోంది. ‘గతేడాది కేవలం 23 కేజీలు మాత్రమే ఉన్నా. బోట్‌కు సరిపడా బరువులేనని పోటీలకు దూరం పెట్టారు. ప్రస్తుతం సరిపడ బరువు సాధించా. ఈసారి జరిగే పోటీల్లో రాణిస్తా’నంటోంది జుహీ చిరునవ్వులు చిందిస్తూ.
 
 అర్హత ఇదీ...

 యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన క్లబ్‌లలో సభ్యులుగా ఉండాలి. అప్పుడు సంబంధిత క్లబ్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం దక్కుతుంది. ఆర్మీకి చెందిన ఈఎంఈ సభ్యులకు కూడా అవకాశముంటుంది.
 
 సెయిలింగ్ అనగానే ధనికుల ఆట అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. కానీ పట్టుదల ఉండాలే కానీ.. ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. అలా పట్టుదల ఉన్న పిల్లలను యాచ్ క్లబ్‌లో చేర్చుకుని మరీ సెయిలింగ్ నేర్పిస్తున్నాం. ఇప్పుడిక్కడ పోటీ పడుతున్న 10 మంది పిల్లలను అలాగే తీర్చిదిద్దాం. చాలా నిరుపేద కుటుంబాలనుంచి వచ్చినవాళ్లు. కొంతమందికైతే తల్లిదండ్రులు కూడా లేరు. అయినా ఆ పిల్లల్లో నేర్చుకోవాలన్న తపన ఉంది. అదే వాళ్లను ముందుకు నడిపిస్తోంది. హైదరాబాద్‌లోనే కాదు... ఇతర రాష్ట్రాల్లో జరిగే పోటీలకూ వారిని తీసుకెళ్తున్నాం. ఆ ఖర్చులన్నీ క్లబ్ భరిస్తుంది.
 - సుహీమ్ షేక్,
 హైదరాబాద్ యాచ్ క్లబ్ వ్యవస్థాపకుడు

మరిన్ని వార్తలు