బఓబాబ్

18 Aug, 2014 00:34 IST|Sakshi
బఓబాబ్

అబ్బురపరిచే మహావృక్షం బఓబాబ్. గోల్కొండ కోటకు దగ్గరలో, నయా ఖిల్లా ప్రాంతంలో వుంది. ఈ చెట్టుకి సుమారు 400 సంవత్సరాల వయస్సు ఉందని అంచనా. ఇదొక అరుదైన ఆఫ్రికన్ జాతి మహావృక్షం. ఇది కూలీ కుతుబ్ షా రాజులు కాలం నాటిదని చరిత్రకారుల అభిప్రాయం. ఈ వృక్షం ఎత్తు 79 అడుగులు. చుట్టు కొలత 40 అడుగుల పైగా వుంది. అంతేకాదు, ఈ చెట్టు లోపల 1010 అడుగుల విస్తీర్ణంలో పెద్ద తొర్ర వుంది. ఈ తొర్ర లోపలికి మనం కూడా దిగి చూడవచ్చు. ఆఫ్రికాలోని కెరిన్ అనే ప్రాంతంలో వున్న అతిపెద్ద హాతియన్ చెట్టు తొర్రలో చిన్న సైజు సెయింట్ మోరీస్ చర్చిని ఏర్పాటు చేశారట. గోల్కొండ కోట నుండి నయాఖిల్లాకు వెళ్లేదారిలో ఒంటరిగా ఆ ప్రాంతాన్ని కాపలా కాస్తున్న సిపాయిలా ఈ వృక్షం కనిపిస్తుంది.
 
స్థానికులు ఈ చెట్టును ‘హాతియన్’ అని పిలుస్తున్నారు. ‘‘ఏనుగులాగా’’ ఎత్తుగా, బలంగా ఉంటుంది. కాబట్టి ఆ పేరు సార్థకం చేశారు. ఎలాంటి దుర్బిక్ష పరిస్థితులనైనా హాతియన్ ఎదుర్కొంటుంది. హాతియన్‌ని మొండి మొక్కగా వృక్ష శాస్త్రవేత్తలు వర్ణిస్తారు. ఈ వృక్షం ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలలో విరివిగా కనపడుతుంది. ఆఫ్రికన్లు ఈ వృక్షాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ చెట్లు సంవత్సరంలో చాలా భాగం ఆకులు లేకుండానే వుంటాయి. ఆకుల్లేని సమయంలో భూమిలో వుండే వేళ్లు ఆకాశంలో వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇదెవరైనా చూస్తే, ఈ చెట్టు చచ్చిపోయిందా? అన్న అనిపిస్తుంది.
 
ఎన్నో జీవరాశులకు ఆహారాన్ని, ఆవాసాన్ని ఈ వృక్షం అందిస్తుంది. ఈ వృక్షజాతికి పూసే తెల్లని పూలు, కాసే కాయలలో టార్‌టారిక్ ఆసిడ్, సీ-విటమిన్ అధికంగా వుంటాయి. ఈ చెట్టు ఆకుల వల్ల రక్తహీనత, విరోచనాలు, ఆస్త్మా, ఎముకల నొప్పుల నివారణ సాధ్యం అవుతుందని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఆకుల్లో కాల్షియం, ఇనుము, ప్రొటీన్లు, లిపిడ్‌లతో పాటు ఫాస్ఫేటు కూడా అధికంగా వుందని.. దీని వల్ల ఫర్టిలైజర్సు, సబ్బుల తయారీలో ఈ చెట్టు ఆకుల ఉపయోగం ఎంతగానో ఉంటుందని చెప్తారు. ఈ మహావృక్షం కేంద్ర పురావస్తు శాఖ అధీనంలో వుంది. వారి తరఫున ఒక వాచ్‌మెన్‌ని కాపలాగా ఇటీవల నియమించారు. పర్యావరణ అభిలాషాపరులందరూ తప్పక చూడాల్సిన ప్రదేశమిది. రాష్ట్ర పర్యాటక శాఖ పర్యాటకులను ఆకర్షించే రీతిలో తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఇంకా ఎంతైనా వుంది. అబ్బురపరిచే అరుదైన మహావృక్షం ప్రస్తుతానికి మరుగున పడివుంది.
 - మల్లాది కృష్ణానంద్  malladisukku@gmail.com

>
మరిన్ని వార్తలు