అక్వెరియం పర్నీచర్

2 Oct, 2014 02:05 IST|Sakshi
అక్వెరియం పర్నీచర్

కంటికి ఇంపు.. ఇంటికి శోభ.. మనస్సుకు హాయి. అందానికి అందం.. ఆహ్లాదానికి ఆహ్లాదం. క్రియేటివిటీ అదిరింది. ఆకర్షణీయమైన డిజైన్లతో అక్వేరియంలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇంట్లో స్థలాన్ని ఆదా చేస్తున్నాయి. ఫర్నిచర్‌లో ఇమిడిపోతున్నాయి. భలే ఉన్నాయి. దేనిలోనైనా సౌకర్యంగా అమరిపోతున్నాయి ఫర్నిచర్ అక్వేరియంలు. ఇంటికి మరింత అందాన్ని తీసుకు వస్తున్న సరికొత్త అక్వేరియంల గురించి తెలుసుకుందాం...
 
 నాలుగు పలకల గాజు పెట్టె. అందులో రంగురాళ్లు, నీటిమొక్కలు. ఇదే కదా అక్వేరియమంటే. కాని ఇప్పుడు దాని లుక్కే మారిపోయింది. అక్వేరియంల కోసం స్పెషల్‌గా స్థలాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు. టీపాయ్, డైనింగ్ టేబుల్, బుక్ ర్యాక్, వాష్ బేసిన్, బెడ్స్‌లో అక్వేరియంలు మన ముందుకు వచ్చాయి.
 
 మానసిక సాంత్వన
బెడ్‌రూమ్‌లో మంచానికి ఉండే హెడ్‌బోర్డ్ భాగంలో అమర్చిన అక్వేరియంలు పడుకునే ముందుకు మానసిక సాంత్వననిస్తున్నాయి. ఫిష్ ట్యాంక్‌లను గోడల్లో భాగంగా ఏర్పాటు చేయడం కూడా ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. చిన్నారులకు ఇవి నేస్తాలుగా ఉండటానికి వీలుగా ఇంటి మధ్యలో గచ్చుకింది భాగంలో అక్వేరియంను అమర్చి దానిపైన గాజు టైల్స్‌ను అమరుస్తున్నారు. ఎఫెక్ట్ కోసం వీటిలో ఎల్‌ఈడీ లైట్లను కూడా సెట్ చూస్తున్నారు. చిన్న అక్వేరియంలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
 
 టేబుల్‌పై పెట్టుకునే ఎల్‌ఈడీ లైట్, పెన్ స్టాండ్ లాంటి మోడల్స్ వచ్చాయి. షాపుల్లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసి అక్వేరియంను తెప్పించుకోవచ్చు. వీటి ధర 5 వేలు మొదలు లక్షల రూపాయల వరకూ ఉన్నాయి.  ఒకప్పుడు అక్వేరియంలు కొనాలంటే దానికోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలి  అనుకునేవారు. కాని నేడు ఆ పరిస్థితి లేదు. అక్వేరియంలు కావాలనుకుంటే ఇళ్లు కడుతున్నపుడే ప్లాన్ చేసుకుంటూ చక్కగా గోడల్లో అమరిపోయేవిధంగా వీటిని సెట్ చేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల స్థలం ఆదా కావడమే కాకుండా చూడటానికి ఇల్లు కూడా చాలా అందంగా ఉంటుంది.
 - విజయారెడ్డి

మరిన్ని వార్తలు