అవేక్.. వాక్

4 Apr, 2015 23:13 IST|Sakshi
అవేక్.. వాక్

కూర్చుని చేసే ఉద్యోగం, బయటకు అడుగుపెడితే వెహికిల్, వేళాపాళాలేని ఆహారపు అలవాట్లు. ఈ లగ్జరీయస్ లైఫ్‌స్టైల్‌కు సిటీ పొల్యూషన్ తోడై.. హైదరాబాదీల ప్రాణాలకే ప్రమాదం తెస్తోంది. ఇది కొత్త విషయం కాకపోయినా.. ఈ మధ్యకాలంలో ఎక్కువైన ఈ ట్రెండ్ సిటీ వాసులను డయాబె టిస్, హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు, మతిమరుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) బారిన పడేట్టు చేస్తోంది. కలవరానికి గురిచేస్తున్న ఈ విషయాలను వెల్లడించింది ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లోని నిపుణుల బృందం! ఇటీవల సిటీలో సర్వే నిర్వహించిన ఈ టీమ్... 53.6 శాతం మంది నగరవాసులు కదలకుండా ఉండే లైఫ్‌స్టైల్‌ను లీడ్ చేస్తున్నట్లు తెలిపింది.

నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 700 మందిలో సగటున 375 మంది నడక, ఎక్సర్‌సెజైస్, యోగాలాంటివేవీ చేయకుండా జీవితాన్ని వెళ్లదీస్తున్నట్లు పేర్కొంది. రోగాలెన్నింటినో దూరం చేసే శారీరక వ్యాయామాలను నగరవాసులు దూరం పెడుతున్నారని దీనివల్ల భవిష్యత్‌లో అనేక అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు.. సిటీ సిటిజన్స్ శరీరానికి సరైన పోషకాలనందించే పళ్లు, కూరగాయలను సక్రమంగా తీసుకోవడం లేదని తేల్చింది. ఇక 15 శాతం మంది తినాల్సినదానికంటే ఎక్కువ మోతాదులో ఉప్పు తింటున్నారని, మరో 20 శాతం మందికి పొగాకు, ఆల్కహాల్ వంటి వి వ్యసనంగా మారాయని తెలిపింది.
 
బ్రిస్క్‌వాక్ చాలు...


ఇలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించినట్లుగా రోజుకు 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల ఆకు కూరలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వ్యాయామాలు చేయడమంటే కచ్చితంగా ఏ జిమ్‌లోనో జాయినవ్వాల్సిన అవసరం లేదని ఈ రిస్కీ లైఫ్‌స్టైల్‌ను ఎదుర్కోవడానికి బ్రిస్క్‌వాక్ చాలని చెబుతున్నారు. శరీరం మొత్తం కదిలే విధంగా చురుకైన నడక, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం, చిన్న చిన్న దూరాలకు వెళ్లాలనుకున్నప్పుడు బైకో, కారో వాడకుండా సైకిల్‌పై వెళ్లడం వంటివి చేస్తే చాలని సలహా ఇస్తున్నారు!
 సిటీప్లస్

మరిన్ని వార్తలు