ఇంకా పాములోళ్లే అనుకునేవారు!

29 Sep, 2014 10:19 IST|Sakshi
ఇంకా పాములోళ్లే అనుకునేవారు!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుల మదిని ఇట్టే దోచుకున్నారు. 'మీరే ఈ అద్భుతాలు చేయకపోతే.. ఇప్పటికీ మన భారతీయులను ఇతర దేశాల వాళ్లు పాములోళ్లు, పాములను ఆడించేవాళ్లనే అనుకునేవాళ్లు' అన్నారు. న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్స్లో ఎన్నారైలతో జరిగిన భేటీలో అడుగడుగునా మోడీకి అమెరికన్లు, ప్రవాస భారతీయులు పట్టం గట్టారు. భారత సంతతికి చెందిన దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ, 45 మంది కాంగ్రెస్ సభ్యులు వచ్చిన ఈ సమావేశానికి దాదాపు 20 వేల మంది ఎన్నారైలు వచ్చారు. ప్రధాని ప్రసంగించినంతసేపూ మోడీ మోడీ, జిందాబాద్ అంటూ నినాదాలు మిన్నంటాయి.

బాపూజీ కూడా ఒకప్పుడు ప్రవాసభారతీయుడేనని, ఆయనకు నచ్చిన శుభ్రతను అందరూ పాటించాలని ఈ సందర్బంగా మోడీ పిలుపునిచ్చారు. భారత యువశక్తిని ఉపయోగించి ప్రపంచాన్నే జయిస్తానని చెప్పారు. 'చాయ్ అమ్ముతూ ఇక్కడిదాకా వచ్చాను' అంటూ మోడీ అనగానే ఆడిటోరియంలో ఉన్న అందరి నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. తాను చాలా సామాన్యుడినని, అందుకే తన మనసు కూడా చిన్నచిన్న పనులే చేస్తుందని అన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, పని మొదలుపెట్టినప్పటినుంచి 15 నిమిషాలు కూడా 'వెకేసన్' తీసుకోలేదు అంటూ టిపికల్ గుజరాతీ స్టైల్లో చెప్పారు.

మోడీ ప్రసంగాన్ని అమెరికా పత్రికలు కూడా అద్భుతంగా శ్లాఘించాయి. ఆయనను 'రాక్స్టార్' అని అభివర్ణించాయి. మోడీ తనను తాను టీ అమ్ముకునే వ్యక్తిగా చెప్పుకొంటూ తన దేశాన్ని శుభ్రం చేయడం ద్వారా భారత ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపిస్తున్నారని, తమ యువ పౌరులను వార్ధక్యంలో పడిపోతున్న ప్రపంచానికి తిరుగులేని శక్తిగా అందిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ చెప్పింది. మోడీ ఒక హీరోగా వాషింగ్టన్కు వస్తున్నారని, అయితే కొంతమంది మాత్రం ఆయనను వ్యతిరేకిస్తున్నారని వాషింగ్టన్ పోస్ల్ చెప్పింది. ఆదివారం జరిగిన రిసెప్షన్లో మోడీకి లభించిన ఆదరణ అపూర్వమంది. ప్రధాని నరేంద్రమోడీ న్యూయార్క్ నగరాన్ని థ్రిల్లో ముంచెత్తారని యూఎస్ఏ టుడే తెలిపింది. ఆయనకు రాక్స్టార్ స్టేటస్ వచ్చిందంది. ఆయన నాయకత్వంలో భారతదేశం ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. కాగా, ఈ కార్యక్రమానికి మోడీ రావడానికి ముందు బాలీవుడ్ స్టైల్లో డాన్సర్లు అక్కడి జనాన్ని ఆహ్లాదపరిచారు.

>
మరిన్ని వార్తలు