రక్తం పెరగడానికి ఆయుర్వేద మందులు సూచించండి

2 Jul, 2013 03:30 IST|Sakshi
రక్తం పెరగడానికి ఆయుర్వేద మందులు సూచించండి
నా వయసు 35. గత ఐదారు నెలల నుంచి బాగా నీరసంగా ఉంటోంది. మెట్లెక్కుతున్నప్పుడు, నడిచినప్పుడు విపరీతమైన ఆయాసం. డాక్టర్ సలహాపై రక్తపరీక్ష చేయించుకుంటే హీమోగ్లోబిన్ 7 గ్రాములు మాత్రమే ఉందని తెలిసింది. అనీమియా అని చెప్పి మందులు రాసి ఇచ్చారు గాని పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. పైగా ఐరన్ మాత్రలు వాడుతుంటే మలవిసర్జన సరిగా జరగడం లేదు. కాబట్టి రక్తం పెరగడానికి ఆయుర్వేద మందులు సూచించండి. 
 - ముక్తేశ్వరరావు, రాజమండ్రి
 మీరు లేఖలో వివరించిన పరిస్థితిని ఆయుర్వేదంలో ‘పాండురోగం’గా పేర్కొనవచ్చు. ఈ కింద వివరించిన విధంగా ఆహార విహారాలను పాటిస్తూ, మందులు కూడా వాడండి. హిమోగ్లోబిన్ నార్మల్ అవుతుంది. 
 ఆహారం: బయట పదార్థాల జోలికి పోకుండా ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తినండి. మొలకెత్తిన ధాన్యాలు, ఇడ్లీ, తాజా ఆకుకూరలు ఎక్కువగా తినాలి. తాజాఫలాలు తినడం చాలా మంచిది. బొప్పాయి, సపోటా, దానిమ్మపండ్లు బాగా తినండి. ఖర్జూరం (ఎండినది లేదా పచ్చిది), బాదం, బెల్లం తినండి. మాంసరసం, బోన్‌సూప్ చాలా మంచిది. ఉప్పు, పులుపు, కారం బాగా తగ్గించాలి. మజ్జిగ బాగా తాగాలి. 
 విహారం
 హీమోగ్లోబిన్ సాధారణ స్థాయికి వచ్చేవరకు మీరు అధిక శ్రమతో కూడిన పనులు చేయకండి. బాగా విశ్రాంతి తీసుకోండి. ప్రాణాయామం రెండుపూటలా చేయండి. మద్యపానం, ధూమపానం, పొగాకు నమలడం వంటి అలవాట్లు ఉంటే వాటన్నింటినీ తక్షణం మానేయండి.
 ఔషధాలు
 దాడిమాద్యఘృతం: ఒకచెంచామందుని పావుకప్పు పాలల్లో కలిపి దానికి కొంచెం చక్కెర కూడా కలిపి, పరగడుపున ఉదయం, సాయంత్రం రెండు పూటలు తాగాలి. 
 పునర్నవాది మండూర (మాత్రలు) : ఉదయం ఒకటి, రాత్రి ఒకటి 
  కాసీస భస్మ: 5 గ్రాములు, అశ్వగంధచూర్ణం 250 గ్రాములు కలిపి అరవై డోసులు చేసి చిన్నచిన్న పొట్లాలు తయారు చేసుకోండి. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తేనె కలిపి తినాలి.
మరిన్ని వార్తలు