బాబుకు తరచూ తలనొప్పి...

11 Jul, 2013 03:22 IST|Sakshi
మా బాబుకు ఏడేళ్లు. ఇటీవల వాడు తరచూ తలనొప్పి అంటూ ఏడుస్తున్నాడు. కొన్నిసార్లు వాంతులు అవుతున్నాయి. చాలాసార్లు కొద్దిపాటి విశ్రాంతితో తలనొప్పి తగ్గినా కొన్నిసార్లు మాత్రం మందు తీసుకున్న తర్వాత గాని తగ్గడం లేదు. కొన్ని సందర్భాల్లో కడుపునొప్పి, కళ్లు తిరుగుతున్నాయని కూడా చెబుతున్నాడు. మా బాబు సమస్య ఏమిటో చెప్పి, తగు సలహా ఇవ్వండి.                          
 - శివాని, నెల్లూరు 
 
 పిల్లల్లో పదేపదే తీవ్రమైన తలనొప్పులకు కారణాలు అనేకం. వాటిలో ముఖ్యమైన వాటిల్లో మైగ్రేన్ ఒకటి. ఇక దీనితో పాటు టెన్షన్ హెడేక్, అటనామిక్ డిస్ట్రబెన్సెస్ వల్ల కూడా తలనొప్పులు రావచ్చు. అలాగే కొన్నిసార్లు కొన్ని సెకండరీ కారణాల వల్ల అంటే... ఇతరత్రా అవయవాల్లో సమస్యల వల్ల... (ఉదాహరణకు సైనసైటిస్, కంటికి సంబంధించిన సమస్యలు లేదా మెదడుకు సంబంధించిన రుగ్మతలు ఉన్నప్పుడు)  కూడా తలనొప్పి రావచ్చు. 
 
 ఇక మీ బాబు విషయానికి వస్తే అది మైగ్రేన్ అని చెప్పవచ్చు. మైగ్రేన్ జబ్బు తరచూ ఒక మాదిరి నుంచి తీవ్రమైన తలనొప్పితో వస్తుంటుంది. ఇది ఒక చోట కేంద్రీకృతమైనట్లుగా ఉండవచ్చు. కొన్నిసార్లు వికారం, వాంతులు, కాంతిని చూడటాన్ని, శబ్దాలు వినడాన్ని ఇష్టపడకపోవడం, కొన్నిసందర్భాల్లో ఏదో అవయవం బలహీనంగా ఉన్నట్లు అనిపించడం, తూలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
 
 తలనొప్పి వచ్చే పిల్లలందరికీ అన్ని పరీక్షలూ అవసరం లేకపోయినప్పటికీ తీవ్రత ఎక్కువగా ఉండటం లేదా దానితో పాటు నరాలకు సంబంధించిన లక్షణాలు (అసోసియేటెడ్ న్యూరలాజికల్ సింప్టమ్స్) ఉన్న కొద్దిమందిలో మాత్రం కొన్ని ఇమేజింగ్ పరీక్షలు అవసరమవుతాయి. 
 
 ఇక చికిత్స విషయానికి వస్తే... తలనొప్పి కనిపించిన సందర్భం (అక్యూట్ ఫేజ్)లో ఎన్‌ఎస్‌ఏఐడీ గ్రూపు మందులతో తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. ఇక దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉన్న పిల్లలకు అది రాకుండా నివారించడానికి కొన్ని మందులు... ఉదాహరణకు ఎమిట్రిప్టిలిన్, ప్రొప్రొనలాల్ వంటివి అనేకం ఇప్పుడు వాడుతున్నారు. ఇలాంటి పిల్లలకు బిహేవియర్ థెరపీతో నొప్పి తీవ్రత తగ్గి, మంచి మెరుగుదల కనిపిస్తుంది. 
 
 ఇక మైగ్రేన్‌ను ప్రేరేపించే ట్రిగ్గర్స్... అంటే ఏదైనా పూట ఆహారం తీసుకోకుండా ఉండటం, నీళ్లు తక్కువగా తాగడం, నిద్రలేమి, కెఫిన్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. 
 
మరిన్ని వార్తలు