రీడ్ అండ్ లీడ్

22 Apr, 2015 22:34 IST|Sakshi
రీడ్ అండ్ లీడ్

‘పుస్తకం లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది’ అంటారు రోమ్ ప్రముఖ తత్వవేత్త మార్కస్ టులియస్ సిసెరో. ఓ మంచి పుస్తకం విజ్ఞానం, వికాసం వైపు నడిపిస్తుంది. కానీ ప్రస్తుత హైటెక్ యుగంలో పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది. విస్తృతమైన ఇంటర్నెట్, విరుచుకుపడుతున్న గాడ్జెట్స్.. పుస్తకం తెరిచే సమయమే ఉండటం లేదు నేటి తరానికి. ఈ పరిస్థితిని కొంతైనా మార్చి పుస్తకానికి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ‘యానిమల్  రీహాబిలిటేషన్ ప్రొటెక్షన్ ఫ్రంట్’(ఏఆర్‌పీఎఫ్) వారు.

ఏటా ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద పిల్లలకు వివిధ రకాల పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. వారిని బుక్ రీడింగ్ వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నగరంలోని అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, మురికి వాడల్లోని పిల్లలు, వారి తల్లిదండ్రులకు పుస్తకం ప్రాముఖ్యాన్ని తెలిపేలా క్యాంపెయిన్ చేపట్టారు. విజ్ఞాన, వినోద పుస్తకాల గురించి వారికి వివరించారు. జంతు సంరక్షణ, భూ సంరక్షణ, జనరల్‌నాలెడ్జ్ తదితర బుక్స్‌ను పంపిణీ చేశారు. వాటితో పాటు పెన్సిల్స్, పెన్స్ పంచిపెట్టారు.

‘అంతటితోనే మా మిషన్ ఆగిపోదు. ఆయా ప్రాంతాల్లో విద్యపై ఆసక్తి ఉండి, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చదువుకోలేని వారిని బడిలో చేర్పిస్తున్నాం. జీవితానికి ఉపయోగపడే మంచి పుస్తకాలు, వాటి రచయితల విశిష్టతను పిల్లలకు తెలియజెబుతూ వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాం’ అంటూ చెప్పారు సంస్థ నిర్వాహకుడు నిహార్. ఈ సామాజిక సేవలో నిహార్‌కు తోడుగా ఎంతో మంది వాలంటీర్లు జతకలిశారు. ‘పుస్తకం, విద్య, జీవజాలం, భూమి.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలంటే వీటి ప్రాధాన్యం నేటితరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అంటారు టీం మెంబర్స్.
- సిరి

మరిన్ని వార్తలు