మైసూర్‌పాక్‌ ఎవరిది..?

16 Nov, 2017 18:55 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: రసగులా బెంగాలీలదేనని తేలడంతో తాజాగా మరో స్వీట్‌పై వివాదం ముందుకొచ్చింది. నోరూరించే మైసూర్‌పాక్‌ కర్నాటకకు చెందుతుందా లేక అది తమిళనాడు వంటకమా అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ స్వీట్‌ తమదంటే తమదేనని సోషల్‌ మీడియా వేదికగా తమిళులు, కన్నడిగులు సవాల్‌ చేసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా విడిపోయి మైసూర్‌పాక్‌ మూలాలు తమ రాష్ర్టంలోనే ఉన్నాయని వాదవివాదాలకు దిగుతున్నారు.

కన్నడిగులు ఒక అడుగు ముందుకేసి మైసూర్‌పాక్‌ పేరులోనే అది తమదేననే అర్థం స్ఫురిస్తుందని మైసూర్‌ పేరును ఉటంకిస్తూ ఇది రాజ కృష్ణ రాజ వడయార్‌ కిచెన్‌లో మెనూ అని చెబుతున్నారు. నెయ్యి, చక్కెర, శనగపిండితో ప్యాలెస్‌ చెఫ్‌ కకసుర మాదప్ప దీన్ని వండివార్చేవాడని చెబుతున్నారు.కాలక్రమంలో దీనిపేరు మైసూర్‌పాక్‌గా స్ధిరపడిందని అంటున్నారు.

అయితే తమిళులు తమదైన శైలిలో మరో కథ వినిపిస్తున్నారు. మద్రాస్‌కు చెందినవారు మైసూర్‌ పాక్‌ను కనుగొన్నారని అయితే 74 ఏళ్ల కిందట ఓ న్యాయవాది ఈ వంటకాన్ని దొంగిలించి మైసూర్‌ రాజాకు దీని సీక్రెట్‌ ఫార్ములాను అప్పగించారని చెబుతున్నారు. అప్పుడు మైసూర్‌ రాజా ఈ వంటకానికి మైసూర్‌పాక్‌ అని పేరుపెట్టారని ఈ విషయాలను స్వయంగా మెకాలే 1835లో బ్రిటన్‌ పార్లమెంట్‌కు వివరించారని పేర్కొంటున్నారు.దీనిపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు రాష్ర్టాల వారీగా చీలి కామెంట్లు, లైక్‌లతో రెచ్చిపోతున్నారు.

మరిన్ని వార్తలు